విద్యా బోధన కేవలం జీవనోపాధిగా కాదు.. భక్తితో చేయాలి : మోహన్ భాగవత్

VSK Telangana    11-Feb-2026
Total Views |
 
rss
 
మహారాష్ట్ర : నాణ్యమైన సమాజం ద్వారానే దేశం బలంగా మారుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంవేదనాశీలతతో కూడిన మానవుడు తయారు కావాలంటే విద్యే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నాసిక్ లోని జౌల్కేలో ఆర్మ్‌స్ట్రాంగ్ రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లో విద్యా సంస్థల అధినేతల సమావేశం జరిగింది.
 
ఇందులో మోహన్ భాగవత్ మాట్లాడుతూ విద్య ద్వారానే నాణ్యతతో కూడిన, సంవేదనా శీలతతో కూడిన సమాజం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి పరిణతి కలిగిన సమాజం మాత్రమే దేశాన్ని బలోపేతం చేస్తుందన్నారు. అందుకే ఉపాధ్యాయులు విద్యా బోధనను కేవలం జీవనోపాధిగా కాకుండా భక్తితో చేయాలని ఉద్బోధించారు.
 
విద్య అనేది కేవలం వ్యాపారం, ఆర్థిక విషయాలకు సంబంధించింది కాదని, అది విద్యార్థులలో మానవత్వాన్ని సృష్టించి, సుస్థిరం చేసే ప్రయత్నమని అభివర్ణించారు. అయితే.. విద్యార్థులు మాత్రం తమలో అంతర్గతంగా వున్న ‘‘గురు’’ స్ఫూర్తిని మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదన్నారు. అలాగే విద్యా సంస్థల అధిపతులు ఉపాధ్యాయులలో వారి పని పట్ల మరింత అనుబంధం పెరిగేలా చూడాలన్నారు.
 
ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య సన్నిహిత సంబంధం ఎంత ముఖ్యమో వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు చేశారు. ఇక.. ఆరెస్సెస్ చేస్తున్న పనులను కూడా వివరిస్తూ.. సంఘ్ అనేది ఎవరికీ ప్రతిచర్య లాగా వచ్చింది కాదని, పోటీ కూడా కాదని, అధికారం కోసం కూడా కాదని పునరుద్ఘాటించారు.
 
దేశాన్ని గొప్పగా తయారు చేయడం, సామాజిక ఐక్యతను ప్రోత్సహించడం సంఘ్ లక్ష్యమని వివరించారు. గత శతాబ్ద కాలంగా క్రమశిక్షణతో కూడిన, లక్ష్య ఆధారిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సంఘ్ శాఖకు రావాలని పిలుపునిచ్చారు.
 
సమాజంలో 80 శాతం మంది అనుకరణ ద్వారా నేర్చుకుంటారని పేర్కొంటూ.. మన దేశంలో అనేక భాషలు మరియు వర్గాలు ఉన్నప్పటికీ, ‘సంస్కృతి మాత్రం సమాజ స్వభావంగా వుందన్నారు. వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఎలాగైతే దేశం పట్ల అంకితభావంతో వున్నారో.. ఆ స్ఫూర్తిని రగిలించే బాధ్యత విద్యారంగంపై వుందని మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు.