
ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకొని ‘‘భాగ్యనగర్ శివాజీ సేవా సమితి’’ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఫిబ్రవరి 19వ తేదీ గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ జాతీయ సేవా పురస్కార్ 2026’’ పేరిట జాతీయవాద జర్నలిస్టులకు పురస్కారాలను ప్రదానం చేశారు. సుమారు 60 మంది పాత్రికేయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి హాజరై పలువురు జర్నలిస్టులకు అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మాట్లాడుతూ సమాజానికి ఛత్రపతి శివాజీ అత్యున్నత విలువలతో కూడినటువంటి దిశానిర్దేశం చేశారన్నారు. శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం ఎంతో చేశారని, వాటి నుంచి అందరూ స్ఫూర్తి పొందాలన్నారు. పాత్రికేయులు వాస్తవాలు రాయాలి, ఊహాజనిత వార్తలకు ప్రాధాన్యత ఇవ్వరాదని దత్తాత్రేయ కోరారు. రాజ్యాంగంలో నాలుగో స్థంభమైన పాత్రికేయులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భాగ్యనగర్ శివాజీ సేవాసమితి బాధ్యులు నందనం దివాకర్, నందనం కృపాకర్, వారి బృందం అభినందనీయులని మాజీ గవర్నర్ అభినందించారు. ‘‘భాగ్యనగర్ శివాజీ సేవా సమితి’’ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నందనం దివాకర్ మాట్లాడుతూ సమాజాన్ని నిత్యం చైతన్యపరుస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించి, గౌరవించడం తమ బాధ్యతగా భావించామన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా పేదకుటుంబాల మహిళలకు చీరల పంపిణీ కూడా చేపట్టి ‘‘భాగ్యనగర్ శివాజీ సేవా సమితి’’ తన సామాజిక బాధ్యతను కూడా నిర్వహించింది.
తల తిప్పుకోనివ్వని విద్యార్థుల ప్రదర్శనలు..
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాణిని ప్రభాత కన్యా మహావిద్యాలయకు చెందిన విద్యార్థినులు శ్రీమతి ఆచార్య సవితా దేవి నేతృత్వంలో చేసిన వేదగానం, యోగాసనాలతో సమ్మిళితం చేసి నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను తలతిప్పుకోనివ్వలేదు. విద్యార్థినులు ఒకరిపై ఒకరు నిలిచి అతిథులకు స్వాగతం పలకడం, నుదిటిపైన దీపాలు పెట్టుకుని అత్యంత సాహసంగా యోగాసనాలు చెయ్యడం అందరినీ అబ్బురపరిచాయి.
ఈ సాంస్కృతిక వేడుకల్లో భాగంగా శివాజీ మహరాజ్ అనితరసాధ్యమైన దేశభక్తి, పాలనా సామర్థ్యం, పోరాట పటిమను చాటేలా విద్యార్థులు ప్రదర్శించిన నాటకం ప్రతి ఒక్కరిలోనూ చైతన్యాన్ని నింపింది. పలువురు విద్యార్థినులు మన సాంస్కృతిక ఘన వారసత్వాన్ని వెల్లడించేలా చక్కని నృత్యాలు చేశారు. బ్రైట్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా ఛత్రపతి శివాజీ మహరాజు ఘనతను క్లుప్త ప్రసంగాలుగా సభలో వివరించి ప్రశంసలందారు.