స్టార్‌లింక్ , డిజిటల్ సార్వభౌమాధికార ప్రశ్న

VSK Telangana    22-Oct-2026
Total Views |
 
ms
 -
సయ్యద్ అక్బరుద్దీన్
 
ఏదైనా ఒక బాహ్య శక్తి దేశీయ అత్యవసర సేవలకు అంతరాయం కలిగించినప్పుడు, తీవ్ర నష్టం వాటిల్లకముందే భారతదేశం వాటిని పునరుద్ధరించలేకపోతే, ఆ ఆధారపడడమే (డిపెండెన్స్) సార్వభౌమాధికారానికే సవాలుగా మారుతుంది.
 
సెప్టెంబర్ 21, 2026 న, ఢిల్లీ హైకోర్టు నయారా ఎనర్జీకి సాఫ్ట్‌వేర్ మద్దతును పునరుద్ధరించాలని SAP ఇండియాను ఆదేశించింది. జర్మన్ సాఫ్ట్‌వేర్ గ్రూప్ భారతీయ విభాగం సదరు రిఫైనరీపై యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ఆంక్షలను ఇందుకు కారణంగా పేర్కొంది. ఆ ఒప్పందం భారతీయ చట్టాల ప్రకారం నడుస్తున్నప్పటికీ, అది సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చేయలేకపోయింది. నయారా సంస్థ గతంలో మైక్రోసాఫ్ట్‌తో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ వాటాదారులుగా ఉన్న ఈ రిఫైనరీపై EU ఆంక్షలు విధించడంతో, జూలై 2025 లో అమెరికన్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ తన డిజిటల్ సేవలను నిలిపివేసింది. నయారా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సేవలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి. ఈ అంతరాయానికి అంతర్జాతీయంగా ఆంక్షలను ఆటోమేటిక్‌గా అమలు చేసే ఒక స్వయంచాలక కంప్లయన్స్ సిస్టమ్ (automated compliance system) కారణమని మైక్రోసాఫ్ట్ తర్వాత వివరణ ఇచ్చింది.
 
చాలా మంది భారతీయులు SAP లేదా మైక్రోసాఫ్ట్ లైసెన్సింగ్ బృందాలతో నేరుగా ఎప్పుడూ వ్యవహరించకపోవచ్చు. కానీ వారు ఇలాంటి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఆసుపత్రులు, బ్యాంకులు, టెలికాం నెట్‌వర్క్‌లు , ప్రభుత్వ సేవలపై ఆధారపడతారు. డిజిటల్ సార్వభౌమాధికారం అంటే ప్రపంచం నుండి విడిపోవడం కాదు. విదేశీ చట్టాలు, సరఫరాదారులు లేదా ఆంక్షలు సాంకేతికతకు ఆటంకం కలిగించినప్పుడు కూడా అత్యవసర సేవలను నిరంతరాయంగా నడపగలగడమే డిజిటల్ సార్వభౌమాధికారం. అంటే ఒత్తిడిని తట్టుకుని నిలబడగల ప్రత్యామ్నాయాలను కలిగి ఉండటం. ఆ అధికారాన్ని చెలాయించే సంస్థలు పౌరులకు జవాబుదారీగా ఉండాలి, అలాగే డిజిటల్ వ్యవస్థలు సేవలను నిరాకరించినప్పుడు లేదా వారి హక్కులను ఉల్లంఘించినప్పుడు వారికి న్యాయం జరిగేలా చూడాలి.
భౌగోళిక సార్వభౌమాధికారం (Territorial sovereignty) దేశాలను ఆర్థిక ఒత్తిళ్ల నుండి ఎన్నడూ రక్షించలేదు.
 
డిజిటల్ వ్యవస్థలు ప్రాక్టికల్ నియంత్రణను పలు దేశాలకు విస్తరించాయి. ఒక భారతీయ సేవ అమెరికన్ సాఫ్ట్‌వేర్ , తైవాన్ చిప్‌లను ఉపయోగించవచ్చు, దాని నిర్వహణ రిమోట్‌గా జరగవచ్చు మరియు యాక్సెస్ విదేశాలలో జారీ చేయబడిన లైసెన్స్‌ల ద్వారా నియంత్రించబడవచ్చు. భారతీయ చట్టం ఆ సేవను నియంత్రించినప్పటికీ, దానికి అవసరమైన లైసెన్స్‌లు, అప్‌డేట్‌లు మరియు సపోర్ట్ నిరంతరాయంగా లభిస్తాయనే గ్యారెంటీ ఉండదు. హ్యాకర్ల నుండి సురక్షితంగా ఉన్న వ్యవస్థ కూడా దాని సరఫరాదారు మద్దతును కోల్పోవచ్చు. డేటా లోకలైజేషన్ (Data localisation) అనేది సమాచారం ఎక్కడ ఉందో మాత్రమే నిర్ధారిస్తుంది, కానీ ఆ వ్యవస్థను ఎవరు ఆపరేట్ చేయగలరు, ఎవరు బాగు చేయగలరు లేదా దానిని వేరే చోటికి ఎవరు మార్చగలరు అనే విషయాలను తేల్చలేదు. స్వదేశీ ఉత్పత్తి మన ప్రత్యామ్నాయాలను మెరుగుపరుస్తుంది, అయితే ప్రతి విడిభాగాన్ని ఇక్కడే తయారు చేయడం వల్ల భారతదేశానికి ఇతర ప్రాధాన్యతల కోసం అవసరమైన వనరులు తగ్గుతాయి. ఒక బయటి శక్తి అత్యవసర సేవకు అంతరాయం కలిగించగలిగినప్పుడు, తీవ్రమైన నష్టం జరగకముందే భారతదేశం దానిని పునరుద్ధరించలేనప్పుడు, ఆ డిపెండెన్స్ సార్వభౌమాధికార సమస్యగా మారుతుంది.
 
భూగోళ రాజకీయాలు (Geopolitics) భారతదేశ సాంకేతిక ఎంపికల నిబంధనలను మారుస్తున్నాయి. అమెరికా ఎగుమతి నియంత్రణలు అధునాతన చిప్‌ల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. చైనా ఖనిజాల నియంత్రణలు ఉత్పాదక రంగాన్ని అతలాకుతలం చేయగలవు. EU నిబంధనలు ఒక ముఖ్యమైన మార్కెట్ యాక్సెస్‌ను శాసిస్తున్నాయి. ఈ సాధనాల ఉద్దేశాలు ,పరిణామాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం మాత్రం ఒకేలా ఉంటుంది. ఒక భారతీయ సంస్థ తమ యాక్సెస్ అనేది మరెక్కడో తీసుకున్న నిర్ణయాలపై ఆధారపడి ఉందని గుర్తించవచ్చు. స్నేహపూర్వక సంబంధాలు ఉన్నంత మాత్రాన ఒక విదేశీ సరఫరాదారు భారతీయ వినియోగదారులకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడని గ్యారెంటీ లేదు. సాంకేతిక భాగస్వామ్యానికి లైసెన్సింగ్ నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధ , యాక్సెస్ కట్ అయితే ఏం చేయాలనే ప్రణాళికలు అవసరం.
 
భారతదేశంలోకి స్టార్‌లింక్ ప్రవేశించే అవకాశం కనెక్టివిటీపై ఇలాంటి ప్రశ్ననే లేవనెత్తుతుంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించగలదు . టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లు విఫలమైనప్పుడు బ్యాకప్‌గా ఉపయోగపడుతుంది. కానీ ఉక్రెయిన్ ఒక హెచ్చరికను ఇస్తోంది: రష్యా దాడుల సమయంలో స్టార్‌లింక్ కనెక్టివిటీపై ముందస్తు సమాచారం లేకుండా విధించిన పరిమితులు తమ సైనిక డ్రోన్ మిషన్లకు అంతరాయం కలిగించాయని అక్కడి అధికారులు తెలిపారు. మిలిటరీ సేవ అయిన 'స్టార్‌షీల్డ్' ఆపరేటింగ్ పరిమితులను యుఎస్ ప్రభుత్వమే నియంత్రిస్తుందని ఇలోన్ మాస్క్ చెప్పారు. భారతదేశ పౌర అవసరాలు భిన్నంగా ఉండవచ్చు, కానీ స్థానిక గ్రౌండ్ స్టేషన్లు ఉన్నంత మాత్రాన నెట్‌వర్క్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని చెప్పలేము. అత్యవసర సేవలు దీనిపై ఆధారపడటానికి ముందే, భారతదేశానికి పని చేయగల ప్రత్యామ్నాయాలు అవసరం.
 
భారతదేశం గతంలోనూ ఇలాంటి పరీక్షలను ఎదుర్కొంది. 1998 అణు పరీక్షల తర్వాత, అమెరికా ఆంక్షల కారణంగా ఒక యుఎస్ భాగస్వామి లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) యొక్క ఫ్లైట్-కంట్రోల్ ప్రోగ్రామ్ నుండి తప్పుకున్నారని ఎపిజె అబ్దుల్ కలాం ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఆ భాగస్వామి తన ప్రాంగణంలో ఉన్న భారతీయ పరికరాలు, సాఫ్ట్‌వేర్ మరియు సాంకేతిక సమాచారాన్ని తన వద్దే ఉంచుకుంది. అయినప్పటికీ, భారతీయ బృందాలు సుదీర్ఘ కాలంగా నిర్మించుకున్న నైపుణ్యం, సంస్థల ఆధారంగా, నిరంతర అభివృద్ధి , పరీక్షల ద్వారా ఆ వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేశాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారీ స్థాయిలో నిర్మించగల సామర్థ్యం మనకు ఉందని UPI నిరూపించింది. మన సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రపంచ మార్కెట్లకు సేవలందిస్తున్నాయి; భారతీయ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతున్నారు. ఇటువంటి అనుసంధానాలు జ్ఞానం, ఆదాయం ప్రభావాన్ని తెస్తాయి. చట్టబద్ధమైన డేటా ప్రవాహాలను పరిమితం చేయడం లేదా ఉపయోగకరమైన విదేశీ సాంకేతికతను అనవసరంగా ఖరీదైనదిగా చేయడం వల్ల భారతదేశం మరింత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన సంస్థలు వ్యాపారాలు బలహీనపడవచ్చు.
 
ప్రపంచ సాంకేతిక మార్కెట్లలో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన భారతీయ సంస్థలకు తాము ఉపయోగించే సాంకేతికతపై నియంత్రణ లభించదు. భారతదేశంలో జరిగే పరిశోధనలు కేవలం పత్రాలు , ప్రోటోటైప్‌లకే పరిమితం కాకుండా, మనం ఇక్కడే నిర్వహించుకోగల మరియు మెరుగుపరచగల ఉత్పత్తులుగా మారాలి. విదేశీ సరఫరాదారు వెళ్లిపోయిన తర్వాత కూడా వ్యవస్థలను నడపగల నైపుణ్యాలతో కూడిన సామర్థ్యానికి సబ్సిడీలు మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వ మద్దతు భారతీయ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఉండాలి, అంతే కానీ దేశీయ సరఫరాదారులను పోటీ నుండి రక్షించేలా ఉండకూడదు. సార్వభౌమాధికారానికి మెయింటెనెన్స్ బడ్జెట్ (నిర్వహణ బడ్జెట్) అవసరం.
 
అత్యవసర సేవల విషయానికొస్తే, పరీక్ష అనేది ప్రాక్టికల్‌గా ఉండాలి: క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ లేదా పరికరాల యాక్సెస్ కోల్పోతే, ఆ సేవను ఎవరు, ఏ సాధనాలతో, ఎంత త్వరగా పునరుద్ధరించగలరు? దీనివల్ల జరిగే నష్టం, కోలుకోవడానికి పట్టే సమయం మరియు ప్రత్యామ్నాయాల ఖర్చు ఆధారంగా ప్రభుత్వ వ్యయం ఉండాలి. కొన్ని లోపాలు స్వదేశీ అభివృద్ధిని సమర్థిస్తాయి; మరికొన్నింటికి వైవిధ్యభరితమైన దిగుమతులు, విడిభాగాలు లేదా నమ్మకమైన అంతర్జాతీయ ఏర్పాట్లు అవసరమవుతాయి. భారతదేశంలో తయారు చేయడం అసాధ్యం అయినప్పటికీ, ఒక అనివార్యమైన దిగుమతికి వ్యూహాత్మక శ్రద్ధ అవసరం. సేవ నిరంతరాయత, డేటాను తిరిగి పొందడం ,మరొక సరఫరాదారుకు మారడం వంటి బాధ్యతలను ఒప్పందాలలో స్పష్టంగా పేర్కొనాలి. రికవరీ ప్లాన్‌లను పరీక్షించాలి; ప్రత్యామ్నాయ సరఫరాదారుల డిపెండెన్సీలను కూడా సరిచూసుకోవాలి. ఏ వాగ్దానాలు కట్టుబడి ఉండేవి, ఏవి సత్సంబంధాలపై ఆధారపడి ఉన్నాయి.
 
యాక్సెస్ ఉపసంహరించుకుంటే ఎలాంటి ప్రత్యామ్నాయం ఉందో భారతదేశం తెలుసుకోవాలి. యాక్సెస్ కట్ కావడం వల్ల ఒక ప్రభుత్వ సేవ విఫలమైతే, పౌరులు ఒక సరఫరాదారు, ఒక మంత్రిత్వ శాఖ , ఒక రెగ్యులేటర్ ఒకరిపై ఒకరు వేళ్లు చూపించుకునే పరిస్థితిని ఎదుర్కోకూడదు. సార్వభౌమాధికారం అంటే అధికారాన్ని ఒక విదేశీ వెండర్ నుండి పారదర్శకత లేని దేశీయ వ్యవస్థకు మార్చడం మాత్రమే కాదు. భారతదేశానికి విదేశీ సాంకేతికత, మూలధనం మార్కెట్లు అవసరమవుతూనే ఉంటాయి. యాక్సెస్ ఉపసంహరించుకోబడటానికి ముందే అత్యవసర సేవలకు పని చేయగల ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేదా అనే దానిపైనే భారతదేశం కార్యాచరణ స్వేచ్ఛ ఆధారపడి ఉంటుంది. ఆ అధికారాన్ని స్వదేశంలో ఎలా చెలాయిస్తున్నారనే దాన్ని ప్రశ్నించే హక్కు కూడా పౌరులకు ఉండాలి. మరెక్కడో ఉన్న ఎవరైనా ఒకరు దానిని అమలు చేయడం అసాధ్యం అని తేల్చినప్పుడు, సార్వభౌమ ఎంపికకు పెద్దగా విలువ ఉండదు.