దైనిక్ జాగరణ్ ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ గుప్తా ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. విజయదశమి పండుగతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి ఉత్సవాల సందర్భంగా తనను ఆహ్వానించినందుకు ఆర్ఎస్ఎస్కు ధన్యవాదాలు తెలిపారు. దీనిని తనకెంతో గర్వకారణమని చెప్పారు.
సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను వివరించారు సంజయ్ గుప్తా. "101 సంవత్సరాల క్రితం సంఘ్ ఏర్పడినప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం రాలేదు. నాటి సామాజిక పరిస్థితులు భిన్నంగా ఉండేవి. హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం, శక్తివంతంగా తీర్చిదిద్దడంతో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేందుకు కృషి చేయడమే సంఘ్ స్థాపన వెనుక ఉన్న మూల భావన. బానిసత్వ మనస్తత్వం నుంచి సమాజాన్ని విముక్తి చేసి, ఆత్మన్యూనతను పోగొట్టి ఆత్మగౌరవ భావనను పెంపొందించకుండా నిజమైన స్వాతంత్య్రాన్ని ఊహించలేమని ఆనాడే సంఘ్ నమ్మింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యక్తుల నిర్మాణం, భారతీయత, జాతీయ బాధ్యతలను సంఘ్ తన ప్రధాన లక్ష్యాలుగా మార్చుకుంది. స్వాతంత్య్రం అనంతరం అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయ వ్యవస్థలోని ఒక విభాగం సంఘ్ ఈ గొప్ప సిద్ధాంతాన్ని ఆమోదించలేదు. ఎందుకంటే సంఘ్ ఆలోచనా విధానం వారి తుష్టీకరణ (ఓటు బ్యాంక్) అజెండాతో సరిపోలలేదు" అని పేర్కొన్నారు.
అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ సంఘ్ తన మార్గంలో ముందుకు సాగిందని ఆయన గుర్తుచేశారు. "భారతదేశం రిపబ్లిక్‌గా మారిన తర్వాత, సంఘ్ కృషి , సిద్ధాంతాలతో ప్రేరణ పొందిన కొందరు రాజకీయ నాయకులు, జాతీయ భావాలు కలిగిన మేధావులు కలిసి జన్‌సంఘ్‌ను స్థాపించారు. కాలక్రమేణా ఆ జన్‌సంఘ్ భారతీయజనతా పార్టీగా రూపాంతరం చెంది, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది" అని వివరించారు.
సంఘ్ నేర్పిన విలువలు, అందించిన నాయకత్వ పటిమను సంజయ్ గుప్తా కొనియాడారు. "ఈ పార్టీలోని అగ్రనేతలలోనే కాక అనేకమంది నాయకులలో కనిపించే భారతీయత, జాతీయత, భారతీయ విలువల పట్ల అవగాహన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచే లభించాయి. ఈ పార్టీ విజయాల వెనుక సంఘ్ భావజాలపునాది, సంస్థాగత బలం ఉన్నాయని అంగీకరించడంలో ఎలాంటి సందేహం లేదు" అని స్పష్టం చేశారు.
హిందూత్వ విలువలను కాపాడటంలో సంఘ్ పాత్రను ఆయన ప్రశంసించారు. "సంఘ్, దాని అనుబంధ సంస్థలు, బిజెపితో సహా సంఘ్ భావజాలంతో నడిచే సంస్థలపై హిందూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలు పదేపదే వస్తుంటాయి. ఒకవేళ సంఘ్ లేకపోయి ఉంటే హిందూ విలువలు, హిందూ జీవన విధానం ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయేవి" అని అన్నారు.
"మొదట మొఘలుల పాలన, తర్వాత బ్రిటీషర్ల పాలన సాగింది. దాదాపు ఆరువందల సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయతకు, హిందూత్వకు ప్రత్యేక గుర్తింపు ఉందంటే ఆ క్రెడిట్ నిస్సందేహంగా సంఘ్‌కే దక్కుతుంది. నూరేళ్ల రజతోత్సవాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా భవిష్యత్తు 100 ఏళ్లలో సమాజంలో నిరంతర మార్పులు తీసుకురావడానికి, భారతీయ సాంస్కృతిక విలువలను నెలకొల్పడానికి సంఘ్ కృషి చేస్తోంది. ఎందుకంటే నేటికీ అనేక సవాళ్లు మిగిలే ఉన్నాయి" అని చెప్పారు.
సామాజిక రుగ్మతలను తొలగించడానికి సంఘ్ వంటి సంస్థలు ఎల్లప్పుడూ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘ్ నిష్కామ సేవతో పనిచేస్తుందని చెప్పారు. రాజకీయ పార్టీలకు కూడా సామాజిక సంస్కరణల బాధ్యత ఉన్నప్పటికీ, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వచ్చే రాజకీయ ఆకాంక్షలు కొత్త సామాజిక రుగ్మతలకు దారితీస్తాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది రాజకీయ నాయకులను మినహాయిస్తే, స్వంత అభివృద్ధి విషయంలో ప్రజలు రాజకీయ నాయకులను నమ్మరని, అందుకే సంఘ్ వంటి సంస్థల అవసరం, ప్రాముఖ్యత మరింత పెరిగిందని తెలిపారు.
భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సంజయ్ గుప్తా అన్నారు. "రాబోయే 20-25 ఏళ్లలో మనం సమృద్ధి కలిగిన దేశంగా ఎదుగుతాం. కానీ ఈ సమృద్ధి మన చైతన్యాన్ని, అంతరాత్మను కూడా అభివృద్ధి చేస్తుందా? అనే సందేహాలు ఉన్నాయి. నేటి సమాజం కులం, తరగతి వైషమ్యాలు, తెగలు, మతాల వారీగా విడిపోయి సహన లోపంతో కనిపిస్తోంది. దేశం పట్ల నిబద్ధత ఉన్నప్పటికీ, నిబంధనలను గౌరవించి నడుచుకోవడానికి అవసరమైన నైతికత, బాధ్యత, కర్తవ్యాలపై చాలామంది పౌరులలో అవగాహన కొరవడింది. అలాగే సమాజంలో డిసిప్లిన్ లోపించడం మరొక సమస్య. ప్రభుత్వం మనకేం చేసిందనే ఆలోచిస్తున్నారు తప్ప, దేశం మనకు అన్ని ఇస్తున్నప్పుడు మనమూ తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ధోరణి చాలామందిలో కనిపించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
దైనిక్ జాగరణ్ పత్రిక ఆలోచనా విధానం కూడా సంఘ్ భావజాలాన్నే ప్రతిబింబిస్తుందని గుప్తా తెలిపారు. "పౌరులకు దేశం పట్ల ఉండే బాధ్యతలపై అవగాహన లోపిస్తోంది. ఈ సవాళ్లన్నింటినీ సంఘ్ సరిగ్గా అర్థం చేసుకుని పనిచేస్తోంది. దైనిక్ జాగరణ్ ఎడిటోరియల్ పాలసీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. 'దైనిక్ జాగరణ్ విశ్వాసాన్ని నమ్మే పత్రిక, దేశానికి అంకితమైన పత్రిక, సనాతన భారతీయ నాగరికత విలువలను ముందుకు తీసుకెళ్లే పత్రిక' అనేది మా విధానం. దీని ఆత్మ సనాతన భారతీయ విలువల్లోనే ఉంది. సానుకూల దృక్పథంతో సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తూ పాఠకులకు ప్రేరణ ఇస్తుంది. దేశం కోసం పౌరులు ఏం చేయగలరు, ఏం అందించగలరు అనే భావనను రగిలించడమే దీని లక్ష్యం. ఈ కోణంలో చూస్తే సంఘ్, జాగరణ్ భావజాలాలు భారత్ సనాతన సంస్కృతి, దేశం పట్ల ఉన్న అంకితభావంలో ఒకేలా ఉంటాయి. బాధ్యతాయుతమైన మీడియా సమూహంగా పౌరులకు బాధ్యతలను గుర్తుచేయడం మా నైతిక బాధ్యత. విద్యావంతమైన సమాజం, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ఆరోగ్యవంతమైన సమాజం, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, జనాభా నియంత్రణ అనే 7 ప్రధాన అంశాలపై జాగరణ్ నిరంతరం పనిచేస్తోంది" అని వివరించారు.
దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేవని ఆయన అన్నారు. "స్వాతంత్య్రం తర్వాత సనాతన భారతీయ విలువలను ప్రచారం చేస్తూ వాటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన సంస్థ మరొకటి లేదు. ఒక దేశ ప్రజల విలువలు, సాంస్కృతిక విశిష్టతలే ఆ దేశాన్ని నిర్వచిస్తాయి. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు గుర్తింపు రావడానికి ఆర్థిక బలం తోడ్పడినప్పటికీ, వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లే ఈ నేల సాంస్కృతిక విశిష్టత నేటికీ తన ప్రాముఖ్యతను నిలబెట్టుకుంది" అని తెలిపారు.
"ఈనాడు భారతీయ సాంస్కృతిక భూభాగంలో అనేక సంప్రదాయాలు, జీవన విధానాలు ఉన్నాయి. ఇవన్నీ హిందూ మతం నుంచే ఉద్భవించాయని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. కాలక్రమేణా హిందూ జీవన విధానంలో కొన్ని లోపాలు రావడం వల్ల అనేక మార్గాలు ఏర్పడ్డాయి. స్వతంత్ర భారత కోణంలో చూస్తే, ఆర్ఎస్ఎస్ లేదా దాని విలువల ఆధారంగా పనిచేసే సంస్థలు లేకపోతే కులాల ప్రాతిపదికన హిందూ జీవన విధానాన్ని రాజ్యాంగంలో వేర్వేరుగా వర్గీకరించి, హిందూ సమాజాన్ని మళ్లీ విభజించడానికి ఎక్కువ సమయం పట్టదు" అని హెచ్చరించారు.
గత శతాబ్దంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్న సంఘ్, రాబోయే శతాబ్దంలో వ్యక్తుల నైతిక ప్రవర్తన (క్యారెక్టర్) నిర్మాణాన్ని ప్రధాన ధ్యేయంగా ఎంచుకుందని గుప్తా చెప్పారు. "మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి దేశం పట్ల తన బాధ్యతలను సరిగ్గా అర్థం చేసుకుంటాడు. దేశం పట్ల నిబద్ధత, కర్తవ్య నిష్ట అనేవి ఉత్తమ పౌరుడి లక్షణాలు. భారత్ తన స్వర్ణయుగాన్ని పునరుద్ధరించుకోవాలంటే వ్యక్తుల నైతిక ప్రవర్తన నిర్మాణం లేకుండా సాధ్యం కాదు. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ రోజున మాకీ అవకాశం ఇచ్చిన సంఘ్ నాయకత్వానికి ధన్యవాదాలు. భారత్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను మరింత శక్తివంతం చేయాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నాను" అని ప్రసంగాన్ని ముగించారు.