కొమురం భీం స్వాస్థ్య సేవా యాత్ర–2 కార్యక్రమ నివేదిక

VSK Telangana    07-Oct-2026
Total Views |


12


నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ (NMO) – తెలంగాణ, వనవాసి కళ్యాణ పరిషత్ – తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలంలో 'కొమురం భీం స్వాస్థ్య సేవా యాత్ర–2' (KBSSY–2) కార్యక్రమం 2026 సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించబడింది. ఈ మూడు రోజుల సేవా యాత్రలో మొత్తం 90 మంది వైద్య విద్యార్థులు, 18 మంది డాక్టర్లు, 20 మంది వనవాసి కళ్యాణ పరిషత్ కార్యకర్తలు, 10 మంది ప్రబంధకులు/నిర్వాహకులు సహా మొత్తం 138 మంది ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.


22

 

సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా తొలుత ఉట్నూర్ మండల కేంద్రంలోని 10 వివిధ కళాశాలల్లో విద్యార్థుల కోసం 'డ్రగ్స్ అవేర్‌నెస్' కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అధికారికంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ సుభాషిణి, వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత కార్యదర్శి శ్రీ వెంకటేశ్వరరావు దేశ్‌పాండే పాల్గొని NMO సేవా కార్యక్రమాలు, వనవాసి సమాజం కోసం అందిస్తున్న విద్య, వైద్య సేవలను వివరించారు. ఇదే రోజు సాయంత్రం క్రీడా కార్యక్రమాలు నిర్వహించగా, రాత్రి ఉట్నూర్ కేంద్రంలోని పురాతన రామాలయంలో వైద్యులు, విద్యార్థులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.



333 

రెండవ రోజైన సెప్టెంబర్ 26వ తేదీన వైద్య బృందాలుగా ఏర్పడి చెరువుగూడ, హీరాపూర్ J, దొంగచింత, కన్నాపూర్, చాందూరి, ముక్తాపూర్, కామాయిపేట్, సాలేవాడ, సాకేర, బాబాపూర్ అనే 10 ఆదివాసి గ్రామాలను సందర్శించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు వారి జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలను దగ్గరగా తెలుసుకున్నారు.

ఆయా గ్రామాల్లోనే బస చేసిన వైద్య బృందాలు, చివరి రోజైన సెప్టెంబర్ 27 ఉదయం ఉట్నూర్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాయి. ఉదయం 11 గంటలకు జరిగిన ముగింపు కార్యక్రమంలో మెడికోస్ తమ అనుభవాలను పంచుకోగా, డాక్టర్ సురేందర్, డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ విక్రాంత్, ముఖ్య వక్త శ్రీ రాజులవార్ దిగంబర్ జీ ప్రసంగించి సేవ ప్రాముఖ్యతను, ఆదివాసీల పట్ల చూపాల్సిన సామాజిక బాధ్యతను నొక్కిచెప్పారు. "సేవే పరమ ధర్మం – సమాజ సేవే మన బాధ్యత" నినాదంతో ఈ బృహత్ యాత్ర దిగ్విజయంగా ముగిసింది.