అయోధ్య : దేవీ శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకొని, అయోధ్య రామ మందిరంలో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ రామ్ లల్లాకి మహాభిషేకం, శస్త్ర పూజ, ప్రత్యేక ఛప్పన్ భోగ్ సమర్పణతో పాటు కన్యాపూజ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కన్యాపూజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలు విజయ దశమి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే శ్రీ రామ్ లల్లా కి మహాభిషేకంతో ప్రారంభమయ్యాయి. సంప్రదాయ ధార్మిక విధివిధానాల ప్రకారం స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, పంచదార మరియు కొబ్బరినీళ్లతో సమంత్రకంగా స్నపనాభిషేకం నిర్వహించారు.
శాస్త్రాలలో సూచించిన విధంగా శస్త్ర పూజ నిర్వహించగా, ఆలయ ప్రాంగణంలోని దుర్గాదేవి ఆలయంలో మాతా దుర్గమ్మ దివ్య ఆయుధాలకు విడిగా పూజలు చేశారు. మధ్యాహ్నం రాజభోగం సమయంలో శ్రీరామ్ లల్లాకు 56 రకాల వంటకాలతో కూడిన ప్రత్యేక 'ఛప్పన్ భోగ్'ను నివేదించారు.
ఒక ముఖ్యమైన నూతన యత్నంలో భాగంగా, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ ప్రాంగణంలోని యజ్ఞశాలలో సంప్రదాయ కన్యా పూజ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. సుమారు 18 మంది చిన్నారులను జగన్మాత స్వరూపాలుగా భావించి పూజించారు. భక్తిశ్రద్ధలతో, వారి పాదాలను కడిగి,, సంప్రదాయ చునరీలను బహుకరించారు.శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, నిర్మోహి అఖారాకు చెందిన స్వామి దినేంద్ర దాస్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఈ పూజాధికాలను ఆచార్య కేశవ్, భవానీ సింగ్ నిర్వహించారు. పూజ అనంతరం ఆ చిన్నారులకు సంప్రదాయ కన్యా భోజనం వడ్డించి, పండ్లు, చాక్లెట్లు, టాఫీలు, స్టేషనరీ వస్తువులు, దక్షిణలను అందజేశారు.
ఈ వేడుకలో ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా (రిటైర్డ్), కార్యదర్శి జగదీష్ అఫ్లే, ట్రస్టీ కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
శ్రీరామ్ లల్లా ఎదుట పవిత్ర కలశ స్థాపన (ఘటస్థాపన)తో ప్రారంభమైన శారదీయ నవరాత్రి పవిత్ర ఉత్సవాల అనంతరం ఈ విజయదశమి వేడుకలు జరిగాయి. నవరాత్రి క్రతువుల ముగింపుగా నవమి నాడు ఐదుగురు ఆలయ పూజారులు షట్ చండీ పారాయణం నిర్వహించగా, దశాంశ హవనం మరియు పూర్ణాహుతి ఘట్టాలను పూర్తి చేశారు.