వేదాలకు జంతు ముఖాలా? వేదమూర్తుల రూపాల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

VSK Telangana    04-Nov-2026
Total Views |

veda
 
భారతీయ సనాతన ధర్మానికి ప్రాణాధారాలుగా నిలిచిన చతుర్వేదాలను ఎప్పుడైనా మానవ రూపంలో, అదీ ప్రత్యేకమైన జంతు ముఖాలతో చూశారా? కొన్ని ఆగమ గ్రంథాలు, శిల్పశాస్త్రాలు , ధ్యానశ్లోకాలలో మన చతుర్వేదాలను మూర్తి రూపంలో వర్ణించిన అద్భుతమైన సంప్రదాయం ఉంది. అయితే ఈ రూపాలు వేదకాలం నాటివి కావు. కాలక్రమేణా... వేదాల అంతరార్థాన్ని, వాటి ప్రాథమిక స్వభావాన్ని సామాన్య ప్రజలకు కూడా సులభంగా అర్థం చేయించడానికి శిల్పులు, ఆచార్యులు సృష్టించిన అద్భుతమైన ప్రతీకలు ఇవి!
 
మరి ఈ వేదమూర్తుల రూపాలు ఎలా ఉంటాయి? వాటి వెనుక ఉన్న గూఢార్థం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
 
మొదటిది ఋగ్వేదమూర్తి. ఈ మూర్తికి గార్ధభం అనగా గాడిద ముఖం ఉంటుంది. గాడిద ఎంత బరువునైనా ఎలాంటి అలసట లేకుండా మోస్తుంది. ఋగ్వేదం దేవతా స్తుతులు, ప్రకృతి శక్తులను వివరిస్తుంది. వేదాలు వేల సంవత్సరాలు గురువు నుంచి శిష్యునికి నోటి ద్వారానే, ఎలాంటి పొరపాట్లు లేకుండా తరతరాలుగా మోసుకుంటూ వచ్చాయి. ఆ శ్రమకు, క్రమశిక్షణకు, సహనానికి ఈ గాడిద ముఖం ప్రతీక. సంస్కృతంలో గార్ధభాన్ని ఖరం అంటారు కాబట్టి, ధ్యానశ్లోకాలలో ఈయన్ను 'ఖరవక్త్రుడు' అని వర్ణిస్తారు. అయితే ఇక్కడ ఒక గమనించదగిన హెచ్చరిక కూడా ఉంది. గాడిద గంధం మోస్తుంది కానీ, ఆ గంధం విలువ దానికి తెలియదు. అలాగే వేదాలను కేవలం కంఠస్థం చేస్తే సరిపోదు, వాటి అసలు అంతరార్థాన్ని తెలుసుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ రూపం మనకు ఇస్తుంది.
 
ఇక రెండవది యజుర్వేదమూర్తి. యజ్ఞాలు, కర్మకాండల పద్ధతులను వివరించే ఈ వేదమూర్తికి మేక ముఖం చూపుతారు. యజ్ఞంలో అర్పణకు, త్యాగానికి మేకను ప్రతీకగా చెబుతారు. ఇది యజ్ఞ కార్యకలాపాలలో ఉండే చురుకుదనాన్ని, నిరంతర చైతన్యాన్ని సూచిస్తుంది.
 
మూడవది సామవేదమూర్తి. మంత్రాలను అద్భుతమైన స్వరాలతో గానం చేసే సామవేదానికి మన భారతీయ సంగీతమే మూలం. గుర్రం వేగానికి, ప్రాణశక్తికి, నాదానికి ప్రతీక కాబట్టి.. సామవేదమూర్తికి గుర్రం ముఖం కేటాయించారు. ఇది సంగీత నాదంలోని శక్తిని ప్రతిబింబిస్తుంది.
 
నాల్గవది అథర్వణవేదమూర్తి. ఆరోగ్యం, రక్షణ, శాంతి, గృహజీవితం వంటి రోజువారీ విషయాలను ఈ వేదం చెబుతుంది. మానవ జీవితంలో ఎప్పుడూ అస్థిరంగా ఉండే చంచలమైన మనస్సును కోతి (వానరం)తో పోలుస్తారు. కనుక అథర్వణ వేదమూర్తికి వానర ముఖం కేటాయించారు. ఆ చంచలమైన మనస్సును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలనే అంతరార్థాన్ని ఈ వానర ముఖం మనకు నేర్పుతుంది.
 
 
ఈ వేదమూర్తుల చేతులలో కనిపించే ప్రతీకలు కూడా చాలా విశేషమైనవే. వీరి చేతులలో నిరంతర సాధనకు అక్షమాల, వేదజ్ఞానానికి పుస్తకం లేదా తాళపత్ర గ్రంథం, పవిత్రతకు, జీవశక్తికి కమండలం ఉంటాయి. అలాగే అభయ ముద్ర రక్షణను, వరద ముద్ర అనుగ్రహాన్ని సూచిస్తాయి. కొన్ని ప్రత్యేక చిత్రాలలో వీరు ఒడిలో కూర్చున్న దేవేరితో కనిపిస్తారు. అంటే జ్ఞానం కేవలం గ్రంథాలకే పరిమితం కాకుండా, శక్తిగా, ఆచరణగా మారాలని ఇది సూచిస్తుంది. ఇక రంగుల విషయానికి వస్తే, ఋగ్వేదమూర్తికి తెలుపు, యజుర్వేదమూర్తికి పసుపు, సామవేదమూర్తికి ఎరుపు లేదా నీలం, అథర్వణవేదమూర్తికి నలుపు లేదా ముదురు నీలం రంగులను ఆపాదించారు. తెలుపు పవిత్రతను, పసుపు యజ్ఞ తేజస్సును, ఎరుపు నాదాన్ని, నలుపు రక్షణను సూచిస్తాయి
.
మొత్తంగా చూస్తే, ఈ వేదమూర్తులు కేవలం జంతు రూపాలు కావు. జ్ఞానం, కర్మ, నాదం, రక్షణ వంటి వేదాల ప్రాథమిక స్వభావాలను కళ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పిన అద్భుతమైన సాంప్రదాయ రూపాలు!