మైసూర్:
మైసూర్ జిల్లాలోని కేఆర్ నగర్ పట్టణ శివార్లలో ఉన్న హలే యెడతోరెలోని శ్రీ మీనాక్షి సమేత అర్కేశ్వర స్వామి దేవాలయ లోపలి గోడపై పచ్చటి మసీదు, ఎర్రటి సిలువ చిత్రాలు కనిపించాయి. ఈ ఘటనపై కేఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ దేవాలయం హిందూ ధార్మిక సంస్థలు , దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆలయ గోడపై వేసిన ఈ చిత్రాలకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ గోడలపై ఏ పరిస్థితుల్లో ఈ చిత్రాలు వేశారనే దానిపై అధికారిక విచారణ మొదలైంది.
ఈ విషయం తెలిసిన వెంటనే కేఆర్ నగర్ తహసీల్దార్ జి. సురేంద్రమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ చిత్రాలు వేయడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరనేది తేల్చనున్నారు.
చిత్రాల గురించి సమాచారం అందగానే అధికారులు ఆలయాన్ని సందర్శించారని తహసీల్దార్ సురేంద్రమూర్తి తెలిపారు. పోలీసు సిబ్బంది సమక్షంలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆలయ గోడను పూర్వస్థితికి తెచ్చేందుకు ఆ రెండు చిత్రాలను వెంటనే తొలగించినట్లు ఆయన చెప్పారు.
ఈ ఘటనతో ఆలయ గోడల పెయింటింగ్స్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఈ చిత్రాలు ఎలా వేశారు? ఆలయ పర్యవేక్షణలో ఏవైనా లోపాలు జరిగాయా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.