తెలంగాణ రాష్ట్రంలోని, ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని గ్రామాలు, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో "సేవాంకుర్ భారత్" ఆధ్వర్యంలో, వనవాసి కళ్యాణ పరిషత్ సహకారంతో "Three days for Nation" కార్యక్రమం అక్టోబర్ 23rd to 25th ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 16 వైద్య కళాశాలలకు చెందిన దాదాపు 100 మంది వైద్య విద్యార్థులు, మరియు 20 మంది వైద్యులు పాల్గొని తమ సేవలను అందించారు.
మొదటి రోజు ఉదయం విద్యార్థులు చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మధ్యాహ్నం కార్యక్రమం ప్రారంభోత్సవం - ఉద్ఘాటన ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Dr. Y.L. శ్రీనివాస్ (ములుగు ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్), శివరామకృష్ణ (దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన మంత్రి - వనవాసి కళ్యాణ్ పరిషద్) , చిలకమారి సంజీవ వరంగల్ విభాగ్ సంఘచాలక్ పాల్గొన్నారు. వారు విద్యార్థులను సేవాభావంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. సాయంత్రం నిర్వహించిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపి, పరస్పర పరిచయాన్ని, ఐక్యతను పెంపొందించాయి.
శనివారం రోజు- బలరామకృష్ణ గారు (RSS రాష్ట్ర సభ్యులు) విద్యార్థులకు దేశ చరిత్ర గురించి దేశభక్తి గురించి చెప్పారు. సుభాష్ చంద్ర బోస్ గారు (జోనల్ మేనేజర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్) ఒక వర్క్‌షాప్ ద్వారా సేవాంకుర్ విలువల గురించి అందరికీ అర్థం అయ్యేలా వివరించారు.విద్యార్థులు అందరినీ కార్యక్రమం లో చురుకుగా పాల్గొనేలా చేసారు.
ఆదివారం రోజు, విద్యార్థులు మరియు వైద్యులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి, ఎనిమిది వేర్వేరు గ్రామాలకు వెళ్ళారు. వారు రాత్రి అక్కడే బస చేసి, అక్కడి ప్రజలతో మమేకమై, వారి జీవన పరిస్థితులు అర్థం చేసుకున్నారు.
వైద్యులు, విద్యార్థులు కలిసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 900 మంది రోగులకు వైద్య సేవలు అందించబడ్డాయి.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వైద్య సహాయం అందించడమే కాకుండా, వైద్య విద్యార్థులకు గ్రామీణ ఆరోగ్య సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది. సేవా భావం, సామాజిక స్పృహ, మానవతా విలువలను జీవితంలో పెంపొందించుకునేందుకు ఈ శిబిరం ఒక గొప్ప వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమం ముగింపు సభలో - సమారోప్ లో ముఖ్య అతిథులుగా Prof. గజ్జెల రమేశ్వరం, మరియు డాక్టర్ శివ సుబ్రమణ్యం ( వైద్యులు, అజర ఆసుపత్రి వరంగల్) పాల్గొన్నారు. వారు విద్యార్థుల సేవా భావాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం కేవలం ఒక వైద్య శిబిరంగా మాత్రమే కాకుండా, యువతలో దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించే కార్యక్రమంగా నిలిచింది. సేవాంకుర్ భారత్, వనవాసి కళ్యాణ పరిషద్ సమన్వయంతో నిర్వహించిన "Three days for Nation" కార్యక్రమం, వైద్య వృత్తి యొక్క అసలైన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనని చాటి చెప్పింది.