హిందూ దేవాలయాలు పర్యాటక కేంద్రాలు కావు.. అఫిడవిట్ ఇవ్వాల్సిందే : మద్రాస్ హైకోర్టు

VSK Telangana    29-Oct-2026
Total Views |
 
hc
 
చెన్నై :  హైందవేతరులు హిందూ దేవాలయ ప్రవేశంపై మద్రాసు హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు కావని తేల్చి చెప్పింది. ఆగమ హిందూ దేవాలయాల్లోకి హిందువులు కాని వ్యక్తులు ప్రవేశించాలంటే వారు ఆ ఆలయ దైవం పట్ల తమకు గౌరవం వుందని పేర్కొంటూ ఓ డిక్లరేషన్ పై సంతకం చేయాలని, ఈ డిక్లరేషన్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
 
‘తంగం వెంకటేష్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం’ కేసులో వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పులో మద్రాసు హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఇతర మతాలకు చెందిన చిహ్నాలను ధరించి, ప్రధాన దైవం పట్ల భక్తిభావం లేని అన్యమతస్థులకు ఆగమ శాస్త్రబద్ధమైన ఆలయ సముదాయంలోకి ప్రవేశించే అనుమతి లేదు. ఈ నిబంధన కేవలం ధ్వజస్తంభం దాటిన ప్రాంతాలకే కాకుండా, ఆలయ ప్రాంగణం మొత్తానికి వర్తిస్తుంది అని కోర్టు పేర్కొంది.
 
హిందువులు కాని వారు ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే, సంబంధిత సంస్థ నిర్దేశించిన నమూనాలో ఒక అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, అందులో వారు ఆ దైవంపై తమకు విశ్వాసం ఉందని పేర్కొంటూ, ఆలయ నిబంధనలకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎటువంటి మత మార్పిడికి లోనుకాకుండానే, మీనాక్షి ఆలయంలోకి ప్రవేశించేందుకు జోసెఫ్ విజయ్ అటువంటి అఫిడవిట్‌పై సంతకం చేసిన ఉదాహరణను కోర్టు పేర్కొంది.
 
మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కఠిన వైఖరిని అవలంబిస్తూ, హిందూ దేవాలయాలు విహార స్థలాలు లేదా పర్యాటక ప్రదేశాలు కావని పేర్కొంది. అండర్‌టేకింగ్ మీద సంతకం చేయకుండా హిందూయేతరులను ప్రవేశించడానికి అనుమతించడం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తుందని తెలిపింది.