బలమైన దేశ నిర్మాణానికి ‘‘పంచ పరివర్తన’’ పునాదులు : తెలంగాణ గవర్నర్

VSK Telangana    02-Nov-2026
Total Views |
 
PANCHAPARIVARTAH
 
భాగ్యనగర్ : ఇనిషియేటివ్ ఫర్ మోరల్ అండర్ కల్చరల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (IMCTF) ఆధ్వర్యంలో తెలంగాణలోని లోక్ భవన్ లో ‘‘పంచపరివర్తన్’’ పై పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘పంచ పరివర్తన్’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ ఓ బలమైన దేశాన్ని నిర్మించడానికి ‘‘పంచ పరివర్తన’’ కి చెందిన ఐదు సూత్రాలు అత్యవసరమైన పునాదులు అని నొక్కి చెప్పారు. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ సంరక్షణ, స్వదేశీ, నాగరిక కర్తవ్య అనేవి పంచ పరివర్తన్ లో భాగాలని వివరించారు.
విద్య కేవలం జ్ఞానం, ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా, నైతిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ హ్యాండ్‌బుక్ విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ బాధ్యతా స్ఫూర్తిని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
 
ఇక.. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర రెడ్డి మాట్లాడుతూ విద్యా భారతి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 24 వేల పాఠశాలలు నడుస్తున్నాయని, ఈ 24 వేల పాఠశాలల్లో పంచ పరివర్తన్ అమలు అవుతూందని, అలాగే విద్యా భారతి కార్యక్రమాల్లో కూడా దీనిని అమలు చేస్తున్నామని తెలిపారు. భారతీయ జీవన విధానంలో పంచపరివర్తన్ ఓ భాగమని, మనం వదిలేసిన విషయాల్ని తిరిగి వెతుక్కుంటున్నట్లుగా వుందన్నారు. వస్తువును ఎక్కడైతే పోగొట్టుకుంటామో, అక్కడే వెతుక్కోవాలన్న సామెత వుందని, అలాగే మనం ఏ జీవన మూల్యాలనైతే వదిలిపెట్టామో, మళ్లీ వాటిని గుర్తు చేసుకోవడమే తప్పించి, కొత్తగా కొని తెచ్చుకోవడం కాదన్నారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ అక్షరాస్యులు 25 శాతమే వున్నా.. విద్యావంతులు మాత్రం 100 శాతం వున్నారన్నారు. దీనికి అర్థం ఏమిటంటే.. ఈ దేశంలోని వంద శాతం ప్రజల్ని ఇక్కడి రామాయణ, భారతాలు జీవన మూల్యాలతో ముందుకు తీసుకెళ్లాయని అన్నారని సుధాకర్ రెడ్డి వివరించారు.
 
ఏ రామాయణ, భారతాలైతే పిల్లలకు జీవన మూల్యాలను అందిస్తూ, ప్రపంచానికి అందించాల్సింది పోయి, ప్రస్తుతం ప్రపంచమంతా సమస్యలు ఎదుర్కొంటోంది, అందులో మనం కూడా భాగమే కాబట్టి, ప్రపంచంతో పాటు మనం కూడా ఆలోచిస్తున్నామని, కానీ.. పంచ పరివర్తన అనేది భారతీయులకు కొత్తేమీ కాదని పునరుద్ఘాటించారు. భారతీయ మూల్యాలు ‘‘ఏకోహం బహుశ్యామ:’’ అన్నట్లు.. అంతటా భగవంతుడు వున్నాడన్న తత్వం మనదని, ఇందులో భాగంగానే చెట్లను పూజించడం, చీమలకు పంచదార పెట్టడం, పాములకు పాలు పోయడం లాంటివి చేస్తున్నామన్నారు. కానీ.. కొందరు ఈ జీవన విధానంలో వున్న భారతీయుల్ని చూసి... పిచ్చి వాళ్లు అని హేళన చేశారని, కానీ.. ఇది జీవన తత్వంగా భారత జాతి ఆ మూల్యాలను అనుసరించిందని వివరించారు. ఆధునికీకరణ పేరుతో మన మూలాల నుంచి దూరం జరిగిన తర్వాత.. .ఇప్పుడు చెట్లను పెంచండి, వాటికి నీరు పోయండి అని అంటున్నారన్నారు. నిజానికి ఈ సృష్టిలో మనుషులొక్కరే బతకడం లేదని, పశువులు, పక్ష్యులు... ఇలా అనేక జీవాలు జీవిస్తున్నాయని, వాటన్నింటితో కలిసి జీవించమని భారతీయ తత్వం చెప్పిందని గుర్తు చేశారు. మానవులకు బతికే హక్కు ఎలా వుంటుందో అచ్చు అలాగే చెట్లకు, జీవరాశులకు కూడా అంతే అధికారం వుందన్నారు. ఈ భూమికను మరిచిపోయాం కాబట్టి, మళ్లీ దీని అవసరం వచ్చిందన్నారు. ఉదయం లేస్తూనే.. సముద్ర వసనే దేవీ... అంటూ శ్లోకం చెబుతామని, ఇలాంటి సంస్కృతి ఇక్కడుందని, చదువు రాని రోజుల్లో ఈ మూల్యాలు మరింత సంపన్నంగా వుండేవని, చదువు వచ్చిన తర్వాత ఈ మూలాల నుంచి దూరం జరిగిపోతున్నామని అన్నారు. ఇప్పటికీ కూడా కబడ్డీ ఆడే సమయంలో భూమికి నమస్కరిస్తామని, భవనం కట్టే సమయంలో భూమి పూజ చేస్తామని, పొలం దున్నే సమయంలో రైతులు భూమి పూజ చేస్తారని.. ఇవన్నీ మన జీవన మూల్యాలన్నారు. ఇవన్నీ మరిచిపోవడం వల్ల భూమి కాలుష్యం అవుతూందని, అందుకే దానిని సరిచేసే బాధ్యత మానవులుగా మన చేతుల్లోనే వుందని స్పష్టం చేశారు.

PANCHAPARIVARTAH2 
అందుకే పంచ పరివర్తన మళ్లీ ప్రజల ముందుకు తెచ్చామని, చెట్లను పెంచాలని, ప్లాస్టిక్ ను వాడొద్దని చెబుతున్నామని, అంత పెద్ద కుంభమేళా జరిగినా.. ప్లాస్టిక్ కనిపించలేదన్నారు. ఇలా అన్ని చోట్లా ప్రయత్నం చేయవచ్చన్నారు. నీరు వృథా చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెడుతోందని, అయితే.. పెద్ద పెద్ద ఫంక్షన్ల మాటేమిటి? అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఫంక్షన్లలో నీళ్ల బాటిల్స్ పెట్టడం వల్ల తాగినంత తాగి పారబోస్తున్నారని, అంతేకాకుండా భూమిలో కూడా ప్లాస్టిక్ కరగడం లేదన్నారు. ఎటు వెళ్లినా.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా యోజనలు చేసుకోవాలని, మన పిల్లలకు కూడా నేర్పించాలన్నారు. ప్రస్తుత విద్య పిల్లలను తప్పుదోవ పట్టించేలా వుందని, అందుకే పిల్లలు సంస్కారాలను చూసి నేర్చుకుంటారని, అందుకే తల్లిదండ్రులు, టీచర్లు వారికి సరైన మార్గం చూపించాలని సూచించారు.
 
అయితే.. ప్రస్తుత దుస్థితికి కారణం ప్రకృతి కాదని, ప్రకృతిని చూసే విధానంలో మనిషివే పొరపాట్లు వున్నాయన్నారు. వీటిని మనిషి ఎప్పటి వరకైతే సవరించుకోడో, అప్పటి వరకూ ఈ సమస్యలు ఇలాగే వుంటాయన్నారు. అందుకే మన ప్రవర్తన ఎలా వుందో మనమే గమనించుకోవాలన్నారు.
ఇక.. కుటుంబ ప్రబోధన్ కూడా పంచ పరివర్తన్ లో భాగమని, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి కూర్చోవడం, మాట్లాడుకోవడం, భోజనం చేయడం చేయాలని సూచించారు. కలిసి సినిమాకి వెళ్లడం పెరుగుతోంది కానీ.. కుటుంబం కలిసి దేవాలయాలకు వెళ్లడం తగ్గుతోందన్నారు.ఎక్కడికైతే కలిసి వెళ్లాలో అక్కడికి ఒంటరిగా, ఎక్కడికైతే ఒంటరిగా వెళ్లాలో అక్కడికి కలిసి వెళ్తున్నారన్నారు. కుటుంబమంతా కలిసి భోజనం చేయడం, తీర్థయాత్రలు చేయడం, దేవాలయాలకు వెళ్లడానికి తపస్సేమీ అవసరం లేదని సంకల్పం అవసరం అన్నారు. ఇప్పుడు అందరూ హక్కుల కోసం తెగ ప్రశ్నలు వేస్తున్నారని, కానీ.. భారతీయ వ్యవస్థ బాధ్యతలు నేర్పిందని గుర్తు చేశారు. డాక్టర్ అయినా, ఇంజినీర్ అయినా, చదివే విద్యార్థి అయినా.. ఇలా ఏం చేసినా ఈ దేశం కోసం చేయాలన్నారు. బాధ్యతలను మరిచిపోతే పౌర విధులు ఎక్కడుంటాయని ప్రశ్నించారు. ప్రతి దానికీ ఎవర్నొ తిట్టే బదులు, తన వంతుగా ఏం ప్రయత్నం చేస్తున్నానని అందరూ ఆలోచించుకోవాలని సూచించారు.

PANCHAPARIVARTAH23 
జీడీపీ పడిపోయిందని అందరమూ ప్రజల్ని తిట్టుకుంటారని, కానీ.. అందరమూ కొన్ని రోజుల పాటు స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేస్తే మన జీడీపీ బాగుంటుందని, అందుకే ప్రభుత్వాల్ని తిట్టడం కాకుండా మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. అందరిలో భగవంతుడు వున్నప్పుడు కులం పేరుతో దూరం పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. పశు పక్ష్యాదుల్ని, వృక్షాల్ని పూజిస్తున్నాం కదా.. మరి మానవుల్ని ఎందుకు దగ్గర చేసుకోలేం? ఒకసారి అందరూ సమరసతతో ఆలోచించాలి పిలుపునిచ్చారు.
ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పంచ పరివర్తనపై వేసిన స్కిట్ అందర్నీ ఆకట్టుకుంది.