మత విద్య పేరిట నడుస్తున్న ఒక మదర్సాలో పిల్లల హక్కులు తీవ్రంగా కాలరాయబడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న ఝాన్సీ రోడ్డు వద్ద గల ‘దార్-ఉల్-ఖురాన్’ మదర్సాపై అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చిన్న గదుల్లో చిన్నారులను బంధించడం, నేలపై పరుపులు వేసి పడుకోబెట్టడం, తలుపులు లేని శౌచాలయాలు, అపరిశుభ్ర వంటగది, పనిచేయని సీసీటీవీ కెమెరాలు.. ఇలాంటి అమానుష పరిస్థితుల మధ్య పిల్లలు కాలం వెళ్లదీస్తున్నట్లు తేలింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు అర్ధరాత్రి వేళ ఆ మదర్సాను సీజ్ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (SCPCR), విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ నివేదితా శర్మ నేతృత్వంలో సాగిన ఈ దాడిలో మదర్సా గుర్తింపు, పిల్లల భద్రత, వారి రెగ్యులర్ చదువుకు సంబంధించిన పత్రాల్లో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా అక్కడున్న ఇద్దరు బాలికలు తమను తీవ్రంగా కొడుతున్నారని, ఇక్కడ ఉండలేకపోతున్నామని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
తనిఖీల సమయంలో మైదానంలో 7 నుంచి 13 ఏళ్ల వయస్సు గల 18 మంది బాలురు, 4 నుంచి 13 ఏళ్ల వయస్సు గల 8 మంది బాలికలు మాత్రమే కనిపించారు. మసీదు వెనుక వైపు ఉన్న ఒక చిన్న గదిలో ఎనిమిది మంది బాలికలను ఉంచినట్లు గుర్తించారు. ఆ గదికి చేరుకోవాలంటే నాలుగు గేట్లు దాటాల్సి ఉంటుంది. వారికి రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే ఒక మహిళా టీచర్ పర్యవేక్షణ ఉండేది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు కూడా ఆపివేసి ఉన్నాయి. అధికారుల తనిఖీలను గమనించి కొంతమంది పిల్లలను వెనుక గేటు గుండా బయటకు పంపించేశారని తేలింది.
మదర్సా రికార్డుల్లో 42 మంది బాలురు, 15 మంది బాలికలు కలిపి మొత్తం 57 మంది పిల్లల పేర్లు నమోదై ఉండగా, తనిఖీ సమయంలో కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. శుక్రవారం సెలవు కావడంతో పిల్లలు ఇళ్లకు వెళ్లారని మదర్సా నిర్వాహకులు చెప్పినప్పటికీ, రికార్డులకు, అక్కడున్న వారి సంఖ్యకు పొంతన లేకపోవడంతో అధికారులు అడ్మిషన్ ఫారాలు, హాజరు రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
మదర్సాను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ ప్రాతిపదికన నడుపుతున్నారని కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ నివేదితా శర్మ తెలిపారు. పిల్లలను బడులకు పంపకుండానే, స్కూలు రికార్డుల్లో పేర్లు నమోదు చేయించి నేరుగా పరీక్షలు రాయించి పాస్ చేయించే పెద్ద వ్యవస్థే దీని వెనుక పనిచేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు బాలికలు అసలు బడి ముఖమే చూడలేదు. ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన విద్య, భద్రత, గౌరవప్రదమైన జీవనం పొందే హక్కు ఉందని, చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
అటు మదర్సా నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మహమ్మద్ సాబిర్ మాట్లాడుతూ.. ఈ సంస్థ వక్ఫ్ బోర్డు పరిధిలో దాదాపు 35-36 ఏళ్లుగా నడుస్తోందని, మత విద్యతో పాటు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ బోధిస్తున్నామని తెలిపారు. పిల్లల వద్ద నుంచి నెలకు రూ. 500 నుంచి రూ. 800 వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
తనిఖీల్లో భాగంగా మదర్సాలోని కొన్ని హిందీ, ఉర్దూ పుస్తకాలను కమిషన్ స్వాధీనం చేసుకుంది. హిందీ పుస్తకాల్లో ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని అంశాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, వాటిని సమగ్ర విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.
బాధితులైన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలోకి తరలించారు. అనంతరం ఎస్డీఎం అతుల్ సింగ్, పోలీసు అధికారులు, జిల్లా విద్యాధికారి సమక్షంలో మదర్సాకు సీల్ వేశారు. చిన్నారుల భవిష్యత్తు, భద్రతతో చెలగాటమాడుతున్న ఇలాంటి సంస్థలపై, అసత్య హాజరు నమోదు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.