మక్కాలోని మసీదులో ‘‘అనైతిక చర్య’’కి పాల్పడ్డారన్న అభియోగంతో ఇద్దరికి మరణ శిక్ష..

VSK Telangana    21-Oct-2026
Total Views |
 
makka
 
మక్కాలోని  ఓ మసీదులో అనైతిక చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక బంగ్లాదేశీ జంటను ఈనెల 14న సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. వారు అనైతిక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆ జంటను దోషిగా తేల్చింది. తజిర్(ఇస్లామిక్ చట్టాల్లో ఒకటిది) చట్టం ప్రకారం.. వారు నేరానికి పాల్పడ్డారని న్యాయాధికారులు నిర్ధారించారని సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశీ జంట అనైతిక చర్యకు పాల్పడడం వల్లే వారిని ఉరితీశారని ఆ శాఖ వెల్లడించింది. అయితే, ఆ జంట పాల్పడిన అనైతిక చర్య ఏమిటో ఆ శాఖ స్పష్టంగా వెల్లడించలేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఆ జంట ముద్దు పెట్టుకొని వుంటారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
 
 
అలాగే ఈ సమాచారం ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా తెలియదు. తమకు సౌదీ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించింది. సౌదీ మీడియా ప్రకారం నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితి అక్తర్​లను బంగ్లాదేశీయులుగా గుర్తించినట్టు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే వారు భార్యాభర్తలా అన్నది తెలియరాలేదు. ఇటీవలే మక్కా మసీదులో ఆ జంట అనైతిక చర్యకు పాల్పడిందని ఆ శాఖ తెలిపింది. దీంతో భద్రతా అధికారులు వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరిపి అభియోగాలు మోపారు. తర్వాత వారిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టారు. అధికారులు వారిపై మోపిన అభియోగాలను కోర్టు ధ్రువీకరించింది. తర్వాత ఆ జంటకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈనెల 14న వారిని ఉరితీసినట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే ముద్దు పెట్టుకున్నంత మాత్రాన మరణ శిక్ష విధించేస్తారా? అంటూ ప్రపంచ వ్యాప్తంగా అరేబియా పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.