సామ్రాజ్య నిర్మాతా.. లేక దోపిడీదారుడా? – రాబర్ట్ క్లైవ్ అసలు కథ ఇదే!

VSK Telangana    04-Nov-2026
Total Views |
 
robert clive
 
బ్రిటిష్ చరిత్రలో ఆయన్ని 'క్లైవ్ ఆఫ్ ఇండియా' అంటారు.. కానీ భారతీయ చరిత్ర చూస్తే, ఇదొక వినాశకర వలస దోపిడీకి పడిన పునాది! సాధారణ కంపెనీ ఉద్యోగిగా అడుగుపెట్టి, ఒక దేశ భవితను తలకిందులు చేసిన రాబర్ట్ క్లైవ్ ప్రయాణం వెనుక అసలు నిజమేంటి? భారత్ సంపదను కొల్లగొట్టి, ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక వ్యాపార సంస్థ నుంచి మహా సామ్రాజ్యంగా మార్చిన ఆ చీకటి అధ్యాయం గురించిన పూర్తి వివరాలు ఇవాళ తెలుసుకుందాం!"
 
"1751లో ఆర్కాట్ ముట్టడితో తన సామ్రాజ్య నిర్మాణ యాత్రను ప్రారంభించాడు రాబర్ట్ క్లైవ్. అక్కడ చూపిన సాహసం బ్రిటిష్ సైనిక ప్రతిష్ఠను పెంచింది. కానీ, 1757 జూన్ 23న జరిగిన 'ప్లాసీ యుద్ధం' భారత చరిత్రను పూర్తిగా మార్చేసింది.
 
వాస్తవానికి అది సైనిక బలంతో గెలిచిన యుద్ధం కాదు.. పూర్తిగా రాజకీయ కుట్రల ఫలితం! బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్దౌలాను గద్దె దించడానికి, అతని సేనాధిపతి మీర్ జాఫర్‌తో పాటు ప్రముఖ బ్యాంకర్ జగత్ సేత్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు క్లైవ్. యుద్ధభూమిలో మీర్ జాఫర్ సైన్యం పోరాడకపోవడంతో నవాబు ఓడిపోయాడు. ప్లాసీ విజయం తర్వాత బెంగాల్ ఖజానాలు నేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లాయి; అపారమైన సంపద కంపెనీ అధికారులతో పాటు క్లైవ్ వ్యక్తిగత హస్తగతమైంది."
 
"1764 నాటి బక్సర్ యుద్ధ విజయం వారి స్థానాన్ని మరింత సుస్థిరం చేయగా.. 1765లో మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం అలహాబాద్ ఒప్పందం ద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సాల 'దివానీ హక్కులను' కంపెనీకి అప్పగించాడు. పన్నులు వసూలు చేసే అధికారం కంపెనీ చేతికి వెళ్లగా, పరిపాలనా బాధ్యత మాత్రం నవాబు వద్దే ఉంచే ఈ 'ద్వంద్వ పాలన' విధానం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.
 
అధికారాలు వేర్వేరు చేతుల్లో ఉండటంతో పరిపాలన కుప్పకూలింది. కంపెనీ ప్రధాన లక్ష్యం కేవలం సంపదను పిండుకోవడమే కావడంతో రైతులపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా.. 1770లో బెంగాల్‌లో సంభవించిన మహా కరువు మానవ చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనగా నిలిచింది. కఠినమైన ఆదాయ విధానాల వల్ల జనాభాలో మూడో వంతు మంది ప్రాణాలు కోల్పోయినా, కంపెనీ మాత్రం పన్నుల వసూళ్లలో ఎటువంటి సడలింపు ఇవ్వలేదు!"
 
"భారత్‌లో ఈ దోపిడీ జరుగుతుండగా.. క్లైవ్ మాత్రం వ్యక్తిగతంగా అపార సంపదను కూడబెట్టాడు. సాధారణ ఉద్యోగిగా వచ్చిన అతను, బ్రిటన్‌కు వెళ్లేసరికి అక్కడి అత్యంత ధనవంతులలో ఒకడిగా మారాడు! మీర్ జాఫర్ నుండి భారీ నగదు, బహుమతులే కాకుండా వేలాది పౌండ్ల ఆదాయం వచ్చే జాగీర్ హక్కును పొందాడు. బ్రిటన్ సమాజంలో ఈ సంపద దోపిడీని 'షేకింగ్ ది పగోడా ట్రీ' (భారత సంపద చెట్టును కుదిపి ధనం రాల్చడం) అంటూ వ్యంగ్యంగా పిలిచేవారు.
 
అయితే బెంగాల్ నుండి ప్రవహించిన ఈ సంపదపై బ్రిటన్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 1772-1773లో బ్రిటిష్ పార్లమెంట్ ప్రత్యేక కమిటీ క్లైవ్ కార్యకలాపాలపై విచారణ జరిపింది. ఆ సమయంలో ముర్షిదాబాద్ ఖజానాలోని అపార సంపదను చూసి తాను అంత తక్కువ మాత్రమే తీసుకున్నందుకు ఆశ్చర్యంగా ఉందంటూ క్లైవ్ చేసిన వ్యాఖ్య అతని దురాశకు నిదర్శనంగా నిలిచింది. చివరకు బ్రిటిష్ జాతీయ ప్రయోజనాలకు సేవ చేశాడనే పేరుతో అతన్ని శిక్ష నుంచి తప్పించినప్పటికీ, అతని ప్రతిష్ఠ పూర్తిగా మంటగలిసింది."
 
"రాజకీయ విమర్శలు, అనారోగ్య సమస్యలు , మానసిక ఒత్తిళ్లతో సతమతమైన రాబర్ట్ క్లైవ్.. తన 49వ ఏట 1774 నవంబర్ 22న లండన్‌లో తన గదిలో కత్తితో గాయపరచుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బ్రిటిష్ దృక్కోణంలో అతను ఒక 'సామ్రాజ్య నిర్మాత' కాగా.. భారతీయ దృష్టిలో మాత్రం బెంగాల్ సంపదను దోచి, ఈస్ట్ ఇండియా కంపెనీ క్రూర పాలనకు పునాది వేసిన వలసవాద దోపిడీకి ప్రతీక! ఒక వ్యక్తి జీవితం, ఎదుగుదల మరియు పతనం.. భారతదేశం ఎలా బ్రిటిష్ పాలనలోకి జారిపోయిందో చెప్పేందుకు చరిత్ర మిగిల్చిన ఒక బలమైన గుణపాఠం!"