కేరళం : తన నాగరికతా కథనాలను తిరిగి పొందడానికి భారత్ ఓ మేధోపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ఆర్గనైజర్ పత్రికా సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ పిలుపునిచ్చారు. భారతదేశ చరిత్ర, నాగరికత, జాతీయ గుర్తింపు వంటి అంశాలపై చర్చలను రూపొందించడంలో నిరంతర మేధోపరమైన భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. శాశ్వత సామాజిక పరివర్తనను సాధించడానికి సంస్థాగత బలం, ప్రజా సమీకరణతో పాటు భావనలతో మమేకం అవ్వడం అత్యంత అవసరమని అన్నారు.ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ ప్రచారక్ రంగా హరిజీ స్మారకోపన్యాసం ఎర్నాకులంలో జరిగింది. ఈ స్మారకోపన్యాసం “Bharat Amidst Narrative War”, అనే అంశంపై నడిచింది.
ఈ సందర్భంగా ప్రఫుల్ల కేత్కర్ మాట్లాడుతూ రంగా హరీజీ ఓ గొప్ప మేధావి అని అభివర్ణించారు. భారతీయ సమాజం, సంస్కృతి మరియు మహిళా సమస్యలను భారతీయ దృక్కోణం నుండి విశ్లేషించడానికి ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.
సామాజిక పరివర్తనకు కేవలం క్షేత్ర స్థాయిలో బలం వుంటే సరిపోదన్నారు. అర్థవంతమైన పరివర్తన సాధించడానికి ప్రజలలో అవగాహన తీసుకురావాలని, ఈ సామర్థ్యం కూడా అత్యవసరమని అన్నారు. నెరేటివ్ (కథనం) ను సవాల్ చేసే మేధో పరమైన సామర్థ్యాన్ని భారత్ పెంపొందించుకోనంత వరకు, కేవలం సంస్థాగత విజయాలు మాత్రమే శాశ్వతమైన మార్పును తీసుకురాలేవన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పరిణామాక్రమాన్ని వివరిస్తూ, కేత్కర్ 1989వ సంవత్సరం నాటి కాలాన్ని ప్రస్తావించారు. ఇది RSS వ్యవస్థాపకులు డాక్టర్ కె.బి. హెడ్గేవార్ శతజయంతి సంవత్సరం; ఈ కాలంలోనే 'సేవ' మరియు 'విచార' (భావజాలం)కు సంబంధించిన కార్యకలాపాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. రామ జన్మభూమి ఉద్యమం, స్వదేశీ ఉద్యమం మరియు గో గ్రామ యాత్ర వంటి కార్యక్రమాలు సంఘ్ యొక్క సంస్థాగత పరిధిని దాటి, సమాజంలోని విస్తృత వర్గాలను దాని భావజాలంతో అనుసంధానించాయని ఆయన పేర్కొన్నారు.సంఘ్ ప్రస్థానం ఇప్పటివరకు సంస్థాగత విస్తరణ, భావజాల ప్రచారం మరియు ప్రజలను సమీకరించడం వంటి దశల ద్వారా సాగింది. తదుపరి దశ సామాజిక మరియు మేధోపరమైన పరివర్తనపై దృష్టి సారించాలని ఆయన చెప్పుకొచ్చారు.
కథనం అనే భావనను వివరిస్తూ, అది కేవలం ఒక నినాదం లేదా ఒక్క వాక్య సందేశం కాదని, కథలు, భావోద్వేగాలు, ఉదాహరణలు మరియు రూపకాలు ప్రజల అవగాహనను తీర్చిదిద్దే ఒక ప్రక్రియ అని కేత్కర్ అన్నారు. తాతముత్తాతలు చెప్పిన కథలు లేదా ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు, కేవలం పదాలకే పరిమితం కాని అర్థాన్ని కలిగి ఉండటం వల్ల తరచుగా దశాబ్దాల పాటు ప్రజల మదిలో నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు.
ఇక.. కథనం విషయంలో రామాయణ, మహా భారతాలను ఉటంకించారు. అసలు సంస్కృత గ్రంథాలను చదవని వారు కూడా, సాంస్కృతిక సంప్రదాయాల ద్వారా మరియు వివిధ రూపాల్లో తిరిగి చెప్పబడే కథనాల ద్వారా, వాటిలోని పాత్రలు, ఆదర్శాలు మరియు ప్రధాన ఇతివృత్తాల గురించి అవగాహన కలిగి ఉంటారని గుర్తు చేశారు. శ్రీరాముడు చారిత్రక కాలం నుంచీ భాషా, ప్రాంతీయ, కుల విభజనలకు అతీతంగా ప్రజలను అనుసంధానించే ఒక నాగరికతా ఆదర్శంగా నిలిచాడని కేత్కర్ అన్నారు.. వాలి వధ, శంబూక వధ, సీతా త్యాగం వంటి ఘట్టాలను నేటి కాలపు 'గుర్తింపు' (identity) వర్గాల కోణంలో విశ్లేషించే పద్ధతులను ఆయన ప్రశ్నించారు.
రాముడిని స్త్రీ వ్యతిరేకిగా, దళిత వ్యతిరేకిగా, ఆదివాసీ వ్యతిరేకిగా లేదా బ్రాహ్మణ వ్యతిరేకిగా చిత్రీకరించే పోటాపోటీ కథనాలు వచ్చాయన్నారు. ఇటువంటి చిత్రీకరణ భారత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పూజించే ఒక వ్యక్తి పట్ల ప్రజల అభిప్రాయాలను పునర్నిర్మించగలదని అన్నారు. ఇదంతా కూడా ఓ కథన నిర్మాణ శక్తి అని, ఒక చారిత్రక లేదా సాంస్కృతిక వ్యక్తిని ఏ విధమైన కథనంతో చిత్రీకరిస్తామనే దానిపై ఆధారపడి, ఆ వ్యక్తిని పూర్తిగా భిన్నమైన కోణాల్లో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.
ఇలాంటి పోటాపోటీ కథనాల మూలాలన్నీ కూడా వలసవాద కాలం నాటి వ్యాఖ్యానాలలోనే వున్నాయన్నారు. భారతదేశం ఎన్నడూ ఏకీకృత నాగరికత కాదనే అభిప్రాయాన్ని బ్రిటిష్ పాండిత్యం, పరిపాలనా విధానాలు ప్రోత్సహించాయని, అదే సమయంలో సామాజిక విభజనలను వివరించడానికి లేదా మరింత తీవ్రతరం చేయడానికి కులం, భాష, వంశం ఆధారిత భేదాలను ఉపయోగించారని పేర్కొన్నారు. చారిత్రక పరిశోధన, మేధోపరమైన చర్చ, భారతదేశ నాగరిక సంప్రదాయాలపై నూతన అవగాహన ద్వారా ఈ వ్యాఖ్యానాలను పరిశీలించి, సవాలు చేయాలని మేధావులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్‌లు కథనాల వ్యాప్తిని వేగవంతం చేసి, మరింత ప్రభావవంతంగా మార్చాయని ఆయన హెచ్చరించారు. ఇలాంటి వాతావరణంలో, భారతదేశానికి తన చరిత్ర, గుర్తింపుపై ఉన్న అవగాహనకు విస్తృత ఆమోదం లభించాలంటే, సంస్థాగత కార్యకలాపాలతో పాటు మేధోపరమైన భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అన్నారు.
source : organiser