సంఘ్ విస్తరణను ఓర్వలేని శక్తులే దాడికి దిగాయి : ఆరెస్సెస్

VSK Telangana    20-Feb-2026
Total Views |

rss
 
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రశాంతంగా జరుగుతున్న ఆరెస్సెస్ శాఖపై, విద్యార్థులపై వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పందించింది. విశాఖ మహానగర్ సంఘచాలక్ పేరుతో ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. ఆరెస్సెస్ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయ మైదానంలో ఈ శాఖ చాలా రోజులుగా, ప్రశాంతంగా జరుగుతోందని పేర్కొంది. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా, అలాగే విశాఖపట్నం నగరంలో కూడా పెద్ద సంఖ్యలో సేవా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
 
ఆరెస్సెస్ విస్తరణను ఓర్వలేని, సహించలేని శక్తులు ఈ నెల 17 న రాత్రి ఆంధ్రా యూనివర్శిటీ బాస్కెట్ బాల్ కోర్టు సమీపంలో జరుగుతున్న శాఖపై దాడికి దిగాయని అన్నారు. ఈ దాడి జరిగిన సమయంలో స్వయంసేవకులు భారతమాతను స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారని, భారత్ మాతాకీ జై అంటూ నినదించారన్నారు. ఈ సమయంలోనే కొంత మంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే నినాదాలతో కార్యక్రమానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నాలు చేశారన్నారు.అయినా సరే సంఘ కార్యకర్తలు తమ నిగ్రహాన్ని మాత్రం కోల్పోలేదని, అలాగే పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.
 
ఆరెస్సెస్ కార్యకర్తలు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే విధంగా విశ్వవిద్యాలయంలో మార్చ్ నిర్వహించారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంఘ్ కార్యక్రమాలన్నీ కూడా చట్టపరిధిలో శాంతియుతంగా జరుగుతాయని, హింసకు, ద్వేషానికి చోటు లేదని పునరుద్ఘాటించారు.
చాలా సంవత్సరాలుగా శాఖ అత్యంత ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగానే జరుగుతుందని, కానీ... ఆరెస్సెస్సే తమపై దాడికి దిగిందని తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న విశ్వవిద్యాలయంలోని ABVP విద్యార్థులు సంఘటన స్థలానికి వచ్చి మద్దతుగా నిలిచారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారని కూడా పేర్కొన్నారు.