నీరు కేవలం వనరే కాదు.. జీవనానికి, సంస్కృతికి మూలాధారం : సునీల్ అంబేకర్

VSK Telangana    26-Oct-2026
Total Views |
 
dharma
 
లక్నో : రాబోయే నీటి సంక్షోభాన్ని నివారించడానికి కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు, సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే పరిష్కరించలేమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. నీటి సంక్షోభాన్ని నివారించడానికి సమాజ దృక్పథంలో మొదట మార్పు రావాలని, జీవన శైలిలో మార్పులు అత్యవసరమని నొక్కి చెప్పారు. నీటిని కేవలం వనరుగా మాత్రమే కాకుండా, జీవనానికి, సంస్కృతికి మూలాధారంగా చూడాలని సూచించారు.
 
లక్నోలో ‘‘రాష్ట్ర ధర్మ’’ పత్రిక ప్రత్యేక సంచిక "జల్ హై తో కల్ హై" విడుదలక్రమం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ అంబేకర్ పలు విషయాలపై మాట్లాడుతూ ప్రసంగించారు. నీటి సంక్షోభం అనేది కేవలం నీటి కొరతకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ఇది ప్రకృతి పట్ల మన ప్రవర్తనకు మరియు మన సామాజిక బాధ్యతకు ముడిపడి ఉందని వున్నారు. ఈ సృష్టికి యజమానులు మానవులు కాదని, ఆ సృష్టిలో వారు భాగం మాత్రమేనని అన్నారు. కాబట్టి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేటప్పుడు, మానవుల శ్రేయస్సుతో పాటు జంతువులు, పక్షులు, మొక్కలు, నదులు మరియు ఇతర సహజ వనరుల పరిరక్షణను కూడా నిర్ధారించడం ఎంతో అవసరమని సూచించారు.
 
బుందేల్‌ఖండ్‌లోని జఖ్నీ మరియు మహారాష్ట్రలోని హివారే బజార్‌లను ఉదాహరణలుగా పేర్కొంటూ, స్థానిక ప్రజల భాగస్వామ్యం మరియు నిరంతర కృషితో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యమేనని గుర్తించారు. ఈ గ్రామాల అనుభవాలు, సమాజ భాగస్వామ్యం ద్వారా నీటి సంరక్షణను ఎంత సమర్థవంతంగా చేపట్టవచ్చో నిరూపిస్తున్నాయన్నారు. యువత తమ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, తద్వారా ఈ విజయవంతమైన నమూనాలను ఇతర గ్రామాల్లో కూడా అమలు చేసేలా తోడ్పడాలని కోరారు.
 
నీరు అనేది ఏదో ఒక రాష్ట్రానికి, వర్గానికి లేదా సమూహానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ఇది మొత్తం సమాజానికి మరియు దేశానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. నీటి సంక్షోభానికి పరిష్కారం పరస్పర సంఘర్షణలో లేదు, సామూహిక బాధ్యతలోనే ఉందని ఉద్బోధించారు. నగరాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించేటప్పుడు నీటి లభ్యత, వర్షపాతం, జనాభా మరియు సహజ వనరుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రణాళికా రహిత పట్టణీకరణ మరియు వనరులను అతిగా వినియోగించుకోవడం వల్ల నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.
 
ఈ కార్యక్రమ అధ్యక్షులు, పద్మశ్రీ ఉమాశంకర్ పాండే మాట్లాడుతూ, నీటి సంరక్షణ బాధ్యతను కేవలం ప్రభుత్వంపైనే వదిలేయకూడదని పేర్కొన్నారు. సమాజం ముందుకు వచ్చి, సమిష్టి బాధ్యతను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, అలాగే నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారం గ్రామాలు, గ్రామ పంచాయతీలు మరియు సామాన్య ప్రజలకు చేరేలా చూడాలని ఆయన నొక్కి చెప్పారు.
 
రాష్ట్రధర్మ' పత్రిక సంపాదకులైన అశోక్ వాజ్‌పేయి మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేపట్టిన 'పంచ పరివర్తన' (ఐదు రకాల పరివర్తనలు) కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణ ఒక కీలక అంశమని, ఇందులో నీటి సంరక్షణ అంతర్భాగమని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే 'జల్ హై తో కల్ హై' (నీరు ఉంటేనే రేపటి భవిష్యత్తు ఉంటుంది) అనే శీర్షికతో ఒక ప్రత్యేక సంచికను రూపొందించారు. ఇందులో నీటికి సంబంధించిన మతపరమైన మరియు సాంస్కృతిక దృక్పథాలు, సాంప్రదాయ సంరక్షణ పద్ధతులు, నేటి కాలపు సవాళ్లు, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.