వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో 618 మందికి ఉచిత కంటి పరీక్షలు, 137 మందికి ఉచిత కాటరాక్ట్ ఆపరేషన్లు

VSK Telangana    02-Nov-2026
Total Views |
 
VANAVASI
 
ఎదులాపురం : వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో, శంకర నేత్రాలయ నిర్వాహణలో ఇంద్రవెల్లిలోని శ్రీ నాగోబా విద్యార్థి నిలయంలో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వ తేదీ వరకూ ఈ ఉచిత కంటిపొర చికిత్స శిబిరం కొనసాగింది. ఈ శిబిరాన్ని వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారత ఉపాధ్యక్షులు హేర కుమార నాగు ప్రారంభించారు. కంటిపొర పరీక్షలు 24 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకూ జరిగాయి. 28 వ తేదీ నుంచి నవంబర్ 1 వరకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

VANAVASI2 
మొదటి రోజు 300 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 28 వ తేదీ వరకూ కంటిపొర చికిత్స పరీక్షలు కొనసాగాయి. ఆ తర్వాత ఆపరేషన్లను శంకర నేత్రాలయ వైద్యులు కొనసాగించారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ఉచిత శిబిరానికి వనవాసుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఎలాంటి లాభాపేక్షా లేకుండా వనవాసీ కల్యాణ పరిషత్ తమ ఆరోగ్యం కోసం, తమ సంక్షేమం కోసం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం తమకెంతో ఆనందంగా వుందని వనవాసులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాటరాక్ట్ ఆపరేషన్ ఖర్చుతో కూడుకుందని, కానీ.. వనవాసీ కల్యాణ పరిషత్, శంకర నేత్రాలయ సౌజన్యంతో ఉచితంగా పూర్తి చేసిందని తెగ సంబరపడ్డారు. మరో వైపు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ శిబిరాన్ని సందర్శించి, వనవాసీ కల్యాణ పరిషత్ తీసుకున్న చొరవను ఎంతో అభినందించారు.

VANAVASI2345 
ఎదులాపురం (ఆదిలాబాద్) పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఎదులాపురం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ తో పాటు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టె, డీఎంహెచ్ వో డా. సాధన, డా. మనోహర్ ఈ శిబిరాన్ని సందర్శించి, వనవాసీ కల్యాణ పరిషత్, శంకర నేత్రాలయ చేస్తున్న సేవలను ఎంతో కొనియాడారు.

VANAVASI23 
ఈ సందర్భంగా ఎదులాపురం పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల కంటి వైద్యం చేయించుకోలేని వనవాసీ పేదలకు కంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విలువైన సేవలందిస్తున్న శంకర నేత్రాలయ వైద్య బృందానికీ, వనవాసీ కల్యాణ పరిషత్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. వనవాసులందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
 
ఈ శిబిరంలో మొత్తం 618 మంది తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో 162 మందికి శంకర నేత్రాలయ వైద్యులు కాటరాక్ట్ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. ఇందులోంచి 137 మంది కాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా చేయించుకున్నారు. మిగతా వారు కాటరాక్ట్ ఆపరేషన్ కి హాజరవ్వలేదు. ఇక.. 125 మందిని ఎదులాపురం రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.

VANAVASI234 
ఇక.. చివరి రోజు వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారతీయ ఉపాధ్యక్షులు హెచ్ కే నాగు మాట్లాడుతూ వనవాసీ సమాజ సేవే వనవాసీ కల్యాణ పరిషత్ లక్ష్యమని వివరించారు. వనవాసి కళ్యాణ పరిషత్ ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, కంప్యూటర్ శిక్షణ తదితర అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఎదులాపురం జిల్లా కేంద్రంలో వనవాసుల కోసం ఓ కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నామని, దీని ద్వారా ఎంతో మంది వనవాసీ యువకులు లాభపడి, ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ వైద్యులకు, సిబ్బందికి, వారి కార్యకర్తలకు, ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వనవాసీ కల్యాణ పరిషత్ ప్రాంత కార్యదర్శి వేంకటేశ్వర రావు దేశపాండే, ప్రాంత సంఘటనా మంత్రి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు మేస్రం జంగు, శ్రీ నాగుబావి విద్యార్థి నిలయ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.