ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల అవిశ్రాంత కృషితో విజయవంతం అయ్యిందని ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. ఈ వందేళ్ల ప్రయాణంలో వ్యక్తి నిర్మాణం కోసం సంఘ్ ‘‘శాఖ’’ అనే వ్యవస్థను రూపొందించిందన్నారు. శాఖ ద్వారానే దేశం కోసం, సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేసుకున్న స్వయంసేవకుల వ్యవస్థ ఉద్భవించిందని, అలాగే దేశంలో ఆదర్శవంతమైన, సామాజిక జీవనాన్ని గడుపుతున్న నిబద్ధత కలిగిన కుటుంబాలు కూడా తయారయ్యాయని అన్నారు.
అక్టోబర్ 28 న ఇండోర్ లో ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్ది ముగింపు కార్యక్రమం ‘‘చరైవేతి’’ కార్యక్రమంలో అతుల్ లిమాయే పాల్గొన్నారు. సంఘ్ తన సంస్థాగత నిర్మాణంతో పాటు, సామాజిక జీవితంలో మార్పు తీసుకురావడానికి 'జాగరణ' విభాగం కింద వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, దీని 'సేవా విభాగం' సమాజం మొత్తాన్ని కలుపుకొని పనిచేస్తుండగా, 'ప్రచార విభాగం' జాతీయ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసిందన్నారు.
విశ్వ సంవాద కేంద్రాలు మూడు లక్షల గ్రామాల్లో ప్రచురణలను, జాతీయ భావజాలాన్ని విస్తరించే పనిలో ఉన్నాయని, సమాజంలోని నిర్మాణాత్మక శక్తులను జాతీయ కార్యంతో అనుసంధానించేందుకు 'సంపర్క విభాగం' నిరంతరం కృషి చేస్తోంది. దీనితో పాటు, సామాజిక జీవితంలోని సమస్యలను పరిష్కరించేందుకు ఆరు రంగాలలో వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సమాజ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి స్వయంసేవకులు 'పంచ పరివర్తన' అనే సంకల్పంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సామూహికత, క్రమశిక్షణ మరియు వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతమైన దృక్పథం ఇవి సంఘం యొక్క ప్రత్యేక పనితీరుకు మూలస్తంభాలు అని వివరించారు. వంద ఏళ్లుగా సంస్థ విస్తృతంగా విస్తరించినప్పటికీ, ఎవరూ తృప్తి చెందకూడదని, స్వయంసేవకులు మరింత సాధించాలన్న తపనతోనే తమ ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు. సంస్థాగత విస్తరణతో పాటు, సంఘం యొక్క స్ఫూర్తి సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూడటమే లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సంస్థాగత విస్తరణ సమాజంలోని వంద శాతం ప్రజలకు చేరాలని, అదే సమయంలో పని నాణ్యతను కూడా కాపాడుకోవాలని అన్నారు. స్వయంసేవకులను తయారు చేయడంతో పాటు, సమాజ ప్రవర్తనలో మార్పులు తీసుకువచ్చేందుకు కూడా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.సమాజ దృక్పథం దేశానికి, సమాజానికి మేలు చేసే పనులకు అనుగుణంగా ఉండాలని, సమాజంలో విశ్వాసం, బాధ్యతాయుతమైన అనుబంధ భావన నిండి ఉండాలని పేర్కొన్నారు.సమాజ దృక్పథాన్ని సిద్ధం చేయడంతో పాటు దాని ప్రవర్తనలో కూడా మార్పు రావాలన్నారు. ఆలోచనలతో పాటు ప్రవర్తనలోనూ మార్పు అవసరమని, సమాజంలోని ఏ వర్గం కూడా వివక్షతో కూడిన ప్రవర్తనను కలిగి ఉండకూడదన్నారు. సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించే లక్ష్యంతో సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా పంచ పరివర్తన్ అనే సంకల్పాన్ని చేపట్టిందని వివరించారు.
దేశం మరియు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై మనం దృష్టి సారించాలి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాలని అతుల్ లిమాయే సూచించారు. అందువల్ల సమాజంలో పనిచేస్తున్న పది లక్షలకు పైగా, సామాజిక మతపరమైన, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక సంస్థల మధ్య సంవాదం, సమన్వయం ఏర్పడాలన్నారు. అంతేకాకుండా ఆయా సంస్థల సామర్థ్యాలు, నైపుణ్యాలకు అనుగుణంగా వారికి పనిని, శిక్షణను కల్పించేలా ఓ వ్యవస్థను, పని విధానాన్ని కూడా రూపొందించుకోవాలన్నారు.
యావత్ సమాజంతో కలిసి పనిచేసే అలవాటును స్వయంసేవకులు పెంపొందించుకోవాలని సూచించారు. వ్యసవ్థలో మార్పులు తీసుకురావడానికి హిందూ విలువలు, ధర్మం ఆధారంగా ఏర్పాట్లు చేయాలని, సమాజానికి విలువలను అందించే వ్యవస్థను సృష్టించాలన్నారు. సమాజం అంతటా సంఘ్ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు సామాజిక పరివర్తనను తీసుకురావడానికి, సంబంధాలను ఏర్పర్చడానికి జాగరణ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి కార్యకలాపాలను కూడా విస్తరించాలన్నారు.
సంఘ కార్యం కష్టమైనది, అపారమైన కృషి అవసరం, అయినప్పటికీ స్వయంసేవకులంతా వీరోచితమైన ప్రతిజ్ఞ తీసుకున్నామని గుర్తు చేశారు. నిర్లక్ష్యం మరియు వ్యతిరేకతను ఎదుర్కొంటూ, ఉత్సాహం మరియు సహకారాన్ని పొందుతూ, మనం మన పనిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.