హిందూ సమాజం తమ గ్రామాలను, పట్టణాలను సొంత పేర్లతోనే పిలుచుకోవాలి : VHP పిలుపు

VSK Telangana    30-Oct-2026
Total Views |
 
VHP
 
తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మతోన్మాదులు రుద్దిన తప్పుడు చరిత్రను వెంటనే తుడిచేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాంద్ చేసింది. భారతదేశంపై దండయాత్ర చేసి ఇస్లామిక్ మతోన్మాదంతో ఇక్కడి ప్రజలపై అత్యాచారాలు, హత్యలు, దోపిడుల సాగించి వేలాది దేవాలయాలను ధ్వంసం చేసిన బాబర్ మరియు ఔరంగజేబ్ లు ఈ దేశంలో మతోన్మాదులకు ఆదర్శం అవుతున్నారని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది.
 
VHP జాతీయ అధికార ప్రతినిధి డా. రావినూతల శశిధర్, మఠ: మందిర్ అఖిల భారత సంయోజక్ రామరాజు, VHP ఉపాధ్యక్షులు సునీతా రామ్మోహన్ రెడ్డి సంయుక్తంగా ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
 
తెలంగాణాలో మనం నేటికి విదేశీ పాలకులు మరియు మతోన్మాదుల పేర్లతోనే మన నగరాలను పిలుచుకుంటున్నాం, మన రాష్ట్ర రాజధాని భాగ్య లక్ష్మి అమ్మవారి పేరుతో వెలిసిన భాగ్యనగరం, నిజామాబాద్ అసలు పేరు ఇందూర్, కరీంనగర్ అసలు పేరు ఎలగందుల, మహబూబ్ నగర్ అసలు పేరు పాలమూరు, ఆదిలాబాద్ అసలు పేరు ఎదులాపురం, మహాబూబాబాద్ అసలు పేరు మానుకోట, వికారాబాద్ అసలు పేరు గంగారం ఇలా అనేక పట్టణ కేంద్రాలకు తమ ప్రాచీన పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. . తెలంగాణా చరిత్రను భావితరాలకు అందించాలంటే ప్రభుత్వం మన నగరాల మరియు పట్టణాల పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. పేరు మార్చడం అంటే మన చరిత్రను కాపాడుకోవడం,మన అస్థిత్వాన్ని ,మన ఘనమైన చరిత్రను చాటుకోవడం,మన స్వాభిమానాన్ని ప్రకటించుకోవడమని వివరించారు.
 
తెలంగాణా ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ముస్లీం సంతుష్టీకరణ రాజకీయాలు మానుకొని తెలంగాణా ప్రజల చరిత్రకు ఇక్కడి వీరోచిత పోరాటాలకు గుర్తుగా సజీవ సాక్ష్యాలుగా పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణా హిందూ సమాజం కూడా తమ తమ నగరాలను, పట్టణాలను, మండల కేంద్రాలను, తమ గ్రామాలను స్వంత పేర్లతో పిలుచుకోవాలని పిలుపునిచ్చారు.
 
త్వరలో అన్ని జిల్లా మండల కేంద్రాలలో సదస్సులు నిర్వహించి జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇస్తామని ప్రకటించారు. ఈ ఉద్యమంలో సాహితీవేత్తలను, సామాజిక సంస్థలను, అన్ని రాజకీయ పార్టీలను భాగం చేసి తెలంగాణా సాంస్కృతిక పునఃర్వైభవ ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణా ప్రజలందరిని ఈ ఉద్యమంలో భాగం చేసే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో కార్యక్రమాలు రూపొందించి ముందుకు కదులుతామని, ఈ ఉద్యమంలో అందరూ భాగం కావాలని కోరుతున్నట్లు పిలుపునిచ్చారు.
 
తెలంగాణాలో నేటికి రజాకార్ భావజాలానికి ఆదర్శవంతులుగా నిలుస్తున్నారు. సెక్యులర్ ముద్రవేసుకొన్న రాజకీయ పార్టీలు ముస్లీం సంతుష్థీకరణ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతోన్మాద నిజాం సమాధి వద్ద మోకరిల్లి సలాం కొడుతున్నాయని మండిపడ్డారు. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో నిజాం ను కీర్తిస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నాయి. మనం రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న బతుకమ్మ సాక్షిగా తెలంగాణాలోని గ్రామ గ్రామంలో ఇక్కడి హిందువుల పై నిజాం రజాకార్లు సాగించిన అకృత్యాలు మరచి ఓట్ల కోసం సాగిస్తున్న నీచ రాజకీయాలకు హిందూ సమాజం సరైన బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
 
మొన్నటి రోజు శ్రీరామ్ చౌక్ నుండి శ్రీరాముని విగ్రహం తొలగించడం ఈ రాష్ట్రంలో ఎంత నిసిగ్గుగా రజాకార్ ఎజెండా అమలవుతుందో కళ్ళముందు కనబడుతుందని, ఒక విదేశీ మతోన్మాద పాలకుడి పేరు కోసం పాకులాడుతున్న వారు యావత్ అఖండ భారతాన్ని పాలించిన శ్రీరాముడి పేరుపై ద్వేషం వెల్లగక్కడం చూస్తుంటే తెలంగాణాలో విషం చిమ్ముతున్న రజాకార్ భావజాలాన్ని తెలంగాణా హిందూ సమాజం అర్ధం చేసుకోవాలని సూచించారు.
 
భారత ప్రభుత్వం యుద్ధం చేసి నాటి హైదరాబాద్ సంస్థానాన్ని 17 సెప్టెంబర్ 1948 రోజు నిరంకుశ మతోన్మాది నిజాం నుండి విమోచనం చేస్తే నేడు ప్రత్యేక తెలంగాణా సాధించి కూడా ప్రభుత్వం విమోచన దినంగా నిర్వహించకపోవడం చూస్తే పైకి సెక్యులర్ పార్టీల చేతుల్లో అధికారం ఉన్నా నేడు కూడా తెలంగాణాలో రజాకార్ల చేతుల్లోనే అధికారం నడుస్తుందనేది స్పష్టం అవుతూందన్నారు.
 
ఆలంపూర్, వేములవాడ, ధర్మపురి లతో పాటు గ్రామ గ్రామాన దేవాలయాలపై దాడులు చేసిన రజాకార్ భావజాలం నేటికి ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర దేవాలయాలపై దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోళ్ళు అని చిత్రీకరిస్తున్న ప్రభుత్వం ఆ పిచ్చోళ్ళు ఎక్కడ తయారై వస్తున్నారో చెప్పలేక పోతుందని ఎద్దేవా చేశారు.భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాల భూములను రజాకార్లు నేటికి ఆక్రమిస్తున్నారు.నిజాం వారసుల పేరిట ఇప్పటికి తప్పుడు పత్రాలతో రాష్ట్రంలో విలువైన భూములు కబ్జాలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
స్వయంగా సెక్యులర్ ప్రభుత్వం కూడా దేవాలయ భూములు ఆక్రమిస్తుందని వారు ఆరోపించారు. మొన్న రాముడి విగ్రహం తొలగించిన శ్రీరామ్ చౌక్ చుట్టుప్రక్కల ప్రాంతం అమ్మవారి దేవాలయానిదేనని, చట్టం పేరు చెప్పి శ్రీరాముని విగ్రహాన్ని తొలగించిన ఆబిడ్స్ పోలీస్టేషన్ శ్రీ లక్ష్మీనర్సింహ్మ స్వామి ఆలయ భూమి ఆక్రమణలో నిర్మించిందే, నగరం నడిబొడ్డున నిర్మించిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దేవాలయ భూమిలో నిర్మించారన్నారు.బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో శ్రీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన 47 ఎకరాల 19 సెంట్ల భూమి ఎమైంది ,ICCC భవనం దేవాలయ భూమిలో కట్టిందేనా ? ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఒక్క భాగ్యనగరంలోనే 3000 ఎకరాల 19 గుంటలు (రికార్డుల ప్రకారం) ఎమైనాయో ప్రభుత్వం హిందూ సమాజానికి లెక్కలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
 
రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ పేరు అమృత ఉద్యాన్ గా మారింది. రాజ్పధ్ పేరు కర్తవ్యపధ్ గా మారి ప్రారంభమైన ఈ పున:ర్వైభవ ప్రయాణం అలహాబాద్ పేరు ప్రయాగ్రాజ్ గా, ఔరంగాబాద్ పేరు చత్రపతి శంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్ గా 'అహ్మద్ నగర్ పేరు అహిల్యానగర్ గా, ఫైజాబాద్ పేరు అయోధ్య గా, హోషంగాబాద్ పేరు నర్మదాపురం గా, కరీంగంజ్ పేరు శ్రీభూమి గా అక్కడి ప్రభుత్వాలు మార్చి ఈ దేశ చరిత్రను చాటాయని వివరించారు. చివరికి మనం చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేసుకున్నామని తెలిపారు.