నిజాయితీకి ప్రతిరూపం లాల్ బహదూర్ శాస్త్రి

VSK Telangana    02-Oct-2026
Total Views |
 
lal
 
 - అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం 
 
‘‘పొట్టివాడు గట్టివాడు’’ అని తెలుగులో సామెత. ఆ మాట అక్షరాల నిజం. నెపోలియన్ పొట్టివాడు. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు. ఛత్రపతి శివాజీకూడ పొడుగరి కాదు. ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి కూడ పొట్టివాడే. నిజంగా వామనుడే. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు త్రివిక్రమునిలాగా విజృంభించాడు. ఆయన మనస్సు కుసుమం వలె కోమలమైనది. కాని శత్రువుపట్ల వజ్రంవలె కాఠిన్యతను చూపగలుగుతుంది. అందుకే ఒక వైపు శాంతి విధాత. మరొక వైపు జాతి సారథి. సాటిలేని మేటి దేశభక్తుడు. ధైర్యంలో మేరునగధీరుడు. అందుకే భారతదేశ చరిత్రలో ఒక సముజ్జ్వల తారగా వెలుగొందాడు. “భారత రత్న”గా ప్రకాశించాడు.
 
1964 మే 27న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పరమపదించిన తరువాత ఈ దేశానికి నెహ్రూ తర్వాత ఎవరు? అనే ప్రశ్న తల ఎత్తింది. కాంగ్రెసు నాయకులందరూ సమావేశమై సుదీర్ఘంగా ఆలోచించి, చర్చించి ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకొన్నారు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి.  శాస్త్రీజీ ఎంతటి వివాద రహితుడో, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించేవారో అందరితోను ఎంత కలుపుగోలుగా ఉంటూండేవారో చెప్పడానికి ఆ ఒక్క సంఘటన చాలు. ఆ స్వభావమే వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించింది.
 
ఒకసారి ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఒక పిల్లవాడు తండ్రి దగ్గరకు వచ్చి నాన్నా! క్రికెట్ మ్యాచ్ చూడాలని ఉంది పంపించవా? అనడిగాడు గోముగా. వెంటనే తండ్రి ఒక్కక్షణం ఆలోచించి నాయనా! నేను చాల బీదవాడిని. నా వేతనం నా కుటుంబ పోషణకు సరిపోతుంది. నిన్ను క్రికెట్ మ్యాచ్ చూడటానికి పంపించే ఆర్ధిక స్థోమత నాకు లేదు అని చెప్పి ఊరుకున్నాడు. ఆ పిల్లవాడు మౌనంగా వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లిపోయాడు. అతడే అనిల్ శాస్త్రి. ఆ తండ్రే  లాల్ బహదూర్ శాస్త్రి. ఆ సమయంలో  శాస్త్రీజీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహిస్తుండేవారు. ఇదీ వారి నిజాయితీ. నిరాడంబర జీవనం. జీవన పద్ధతి కూడ.
 
ఆ ఇంటి యజమాని ఇంట్లోకి ప్రవేశించాడు. భోజన సమయానికి భోజనానికి పిలిచింది ఇల్లాలు. భోజనం వడ్డిస్తోంది ఆ సమయంలో రేపటినుండి ఇంట్లో ఒక కూర మాత్రమే వండాలి. నేను మంత్రి పదవికి రాజీనామా నమర్పించాను. రెండు కూరలు వండుకుతినే ఆర్థిక స్థితి నాకు లేదు. కాబట్టి తక్షణమే దీనిని అమలు పరచండి అని చెప్పిన ఆ మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. అతని భార్యే లలితాదేవి.  శాస్త్రీజీ నిరాడంబర జీవి. నిగర్వి. నిర్మోహి. అని చెప్పడానికి ఈ సంఘటన చాలు. ఆయన యెంతటి నిబద్ధత, ప్రామాణికత కలిగిన వ్యక్తియో మనమÖహించవచ్చు. ఇది ఆనాటి తరంలోని నాయకుల లక్షణాలు.
 
లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ వద్ద, మరోసారి తమిళనాడులోను రైలు ప్రమాదాలు జరిగాయి. తమిళనాడులో జరిగిన ప్రమాదం చాలా ఘోరమైనది. వాస్తవానికి మంత్రికి ఆ ప్రమాదానికి యే విధమైన సంబంధము లేదు. కాని లాల్ బహదూర్ శాస్త్రి ఆ శాఖను తాను నిర్వహిస్తుండడం వల్ల ఆ శాఖలో జరిగిన ప్రతి పనికి తానే బాధ్యత వహించాలని భావించి ప్రతిపక్షాలు రాజీనామాను కొరకముందే తానే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను సమర్పించారు. ఆ నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. విధులను నిర్వహించడంలో అంత నిక్కచ్చిగా వ్యవహరించేవారు వారు. ఆయన జీవితంలో ఎన్నడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. తాపత్రయ పడలేదు. దిగజారిపోలేదు. అలాగే ఎన్నడూ అవినీతికి పాలుపడలేదు. డబ్బులు సంపాదించుకోలేదు. అవినీతి అన్నది కలికానికి కూడ కనుపించదు వారి జీవితంలో, జీవితాంతము మచ్చలేని మనిషిగా మహామనీషిగా వెలిగాడు.
 
బాల్యంలో లాల్ బహదూరుకు తిలక్ అంటే గౌరవాభిమానాలెక్కువ ఆయనను చూడాలని వారి ఉపన్యాసాలను వినాలని ఉవ్విళ్ళూరేవారు. వారణాసిలో జరిగే తిలక్ గారి ఉపన్యాసానికి ఎంతో దూరంగా ఉన్న శాస్త్రీజీ దారి ఖర్చులకోసం అప్పుచేసి వెళ్లి విన్నాడు. అలాగే మరోసారి గాంధీజీ ఉపన్యాసం విని చైతన్యంతో పొంగిపోయాడు. అ క్షణమే తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేసుకోవాలని నిర్ణయించుకొని స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. 1921 లో మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చి నప్పుడు లాల్ బహదూర్ పాఠశాలను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాడు. బంధువులెంత చెప్పినా తన దృఢ నిర్ణయాన్ని మార్చుకోలేదు. బీదరికాన్ని కూడ లెక్క చేయలేదు. దేశభక్తి మÖర్తీభవించిన వ్యక్తికి దేశంముందు ఏవీ లెక్కకు రావు. దేశంకోసం ముందు వెనుకలాలోచించకుండా అన్నీ వదులు కోవడానికి సిద్ధపడతాడు.
 
కాశీ విద్యాపీఠంలో తత్త్వ శాస్త్రంలో విద్యార్థిగా చేరి 1926 లో శాస్త్రి పట్టా సంపాదించాడు. ఆ తరువాత యావద్దేశమే అతనికి కార్యరంగమైంది. లాలా లజపతిరాయ్ స్థాపించిన “సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటి” అనే సంస్థలో సభ్యుడుగా చేరి జీవనపర్యంతం నిరాడంబరంగా జీవిస్తానని క్రమశిక్షణ కల్గియుండి నీతి నిజాయితీలతో జీవిస్తానని శపథం చేశాడు. దానికనుగుణంగానే ఆఖరి శ్వాసవరకు అలాగే జీవించాడు.
ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడు ఒక కంపెనీలో ఉద్యోగానికి వెడుతున్న సమయంలో లాల్ బహదూర్ శాస్త్రిగారబ్బాయినని కాకుండా యల్.బి. శాస్త్రి గారబ్బాయినని చెప్పుకోమన్నాడు. ఎందుకంటే ఆ కంపెనీ యజమానికి అతడు కేంద్రమంత్రి కుమారుడని తెలిస్తే అర్హత లేకున్నా ఉద్యోగమిస్తాడు. పదోన్నతి కల్పిస్తాడు. అలాగే ప్రభుత్వం నుండి అన్యాయంగా, అక్రమ మార్గాన సహాయాన్ని కూడ అపేక్షిస్తారు. అలా తాను చేయలేనన్నాడు. ఇదివారి నిబద్ధతకు తార్కాణం. అలాగే వారి చరమ దశ సమయంలో కూడా కేవలం బ్యాంకులో వందల రూపాయల్లో మాత్రమే మిగిలిఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడమే కాక అతని నిజాయితీకి నిలువెత్తు పొంగిపోయింది భారత దేశ ప్రజానీకం.
 
స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతోంది. మహాత్మాగాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపు నిచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆ ఉద్యమంలో తన ఉద్బోధనలతో, ప్రసంగాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమానికి తుష్టిని పుష్టిని చేకూర్చాడు. స్వాతంత్య్రోద్యమంలో లాల్ బహదూర్ శాస్త్రి మొత్తం ఏడు పర్యాయాలు బంధింపబడి తొమ్మిది సంవత్సరాల పాటు కారాగార జీవితాన్ననుభవించాడు. ఆ సమయంలో తన కుమార్తెకు అనారోగ్యం కలిగి తనువు చాలిస్తే అంత్యక్రియలు పూర్తిచేసి గడువుకు ముందే కారాగారానికి చేరుకున్న గుండె నిబ్బరం కలిగిన మనిషి ఆయన. కుమారునికి అస్వస్థత కలిగినపుడు కూడ ప్రభుత్వం విడుదల చేస్తే ఆరోగ్యం చేకూరసప్పటికీ తిరిగి జైలుకు వెళ్లిన ధీశాలి. చెరసాల జీవితాన్నే చంద్రశాల జీవితంగా భావించిన ధైర్యవంతుడు. ఆ సమయంలో అనేక గ్రంథాలను చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. రేడియంను కనిపెట్టిన ఫ్రెంచి వైజ్ఞానికురాలు మేడం క్యూరీ జీవితాన్ని హిందీ భాషలోకి అనువదించారు.
 
లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత యెన్నో పదవులను అతి సమర్థవంతంగా నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్‌లో పండిత గోవింద వల్లభ పంత్ మంత్రివర్గంలో గృహమంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. హోం మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాలలో సమ్మెలు జరిగినప్పుడు ఎన్నడూ కాల్పులు జరిపించలేదు. లాఠీలను ఝళిపించలేదు. హోం మంత్రిగా ఉండికూడ గృహంలేని మంత్రి  లాల్ బహదూర్, అందరూ ఆయనను గృహం లేని గృహ మంత్రి అంటుండేవారు. అలహాబాద్ లో ఒక చిన్న ఇంట్లో ఆయన అద్దెకుండేవాడు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ప్రభుత్వ క్వార్టరును వెంటనే ఖాళీ చేశాడు.
 
1962 లో చైనా భారత దేశం మీద దురాక్రమణ చేసింది. అయితే అప్పుడు జాతి యావత్తు చైనాకు వ్యతిరేకంగా ఒక్క త్రాటిమీద నిలబడింది. చైనా ముప్పును తొలగించుకోగలిగాం కాని అది ఆక్రమించిన 3200 చ.కి.మీ. భూభాగాన్ని నేటికీ సంపాదించుకోలేక పోయాము.1964 మే 27 న జవహర్లాల్ నెహ్రూ మరణిచిన తరువాత లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధాన మంత్రి బాధ్యతలు చేబట్టారు. ఇరుగు పొరుగున
కాచుక్కూర్చున్న చైనా మరియు పాకిస్థానీయులు విజృంభించారు. సరిహద్దులలో సమస్యలను సృష్టిస్తున్నారు.  శాస్త్రిగారు ఏ మాత్రం ఆందోళన చెందలేదు. అప్పుడే అలీన దేశాల సమావేశానికి వెళ్ళారు.
 
రష్యా, ఈజిప్టు, కెనడా, బ్రిటన్లను సందర్శించి ఆయా దేశాల వారికి భారత దేశ వైఖరి యేమిటో స్పష్టం చేసి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. 1965 ఏప్రిల్, మే మాసాలలో పాకిస్థాన్ గుజరాత్ కచ్ రాణా పై సైన్యాన్ని మోహరించింది. లాల్ బహదూర్ ధీటుగా సమాధానం చెప్పారు. పాకిస్థాన్ తోక ముడిచింది. ఉభయ దేశాలు యుద్ధం ఆపాలని నిర్ణయం చేశాయి. ఒప్పందం కుదిరింది. అదే చరిత్రలో కచ్-రాణా ఒప్పందంగా నిలిచింది. ఆ సంతకపు నిరా ఆరకముందే పాకిస్థాన్ మళ్లీ కాశ్మీరుపై దాడిచేసింది. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి భారత ముస్లింలను రెచ్చగొట్టింది. శాస్త్రీజీ దెబ్బకు దెబ్బతో సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైందిని భావించి సైన్యాధిపతికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ముందుకురికి దెబ్బతీయండి అని ఆదేశించాడు.
 
పాకిస్థాన్ ఆగడాలను గురించి ప్రస్తావిస్తూ మనం బల ప్రయోగాన్ని బల ప్రయోగంతోనే ఎదుర్కొంటాం. అంతేగాదు మనం నాశమైనా ఫరవాలేదు భారత జాతి మరియు భారత పతాకాల సమున్నత గౌరవాన్ని నిలిపి ఉంచేందుకు చివరివరకు పోరాడుదాం అని గర్జించాడు. అదే సమయంలో చైనా భారత దేశం మీద అసత్యారోపణలు చేస్తూ భారత దేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించింది.
అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడ లాల్ బహదూర్ శాస్త్రి యేమాత్రం తొణకలేదు. బెదరలేదు. పైగా భారతదేశం మీద చైనా దాడిచేస్తే మన స్వాతంత్య్రంకోసం చైనాతో యుద్ధం చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం. మనం చైనా శక్తిని చూసి భయపడటంలేదు. అని నిర్భయంగా ఘోషించాడు.
 
భారత సైన్యం పాకిస్థాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొడుతోంది. పాకిస్థాన్‌లోకి భారత సైన్యం దూసుకు పోతోంది అదే సమయంలో ఐక్యరాజ్య సమితి యుద్ధం విరమించమని పిలుపునిచ్చింది. రష్యా ప్రధాని కోసిగిన్ చొరవ మేరకు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన్, భారత ప్రధాని లాల్ బహదూర్ లకు తాష్కెంటులో సంప్రదింపులకు సమావేశం జరిగింది. 1966 జనవరి 10 న సంధి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కాని ఆ మరుసటి రోజే తాష్కెంటు నుండి భారత ప్రధాని మృతదేహం, విమానం నుండి భారత్ లో దిగింది. కోట్లాది మంది భారతీయులు దిగ్భ్రమచెందారు. శోక సముద్రంలో మునిగిపోయారు. విజయం సాధించి కూడ సింహాన్ని కోల్పోయామని కుమిలి పోయారు. శాస్త్రీజీ అమరుడైనాడు. జాతి, దేశ సౌభాగ్యాల కోసం ఆయనిచ్చిన జై జవాన్ -జై కిసాన్ నినాదం జాతి జీవనానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలైనాయి. నీతి నిజాయితీలు మÖర్తీభవించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి అడుగు జాడలలో ఈ తరం రాబోయే తరాలు నడిస్తే మళ్లా భారతదేశం జగద్గురువుగా విరాజిల్లుతుంది.
 
(స్ఫూర్తి పత్రిక నుంచి)