సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ – ఆధ్యాత్మిక స్ఫూర్తి, సామాజిక సమరసతకు ప్రతీక

VSK Telangana    20-Oct-2026
Total Views |


ravidas 

భారతీయ ఆధ్యాత్మిక, భక్తి పరంపరలో సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్‌కు ఎంతో విశిష్టమైన స్థానముంది. ఒక మహానటుడు, కవి, సామాజిక సంస్కర్త అయిన ఆయన.. భక్తి, నిరంతర శ్రమ, సరళత్వం, కరుణతో కూడిన తన జీవితం ద్వారా సమాజానికి పరమ సత్యాలను అందించారు. నాటి కాలంలో సమాజంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు తీవ్రంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి గొప్పతనం ఆయన పుట్టుకను బట్టి కాకుండా ప్రవర్తన, గుణగణాలు, అంకితభావం పైనే ఆధారపడి ఉంటుందని చాటిచెప్పారు.

ప్రస్తుతం 2026 సంవత్సరం సంత్ రవిదాస్ జీ 650వ జయంతి సంవత్సరంగా నిలుస్తోంది. అక్టోబర్ 20న నాగ్‌పూర్‌లో జరిగిన విజయాదశమి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో సంత రవిదాస్ సేవలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఆయన త్యాగం, తపస్సు, ధర్మనిష్ఠ, సామాజిక సమరసతకు చేసిన సేవలను కొనియాడారు.

 

భక్తి ఉద్యమ శిఖరం – సమానత్వ నినాదం:

 

భక్తి ఉద్యమంలో గురు రవిదాస్ ఒక కీలకమైన కవి-సన్యాసిగా నిలిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన ప్రతి పౌరుడికి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక హక్కులు సమానంగా దక్కాలని గళమెత్తారు. మానవత్వం, సోదరభావం, స్వేచ్ఛ, సమతా భావనలను బలంగా ప్రచారం చేశారు.

 

వారణాసి సమీపంలోని సీర్ గోబర్ధన్‌పూర్ (ప్రస్తుతం 'శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన్') లో మాఘ పౌర్ణమి నాడు ఆయన జన్మించారు. ఆయన తల్లి కల్సా దేవి, తండ్రి సంతోఖ్ దాస్. ఆయన తండ్రి చెప్పులు కుట్టే పని చేసేవారు. రవిదాస్‌కు చిన్నతనం నుంచే దైవభక్తి, ధైర్యం మెండుగా ఉండేవి. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన తన కవితలను, రచనలను ఆయుధాలుగా మలుచుకున్నారు.

 

రవిదాస్ ప్రతిభను గుర్తించిన ఆయన గురువు పండిట్ శారదా నంద్, తన పాఠశాలలో రవిదాస్‌కు విద్యను అందించారు. భవిష్యత్తులో రవిదాస్ గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఎదుగుతారని ఆయన నాడే విశ్వసించారు. వయస్సు పెరిగే కొద్దీ శ్రీరాముడిపై రవిదాస్‌కు భక్తి పరాకాష్టకు చేరింది. రాముడు, రఘునాథ్, కృష్ణుడు, హరి, గోవిందుడు అనే పేర్లతో దైవాన్ని నిరంతరం స్మరించేవారు.

 

మీరాబాయికి ఆధ్యాత్మిక గురువు:

 

రాజస్థాన్ రాజకుమారి, చిత్తూర్ రాణి కుమార్తె అయిన గొప్ప భక్తురాలు మీరాబాయి.. గురు రవిదాస్ బోధనలకు తీవ్రంగా ఆకర్షితురాలయ్యారు. ఆయనను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించారు. రవిదాస్ జీమహత్యం వల్ల తాను ఎన్నో రకాల గండాల నుంచి బయటపడ్డానని మీరాబాయి తన రచనల్లో పేర్కొన్నారు.

 

"దేవుడు మనిషిని సృష్టించాడు తప్ప, మనిషి దేవుడిని సృష్టించలేదు" అని రవిదాస్ గట్టిగా చెప్పేవారు. సమాజంలో అంటరానితనాన్ని నశింపజేసేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. కులం లేదా మతం ఆధారంగా కాకుండా మనిషి చేసుకునే మంచి పనుల బట్టే గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు.

 

గురుగ్రంథ్ సాహిబ్‌లో విశిష్ట స్థానం:

 

సమాజంలో అసమానతలను పెంచే ఏ చర్యలనైనా ఆయన తీవ్రంగా నిరసించారు. మానవత్వానికే ప్రాధాన్యమిచ్చిన ఆయన దివ్య బోధనలు, భక్తి గీతాలను సిక్కుల ఐదవ గురువు 'గురు అర్జున్ దేవ్' పవిత్ర "గురుగ్రంథ్ సాహిబ్" లో చేర్చారు. ఈ కారణంగానే ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ నాగ్‌పూర్ విజయాదశమి సభలో ఆయన పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.