ఉజ్జయిని : ఉజ్జయిని వేదికగా నాలుగో జాతీయ షార్ట్ ఫిల్మ్ 2026 ఫెస్ట్ ప్రారంభమైంది. ఇది రెండు రోజుల పాటు కొనసాగుతుంది. విశ్వ సంవాద్ కేంద్ర, సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ సందర్భంగా ప్రజ్ఞా ప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె. నందకుమార్ మరియు నటుడు సంజయ్ మెహతా లాంఛనప్రాయంగా జ్యోతిని వెలిగించి లాఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నంద కుమార్ వర్తమాన కాలంలో భారతీయ సినిమాను తీర్చిదిద్దుతున్న సైద్ధాంతిక పోరాటాల గురించి కూలంకషంగా మాట్లాడారు. భారతీయ సినిమాలు భారతీయ నాగరికతను ఆనందోత్సాహాలు, చైతన్యం మిళితంగా ప్రదర్శిస్తే బాగుంటుందన్నారు. సినిమా రంగంలో కూడా దేశ నాగరికత, సాంస్కృతికతలను మరుగుపరచేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. భారతీయ సినిమా, భారతదేశం యొక్క ఘనమైన గతాన్ని చిత్రిస్తూనే, సమకాలీన సమాజంలోని వక్రీకరణలను కూడా ఎత్తిచూపుతూ, ఆ దేశపు నిజాన్ని తెరపైకి తీసుకురావాలని ఆయన నొక్కి చెప్పారు. అయితే, భారతదేశ స్ఫూర్తిని, గుర్తింపును పరిరక్షించడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సూచించారు.
దేశపు సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కూడా భారతీయ సినిమా రంగం చొరవ చూపాలని చలన చిత్ర నిర్మాతలను కోరారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన వీరుల గాథలను, దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప రాజుల చరిత్రను, అలాగే భారతదేశపు చిరకాల నాగరిక విలువలనూ సినిమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
నేటి సినిమా కేవలం వినోద మాధ్యమం మాత్రమే కాదని, నాగరిక, సాంస్కృతిక జ్ఞాపకాలను పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి ఒక శక్తివంతమైన సాధనమని ఆయన ఇంకా పేర్కొన్నారు. యువతరం మరియు చిత్రనిర్మాతలు దేశపు నేల, సంస్కృతి, సంప్రదాయాలలో పాతుకుపోయిన అర్థవంతమైన కథలను సృష్టించాలని పిలుపునిచ్చారు.
ఇక.. నటుడు సంజయ్ మెహతా మాట్లాడుతూ సైద్ధాంతిక చర్చల్లో సినిమా ప్రాముఖ్యతను వివరించారు.ప్రజల అవగాహనను తీర్చిదిద్దడంలో మరియు సమాజాన్ని ప్రభావితం చేయడంలో దాని పాత్రను నొక్కి చెప్పారు.ఉత్సవపు మొదటి రోజున, చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ సినిమా నిర్మాణం మరియు దర్శకత్వంలోని సూక్ష్మ అంశాలపై చర్చించారు. అర్థవంతమైన సినిమాను రూపొందించడానికి సామాజిక వాస్తవాలపై అవగాహన, స్పష్టమైన సామాజిక ఉద్దేశ్యం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
స్క్రీన్ప్లే రచయిత శైలేష్ ప్రతాప్ సింగ్ స్క్రిప్ట్ రచనలో అధ్యయనం మరియు పరిశోధనల ప్రాముఖ్యతను నొక్కిచెప్పగా, దిలీప్ లోక్రే ఒక కథను లఘు చిత్రంగా (షార్ట్ ఫిల్మ్) మలచే ప్రక్రియ గురించి వివరించారు.
ఈ చిత్రోత్సవానికి మొత్తం 240 చిత్రాలు ఎంట్రీలుగా రాగా, వాటిలో ఎంపిక చేసిన 35 చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు.