రాజ్యాంగ విలువల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ‘అరాచకాన్ని ఆపండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అనే నినాదంతో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భారీ ప్రదర్శన నిర్వహించింది. ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా వున్న ప్రముఖ విశ్వ విద్యాలయాలు, కళాశాలల నుంచి 15 వేల మందికి పైగా విద్యార్థులు, ఎన్నికైన విద్యార్థి యూనియన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదని, ప్రజల తీర్పును గౌరవించడం, వ్యవస్థల విశ్వసనీయతను కాపాడటం, నిర్మాణాత్మక రాజకీయ భాగస్వామ్యం మరియు రాజ్యాంగ ప్రక్రియలకు కట్టుబడి ఉండటం అని ప్రతినిధులు ఉద్ఘాటించారు.
దీనిని ఏబీవీపీ ‘‘విద్యార్థి మహాకుంభ’’ అని అభివర్ణించింది. రాజకీయ అరాచకత్వం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీసే యత్నాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ చేపట్టిన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో ‘ఛాత్ర గర్జన’ ర్యాలీలను విజయవంతంగా నిర్వహించిన అనంతరం, ప్రజాస్వామ్య తీర్పును గౌరవించాలని, రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డ్యూసు) అధ్యక్షుడు యశ్ దాబాస్, కార్యదర్శి రియా ఛావ్డీ, జాయింట్ సెక్రటరీ లక్ష్య రాజ్ సింగ్; పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అంకిత్ భిడాన్, మాజీ అధ్యక్షుడు గౌరవీర్ సోహల్; లడఖ్ విశ్వవిద్యాలయం నుండి ఎన్నికైన ప్రతినిధులు; డెహ్రాడూన్‌లోని డీఏవీ పీజీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు నవదీప్ రాణా; ఉత్కల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అభిరామ్; గౌహతి యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు మానస్ ప్రతీమ్ కలితా; జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) మాజీ జాయింట్ సెక్రటరీ వైభవ్ మీనాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థి ప్రతినిధులు ప్రముఖంగా పాల్గొన్నారు.
ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి మాట్లాడుతూ, "భారతదేశ ప్రజాస్వామ్య బలం ప్రజల తీర్పు, రాజ్యాంగం మరియు దాని వ్యవస్థల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించడం, రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్యంలో భాగమే, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియలు, రాజ్యాంగ వ్యవస్థలపై అవిశ్వాసాన్ని సృష్టించడం అత్యంత దురదృష్టకరం. ఎన్నికలకు సంబంధించిన ఆరోపణలను తగిన రాజ్యాంగ అధికారుల ముందు నిరూపించకుండా, రాజకీయ ప్రచారాల ద్వారా ఎందుకు తీవ్రతరం చేస్తున్నారో రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడేది, మారేది ప్రజల ఓట్ల ద్వారానే తప్ప, గుంపుల ఒత్తిడి లేదా అరాచకం ద్వారా కాదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితులు భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు నమూనా కాజాలవు. భారతీయ యువత రాజ్యాంగ ప్రజాస్వామ్యం, జాతీయ బాధ్యత మరియు ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై నమ్మకం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికైన విద్యార్థి ప్రతినిధుల ఇవాల్టి ఈ సమావేశం ఆ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సార్థక్ శర్మ మాట్లాడుతూ, "నేటి ఈ సమావేశం ప్రజాస్వామ్యంపై యువ భారత్ ఉంచిన బలమైన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులకు తమ క్యాంపస్‌లలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలను, నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను బలోపేతం చేసే బాధ్యత ఉంది. విశ్వవిద్యాలయాలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కావు; అవి భావి నాయకత్వాన్ని తీర్చిదిద్దే, దేశ ప్రజాస్వామ్య చైతన్యాన్ని రూపొందించే వ్యవస్థలు అని అన్నారు.
డ్యూసు (DUSU) అధ్యక్షుడు యశ్ దాబాస్ మాట్లాడుతూ, "మేము విద్యార్థుల నమ్మకం, తీర్పు ద్వారానే ఈ పదవులకు చేరుకున్నాము, ఈ తీర్పుతో వచ్చే బాధ్యతను మేము అర్థం చేసుకున్నాము. ప్రజాస్వామ్యం అసమ్మతికి, విభేదాలకు చోటు ఇస్తుంది కానీ, అరాచకత్వానికి లేదా రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచే యత్నాలకు అనుమతించదని తేల్చి చెప్పారు.