ఇండోర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ఇండోర్ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేవలం సంఘ కార్య శతాబ్దిలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకోవడానికే ఈ సమావేశాలు కాదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంపై పడిన ప్రభావం, వివిధ వర్గాలకు అవి చేరిన తీరు, విస్తృతితో పాటు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతుందన్నారు. స్వయంసేవకుల ద్వారా సమాజంలోకి చేరిన ఆలోచనలు మరియు కార్యకలాపాలను ఎలా కొనసాగించవచ్చనే దానిపై ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారిస్తారు. కార్యక్రమాల తదుపరి కార్యాచరణ, వాటి సామాజిక ప్రభావం, మరియు సమాజంలోని వివిధ వర్గాలను చేరుకోవడానికి సమర్థవంతమైన పని విధానాన్ని రూపొందించడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
అలాగే కార్య శతాబ్దిలో భాగంగా స్వయంసేవకులు చేపట్టిన శాఖా విస్తరణపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుందని, ఇది కూడా మరో ప్రధాన అంశమని తెలిపారు. సంఘ్ సంస్థాగత కార్యపద్ధతిలో దైనందిన శాఖకి కీలక స్థానం వుందని, ఈ నేపథ్యంలో, కొత్త ప్రాంతాల్లో శాఖలను ప్రారంభించడంతో పాటు, ఇప్పటికే నడుస్తున్న మరియు ఇటీవల విస్తరించిన శాఖలను మరింత క్రమబద్ధంగా, క్రియాశీలంగా మరియు ప్రభావవంతంగా తీర్చిదిద్దడంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా, శతాబ్ది సంవత్సరంలో సమాజంలోని వివిధ వర్గాలను చేరుకోవడానికి మరియు సామాజిక జీవితంలో సానుకూల మార్పు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంఘ్ ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో, 'పంచ పరివర్తన'కు సంబంధించిన అంశాలను సామాజిక భాగస్వామ్యం ద్వారా విస్తృత స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.
సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ విజయ దశమి ఉత్సవ ప్రసంగంపై కూడా...
ఈ సమావేశాల్లో విజయ దశమి ఉత్సవం సందర్భంగా సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఇచ్చిన ప్రసంగంలోని జాతీయ, సామాజిక అంశాపై కూడా చర్చిస్తామన్నారు. ఈ అంశాలను సమాజంలోకి సమర్థవంతంగా ఎలా తీసుకువెళ్లాలి మరియు వాటికి అనుగుణంగా రాబోయే కార్యక్రమాలను ఎలా రూపొందించుకోవాలి అనే విషయాలపై ఇందులో చర్చ జరుగుతుందన్నారు. సంఘం దృక్కోణంలో, విజయదశమి ప్రసంగం అనేది సంస్థ యొక్క ఆలోచనలను, సామాజిక ప్రాధాన్యతలను మరియు సమకాలీన అంశాలపై దాని దృక్పథాన్ని తెలియజేయడానికి ఒక ముఖ్యమైన సందర్భం. కార్యకారి మండలి సమావేశంలో, ఆ ప్రసంగంలో లేవనెత్తిన అంశాల వెనుక ఉన్న సామాజిక నేపథ్యం గురించి మరియు వాటికి అనుగుణంగా చేపట్టాల్సిన పనుల గురించి చర్చిస్తారని పేర్కొన్నారు.
46 ప్రాంతాలు, 400 మంది ప్రతినిధులు...
ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా వున్న 46 ప్రాంతాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరైనట్లు నరేంద్ర కుమార్ తెలిపారు. సర్ సంఘచాలక్, సర్ కార్యవాహ, ఆరుగురు సహ సర్ కార్యవాహలు, అఖిల భారతీయ కార్యకారిణీ సదస్యులు, క్షేత్ర సంఘచాలకులు, క్షేత్ర కార్యవాహలు, క్షేత్ర ప్రచారకులు కూడా ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ప్రాంత సంఘచాలకులు, ప్రాంత కార్యవాహలు, ప్రాంత ప్రచారకులతో పాటు సంఘ్ ప్రేరేపిత సంస్థలకు చెందని అఖిల భారత సంఘటనా కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు.
అఖిల భారత కార్యకారి మండలి సమావేశం సందర్భంగా, సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ముగ్గురు చారిత్రక మరియు స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితాల గురించి, వారి కృషి గురించి ప్రకటనలు చేశారన్నారు. రాజనారాయణ బోస్, స్వామి శ్రద్ధానంద, వేదాంత కేసరి స్వామి లక్ష్మణానంద సరస్వతీ ఇందులో వుంటారన్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ప్రతినిధులు 'అఖిల భారత కార్యకారి మండలి' (ABKM) వార్షిక సమావేశం కోసం డాలీ కాలేజీలోని 'సంత్ శ్రీ రవిదాస్ జీ మహరాజ్ ఆడిటోరియం'లో సమావేశమయ్యారు. సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ మరియు సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే సమక్షంలో ప్రారంభమైన ఈ సమావేశంలో, విజయదశమి 2025 నుండి విజయదశమి 2026 వరకు జరగనున్న శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. అలాగే, తదుపరి దశ కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం నవంబర్ 4వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది.
ఛాయా చిత్ర ప్రదర్శన కూడా...
ఈ కార్యక్రమ వేదిక వద్ద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క 100 ఏళ్ల ప్రస్థానాన్ని, మాల్వా ప్రాంతంలో సంఘ్ కార్యకలాపాల క్రమబద్ధమైన విస్తరణను తెలియజేసేలా ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సంఘ్ శతవార్షిక ప్రయాణానికి మరియు ఈ ప్రాంతంలో సంస్థాగత కార్యకలాపాల వృద్ధికి సంబంధించిన అంశాలను ఇందులో ప్రదర్శించారు. అక్టోబర్ 31న సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సోమవారం నుండి మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రదర్శనను సందర్శించే అవకాశం కల్పించారు. దీని ద్వారా, సంఘ్ యొక్క చారిత్రక ప్రస్థానాన్ని మరియు మాల్వా ప్రాంతంలో దాని కార్యకలాపాల అభివృద్ధిని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.