గొప్ప చరిత్రను లిఖించిన CRPF.. ఏమిటంటే..

VSK Telangana    05-Nov-2026
Total Views |
 
CRPF
 
న్యూఢిల్లీ : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తమ చరిత్రలో ఓ గొప్ప మైలురాయిని అందుకుంది. గత 12 నెలలుగా (ఒక సంవత్సరం) సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేపట్టిన ఏ ఒక్క ఆపరేషన్‌లోనూ ఒక్క జవాను కూడా ప్రాణాలు కోల్పోకపోవడం విశేషం. సీఆర్‌పీఎఫ్‌ చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టం.
 
సీఆర్పీఎఫ్ అంటేనే సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం. అలాగే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో కూడా నిరంతరం విధులు నిర్వర్తిస్తోంది. అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నా... తమ ప్రతిభతో ఈ అరుదైన రికార్డును నెలకొల్పింది.
 
ఆఖరిగా 2025 అక్టోబర్ 30న ఒక ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాను అమరుడయ్యారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వరుసగా 12 నెలల పాటు ఆపరేషనల్ రంగాలు ఎక్కడైనా సరే, ఒక్క జవాను ప్రాణనష్టం కూడా సంభవించలేదు. ఇలా ఏడాది పొడవునా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా ఆపరేషన్లు పూర్తి చేయడం 47 సంవత్సరాల తర్వాత (చివరిసారిగా జనవరి 1979లో) మళ్లీ ఇప్పుడు చోటు చేసుకోవడం విశేషం.
అత్యంత ప్రమాదకరమైన ఆపరేషనల్ రంగాలు, థియేటర్లలో తీవ్రవాదులపై, అసాంఘిక శక్తులపై నిరంతరం విరుచుకుపడుతూ, ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో గొప్ప ఫలితాలు సాధిస్తూనే ఈ మైలురాయిని అందుకోవడం సీఆర్‌పీఎఫ్‌ బలగాల పట్టుదలకు, కఠిన క్రమశిక్షణకు నిదర్శనం. దేశాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా ఉంచేందుకు సీఆర్‌పీఎఫ్‌ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని అధికారికంగా ప్రకటించారు.
 
ఈ కారణాల వల్లే ఈ రికార్డు..
 
ఆధునిక సాంకేతికత, ఆయుధ సంపత్తి, అత్యాధునిక ఆయుధాలను జవాన్లకు అందిస్తున్నారు.

అత్యంత కఠినమైన, ఉన్నతమైన, నిబద్ధతతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్ల సాధ్యమైంది.

ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయడం, దానికి అనుగుణంగా వ్యూహాలు రచించండం, నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ కచ్చితమైన వ్యూహాత్మక ప్రణాళికలతో ముందడుగు వేయడం.

వేగవంతమైన వైద్య సేవలు: ఆపరేషన్లలో గాయపడిన జవాన్లకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు, అత్యంత వేగంగా సెకండరీ, టెర్షరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించేలా ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం.
 
ఆధునిక ఆయుధాలు, పకడ్బందీ వ్యూహాత్మక ప్రణాళికల కారణంగానే శత్రువులపై పైచేయి సాధించగలుగుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన ఆపరేషనల్ రంగాల్లో విధులు నిర్వర్తిస్తూనే ఈ రికార్డును సాధించడం విశేషం. పౌరులందరికీ దేశంలో ప్రశాంతమైన అలాగే సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. ఈ ఘనత సాధించిన జవాన్లకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.