అయోధ్య : అయోధ్య రామ మందిర ఆలయ దర్శన వేళల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎక్స్ మాధ్యమంగా ప్రకటించింది. కాలానుగుణ మార్పుల దృష్ట్యా, అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో నవంబర్ 1, 2026 నుండి రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్లో మార్పులు అమలులోకి రానున్నాయి. భక్తులు ఆలయం తెరిచే మరియు మూసివేసే సమయాలు, రోజువారీ హారతులు, భోగ నివేదనలు, రామ్ లల్లా విశ్రాంతి సమయం మరియు దర్శన వేళలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. రామ మందిరాన్ని సందర్శించాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులు, ప్రయాణానికి ముందు ఈ కొత్త దర్శన వేళలను సరిచూసుకోవాలని ట్రస్ట్ సూచించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం రామ మందిర ద్వారాలు ఉదయం 4:00 గంటలకు తెరుచుకుంటాయి. 4:00 నుంచి 4:30 గంటల వరకు మంగళహారతి చేస్తారు. ఆ తర్వాత 6:30 గంటల వరకు ద్వారాలను మూసి వుంచుతారు. ఈ సమయంలో అర్చకులు రాంలల్లాకి అభిషేకం, అలంకరణ, ఉదయం అర్చకాలు నిర్వహిస్తారు.
శృంగార హారతి ఉదయం 6:30 గంటలకు జరుగుతుంది, భక్తులకు దర్శనం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. బాల భోగ నిమిత్తం ఉదయం 8 గంటల నుండి 8:10 గంటల వరకు ఆలయ ద్వారాలు కొద్ది సేపు మూసేస్తారు. ఆ తర్వాత 11:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ భోగ సమర్పణ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాజ భోగ హారతి నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 12:30 నుండి 1:30 గంటల వరకు రామలల్లకు విశ్రాంతి సమయం ఉంటుంది. పండితులు లోపలికి ప్రవేశించి 'లఘు భోగ్' (చిన్నపాటి నైవేద్యం) సమర్పించిన తర్వాత, మధ్యాహ్నం 1:35 గంటలకు తిరిగి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:00 నుండి 4:10 గంటల వరకు 'బాల భోగ్' నిమిత్తం ఆలయ ద్వారాలు 10 నిమిషాల పాటు మూసేస్తారు.భక్తులు సాయంత్రం 6 :45 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత, సాయంత్రం 7:00 గంటలకు 'సంధ్య హారతి' నిర్వహించే వరకు ధూప-దీప మరియు నైవేద్య కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం వేళ, ధూప-దీప మరియు నైవేద్య కార్యక్రమాల కోసం ఆలయ ద్వారాలు రాత్రి 8 గంటల నుండి 8:30 గంటల వరకు, ఆపై రాత్రి 9:15 గంటల నుండి 9:30 గంటల వరకు మూసి వుంచుతారు. భక్తులు ఆలయం తెరిచి ఉన్న నిర్ణీత సమయాల్లో దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 9:30 గంటలకు 'శయన హారతి' జరుగుతుంది; ఇది ఆ రోజుకు సంబంధించిన చివరి పూజా కార్యక్రమం. రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి.