భారతీయ స్త్రీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, సంపూర్ణ చైతన్యం. కుటుంబానికి మూలస్తంభం. సమాజానికి ప్రేరణ, జాతికి ఆత్మ. అలాగే స్త్రీ అంటేనే కరుణ, సమర్పణ, త్యాగం వీటన్నింటి స్వరూపం. అలాగే గృహాన్ని, సమాజాన్ని కాపాడే రక్షకురాలు. సమాజానికి మార్గదర్శకురాలు కూడా.
అయితే ప్రతి మహిళలో కూడా సప్త శక్తులు వుంటాయని మనకు భగవద్గీత చెబుతోంది. అవి కీర్తి, శ్రీ, , వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ, అని వుంటాయి. ఇవన్నీ కూడా అంతర్గంగా వుంటాయి. వాటిని తిరిగి మేల్కొలిపి, భారతీయ మహిళను జాగృతం చేయాలని ‘‘విద్యా భారతి’’ సంకల్పించింది.
సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని, దేశ వ్యాప్తంగా సప్తశక్తి సంగం పేరుతో మాతృ సమ్మేళనాలను నిర్వహించాలని విద్యా భారతి నిర్ణయించింది. ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఈ సప్తశక్తి సంగమాలను నిర్వహించింది. శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల కేంద్రంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృమూర్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇందులో విశేషం ఏమిటంటే.. కార్యక్రమ రూప కల్పన అంతా మహిళలతోనే జరిగింది. అతిథులు, వక్తలు కూడా మహిళలే. అలాగే ఈ కార్యక్రమానికి ఆహుతులు కూడా మహిళలే. ఇలా మన తెలంగాణ ప్రాంతంలో 2,345 కి పైగా సప్తశక్తి సంగమాలు జరగ్గా, 30 వేల మందికి పైగా మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఇక.. ఆంధ్రా ప్రాంతంలో 280 కార్యక్రమాలు జరగ్గా, 28 వేల మందికి పైగా మహిళలు చురుగ్గా పాల్గొన్నారు.
దేశం మొత్తం మీద సప్తశక్తి సంగమ యోజనను అమలు చేయడానికి విద్యాభారతి ఓ ప్రణాళికను రచించింది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే...
కుటుంబ వ్యవస్థ, పర్యావరణం పట్ల మహిళలలో భారతీయ దృష్టిని వికసింపజేయడం.
2. సమాజంలో మరియు విశేషంగా విద్యా భారతి, విద్యాపీఠం సంస్థలలో మహిళల క్రియాశీలతను పెంచడం.
3. ప్రాంతం వారీగా మహిళా వక్తలు, విషయ ప్రతిపాదన చేయగలిగే బృందాన్ని నిర్మించడం.
4. బాలల సమగ్ర వికాసంలో తల్లుల పాత్రను స్పష్టం చేయడం.
5. జాతి, సమాజ పరివర్తన దృష్టిలో మహత్వ పూర్ణమైన పర్యావరణం, పౌర విధులు, కుటుంబ ప్రబోధన్, స్వబోధ, సామాజిక సమరసత లాంటి వాటిల్లో మహిళల్లో కర్తవ్య భావాన్ని జాగృతం చేయడం.
6. మహిళల్లో ఆత్మాభిమానాన్ని పెంచడం.
7. మహిళల క్రియాశీలత పెంచడం, నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం.
8. మహిళలను కుటుంబం, సమాజం, దేశ కల్యాణ కార్యాలలో పనిచేయడం కోసం ప్రేరణనివ్వడం.
9. ప్రస్తుత సమయంలో భ్రమింపజేసేటటువంటి స్థితిలో దిశను ఇవ్వడం.
వీటిని లక్ష్యంగా చేసుకొని, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఈ సప్తశక్తి సంగమాలను నిర్వహించింది. దీనికి సంబంధించిన సమారోప్ కార్యక్రమం కూడా దాదాపు 700 మంది మహిళలతో నారాయణగూడ కేశవ మెమోరియల్ లోని పటేల్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి హాజరవ్వగా, ముఖ్య వక్తగా రాష్ట్రీయ సేవికా సమితి ప్రాంత కార్యవాహిక రాధ శ్రీపాద హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధ శ్రీపాద దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం (integral humanism) ప్రతిపాదించారు. జస్టిస్ మాధవీ దేవి సప్తశక్తి సంగం గురించి, మహిళల గురించి మాట్లాడారు.
మన సంస్కృతిలో మహిళే అన్నింటికీ ఆధారం. మన సంప్రదాయంలో మహిళను ఎక్కడా తక్కువ చేసి చూడలేదు, పురుషుడితో సమానమైన హక్కులిచ్చారు. దేశంలో స్త్రీవాదం రాకమునుపే, అర్ధనారీశ్వర తత్వం భాసిల్లింది. పండగ జరగాలన్నా, సంప్రదాయాలు, సంస్కృతి తర్వాతి తరం ఆచరించాలన్నా మహిళే కీలకం. అంతెందుకు.. దేశానికి ఓ వీరుడు కావాలంటే కావాల్సింది కూడా మహిళే. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వారు ఆవిర్భవించారంటే ఆ క్రెడిట్ అంతా జిజియా బాయిదే.
ప్రాచీన భారత దేశంలో కూడా మహిళలదే ప్రధాన పాత్ర. గార్గీ, మైత్రేయి, అనసూయ వంటి మహిళలు తపస్సు, నీతి, విద్యకు ప్రతీకలుగా నిలిచారు.
గార్గి : బ్రహ్మజ్ఞానం పొందిన గొప్ప యోగిని. ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిణి.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు, జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.
మైత్రేయి : వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. రుగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన ఆత్మను గురించి విచారిస్తుంది.
అనసూయ : అత్రి మహర్షి, అనసూయ దేవి హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన దంపతులు.సప్తఋషులలో ఒకరైన అత్రి, పతివ్రతా శిరోమణి అనసూయల తపశ్శక్తి వల్లనే త్రిమూర్తులు (దత్తాత్రేయుడుగా) వీరికి జన్మించారు. కర్దమ ప్రజాపతి, దేవహూతిల కుమార్తె అనసూయ. అత్రి మహర్షి ఎంతలా తపస్సు చేశారో అనసూయకూడా అంతే స్థాయిలో తపస్సు చేశారు.
భగవద్గీతలో చెప్పిన సప్తశక్తుల వివరణ ఇదీ :
కీర్తి : కీర్తి, ప్రతిష్ఠలు అని మనం వింటూనే వుంటాం. ఈ రెండూ కుటుంబానికి, వ్యక్తులకు అత్యంత అవసరం. కుటుంబం యొక్క యశస్సు కీర్తి కొరకు స్త్రీ మాత్రమే సంతానంతో ఆచరించి, సంస్కారవంతం చేయగలిగే శక్తి స్త్రీకి వుంటుంది. తల్లిని మాత్రమే అనుసరిస్తారు. వికసిత సమాజం కోసం స్త్రీకి కీర్తి అత్యంత అవసరం.
2. శ్రీ : శ్రీ అంటే లక్ష్మీ. లక్ష్మీ అంటే కేవలం ధనం మాత్రమే కాదు. సంపత్తి. అష్ట లక్ష్ములు. ధైర్యే సాహసే లక్ష్మీ. ధైర్యం కూడా లక్ష్మీ రూపమే. లక్ష్మీ దేవి సరైన మార్గంలో, ధర్మ మార్గంలోనే మన ఇంట్లోకి రావాలి. అలాగే సద్గుణాలను కూడా లక్ష్మీతో పోలుస్తారు. అందుకే శ్రీ సూక్తంలో ‘‘న క్రోధో నచమాత్సర్యం న లోభో నా అశుభామతి:’’ క్రోధం, మాత్సర్యం, లోభం అనేవి లేకుంటేనే లక్ష్మీ దేవి మన దగ్గర వుంటుంది.
అలాగే ధనం, ధాన్యం, వృక్షాలు, గోవులు.. వీటన్నింటినీ సంపద గానే భావిస్తాం మన సంప్రదాయంలో. వాటిని కూడా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై వుంది. అయితే స్త్రీ ఇందుకు ముందుకు రావాలి.
వాక్కు : ఏం చేసినా వాక్కే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది సామెత మనకు తెలిసిందే. అయితే.. కుటుంబం కలిసి వుండాలంటే ముఖ్య పాత్ర మహిళదే. అలాగే కుటుంబాన్ని ఒకే తాటిపై నిలపడం, మాటల ద్వారా ఏకాభిప్రాయం, అనుకూలత, స్నేహం చేసే కళకూడా వుండాలి. ఇవన్నీ స్త్రీలో పుష్కలంగా వుంటాయి.
ఈ దేశ గౌరవాన్ని పెంచే చారిత్రక కథలు చెప్పి సద్గుణాలు, సదాచారం ప్రేరణ కలిగించేటటువంటి నీతి కథలు వినిపించాలి. భజన, కీర్తన, గ్రంథ పఠనం చేయించి, తర్వాతి తరాలకు స్ఫూర్తినివ్వాలి.
స్మృతి : సూక్ష్మమైన విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఉపయోగించే క్షమతే స్మృతి. చిన్న చిన్న మాటల ద్వారా, ఉపాయాల ద్వారా దృష్టి పెట్టి, కుటుంబాన్ని పూర్ణత వైపు తీసుకెళ్తుంది మహిళ. మన సాంస్కృతికతను తమ సంతానం వరకు తీసుకెళ్లే క్షమత స్త్రీలోనే వుంటుంది. స్త్రీ ఆధ్యాత్మికత మరియు ధార్మిక పనులలో ఎక్కువ క్రియాశీలకంగా వుంటుంది. దీంతో కుటుంబం నిలబడుతుంది.
మేధా : మేధా అంటే ధారణా శక్తి. తర్కశక్తి, సంశ్లేషణ, మరియు విశ్లేషణ. ఈ క్షమత అంతా స్త్రీలలో వుంటుంది. పరిస్థితులు అర్థం చేసుకొని మసులుకోవడం, వాటికి అనుగుణంగా కుటుంబాన్ని నడిపే మేధ స్త్రీకి మాత్రమే వుంటుంది. ఈ గుణాన్ని ఉపయోగించి దేశ కార్యం, దైవ కార్యంలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
ధృతి : అంటే ధైర్యం. సహనం కూడా. ధైర్యంతో కుటుంబంలోని సమస్యలను ఎదుర్కొంటుంది స్త్రీ. అవసరమైతే తన భర్తకు కూడా ధైర్యాన్ని నూరిపోస్తుంది. శివాజీకి అంత ధైర్యం ఇచ్చింది జిజియా బాయినే కదా. ఏ పని చేయాలన్నా ధృఢత్వం కావాల్సిందే. అయితే ఈ గుణం మహిళలో సహజంగా వుంటుంది. 9 నెలలు భరించి, మోసి, పిల్లల్ని కని, పునర్జన్మ తీసుకుంటుంది మహిళ, అంటే ఎంత ధైర్యం వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
క్షమ : వత్తిడిని ఉత్పన్నం కాకుండా చూసుకోవడం అని అర్థం. అంత:కరణంలో ఏ ప్రామాణిక భావన వుత్పన్నం అవుతుందో అదే క్షమా గుణం. మాతృత్వం యొక్క సంవర్థన క్షమా అనే సద్గుణం ద్వారా అవుతుంది. ఈ గుణం కుటుంబం, సమాజ, రాష్ట్రంఒకే దగ్గర కలిపి వుంచడానికి అవసరమవుతుంది. ఎవరినైనా ఉదార పూర్వకంగా క్షమించడం ఆధ్యాత్మిక గుణం. ఈ గుణం స్త్రీ లోపల జన్మజాతంగా వుంటుంది.
స్త్రీ ఏడు గుణాలు వికసింపచేసుకొని సప్తశక్తీ రూపంలో మాతృత్వం యొక్క సింహాసనం మీద అధిరోహించి, సమస్త మానవ జాతి కళ్యానం చేయడంలో సమర్థురాలవుతుంది. సంపూర్ణ ప్రపంచానికి దిశా నిర్దేశం చేయగలుగుతుంది.