జైపూర్ : సేవ అంటే కేవలం అవసరం వున్న వారికి సౌకర్యాలను కల్పించడం మాత్రమే కాదని, వారిలో ఆత్మ గౌరవం, స్వావలంబనను మేల్కొల్పడమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఒకప్పుడు సేవ చేయించుకున్న వారే కాలక్రమేణా ఇతరులకు సేవ చేసే స్థాయికి ఎదిగేలా సేవ వుండాలన్నారు. సమాజంలో మెరుగైన స్థితిలో ఉన్నవారు వెనుకబడిన ప్రాంతాలను సందర్శించి, అక్కడ నివసించే ప్రజలతో లోతైన, వ్యక్తిగత అనుబంధాలను ఏర్పరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సేవా భారతి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జైపూర్లో 257 'సేవా బస్తీ'లను గుర్తించామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాలలో విద్య, ఆరోగ్య సంరక్షణ, స్వయం సమృద్ధి, భద్రత మరియు ఆత్మగౌరవం వంటి అంశాలపై పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 'మలిన్ బస్తీ' (మురికివాడ) అనే పదానికి బదులుగా 'సేవా బస్తీ' అనే పదాన్ని సంఘ స్వయంసేవకులు ఉపయోగించడం ప్రారంభించారన్నారు. దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ ప్రాంతాలను కేవలం లేమి లేదా లోపాల కోణంలోనే కాకుండా, సేవా కార్యక్రమాలకు మరియు సామాజిక బాధ్యతకు కేంద్రాలుగా చూడాలన్నదే ప్రధాన ఉద్దేశమని వివరించారు.
సేవా భారతికి అనుబంధంగా ఉన్న సంస్థలు దేశవ్యాప్తంగా సుమారు 1,50,000 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అందులో చిన్నా, పెద్దా కార్యక్రమాలు కూడా వున్నాయన్నారు. స్వయంసేవకులతో పాటు, సమాజంలోని సజ్జన శక్తి కూడా ఈ ప్రయత్నాలకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారన్నారు. ఆర్థిక సాయం చేయడానికి లేదా నేరుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధంగా వున్న వారికి కొదవలేదన్నారు. కావాల్సింది ఏమంటే.. వారిలో వున్న ఈ సామర్థ్యాన్ని, సేవా భావాన్ని మేల్కొల్పడమేనని వివరించారు.
విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సౌకర్యాలను కల్పించడం అనేది సేవా కార్యకలాపాల్లో ఒక భాగమని దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, అవసరంలో ఉన్నవారికి తాముకూడా సమాజానికి ఏదో ఒక విధంగా తోడ్పడే సామర్థ్యం ఉందని నమ్మకాన్ని కలిగించడం. ప్రతి వ్యక్తిలోనూ దైవం వుంటుందన్నారు. ప్రతివ్యక్తి కూడా గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో జీవించే అవకాశం కల్పించాలన్నారు. అదే విధంగా మహర్షి వాల్మీకి జయంతిని ప్రస్తావిస్తూ, శ్రీరాముడు కేవటుడు, శబరి, ఉడుత పట్ల ప్రేమను చూపాడని, దీని ద్వారా సమాజంలో ప్రతి వ్యక్తికి వున్న ప్రాముఖ్యతను చాటి చెప్పారన్నారు.
సేవా సదనంలో పనిచేస్తున్న పదవీ విరమణ పొందిన వైద్యులు మరియు ఇతర స్వచ్ఛంద సేవకులు ప్రదర్శిస్తున్న సేవా దృక్పథాన్ని ఆయన ఉదహరించారు. పదవీ విరమణ పొందిన ఒక వైద్యుడు ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన సేవలను అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సేవ చేసే విషయంలో దూరం కంటే, ఆ సేవా స్ఫూర్తియే ముఖ్యమని ఇది స్పష్టం చేస్తోందన్నారు.
వెనుకబడిన ప్రాంతాల్లోని సామాజిక కేంద్రాలను ('సంస్కార కేంద్రాలు') సందర్శించాలని, అక్కడ పిల్లలతో సమయం గడపాలని, పుట్టినరోజులు మరియు దీపావళి వంటి వేడుకలను వారితో కలిసి జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. కుటుంబాలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా "మనమంతా ఒకే సమాజానికి చెందినవాళ్లం, భారతమాత బిడ్డలం" అనే భావన మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. సేవాభావంతో ఇటువంటి ఐక్యతా భావాన్ని పెంపొందించడం అనేది దేశ నిర్మాణానికి చేసే ఒక కీలకమైన కృషి అని పేర్కొన్నారు.