కార్యక్రమంలో భాగంగా హర్యానాలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 28,422 అర్హులైన పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ. 1,343.06 కోట్ల ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు. దానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి శ్యామ్ సింగ్ రాణాకు అందించారు.
రసాయన ఎరువులు ఎక్కువగా వాడితేనే దిగుబడి పెరుగుతుందనుకోవడం అపోహ అని చౌహాన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై రూ. 1.5 లక్షల కోట్లకు పైగా సబ్సిడీ భారాన్ని మోస్తోందని, యూరియా బస్తా రూ. 266, డీఏపీ (DAP) బస్తా రూ. 1,350కే అందిస్తోందని చెప్పారు. సబ్సిడీ వస్తోందని అవసరం లేకుండా ఎరువులు వాడటం సరికాదని, రోగం లేకుండా మందులు వేసుకోవడం లాంటిదని హెచ్చరించారు.
రైతులు తమ భూముల సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. దానికి తగినట్లుగా మాత్రమే అవసరమైన ఎరువులను వాడాలని కోరారు. ఒకే రకమైన పంటలను (ఉదాహరణకు వరి తర్వాత గోధుమ) కాకుండా, శనగలు, కందులు, పెసలు లాంటి పప్పుధాన్యాల పంటలను క్రమం తప్పకుండా సాగు చేయాలని కోరారు. పప్పుధాన్యాల వేర్లు నత్రజనిని నేలలో స్థిరపరిచి భూసారాన్ని పెంచుతాయని వివరించారు. రైతులు తమకున్న పొలంలో కనీసం అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఆవు పేడ, మూత్రం, చెట్ల కింద మట్టితో బీజామృతం, ఘనజీవామృతం తయారు చేయడం నేర్చుకుని క్రమంగా ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలన్నారు.
పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణం కలుషితం అవ్వడమే కాకుండా నేలలో ఉండే వానపాములు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోతాయని హెచ్చరించారు. నేల నిర్మాణం, భూసారం పెరగడానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల విసిలు, ఐసీఏఆర్ (ICAR) డైరెక్టర్ జనరల్, వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ ల్యాబ్లు, ఆఫీసులకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రైతులకు సాయిల్ హెల్త్, పర్యావరణ హిత వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాంగీ లాల్ జాట్, హర్యానా వ్యవసాయ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి విజేందర్ కుమార్, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఖేత్ బచావో అభియాన్' బుక్లెట్ను ఆవిష్కరించారు.