ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో TAFRC ప్రతిపాదించిన ఫీజుల పెంపును నిలిపివేయాలి: ఏబీవీపీ

    22-Feb-2026
Total Views |

Abvp Flags
 
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ TAFRC ప్రభుత్వానికి నివేదించడాన్ని ABVP తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ "ఫీజుల పెంపు వల్ల పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతారని, TAFRC ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల తగ్గించడాన్ని ABVP స్వాగతిస్తున్నదని,కానీ 63 కళాశాలల్లో ఏ ప్రతిపాదికన భారీగా ఫీజులు పెంపును ప్రతిపాదించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.
 
వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని,ఆ కారణంగా విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, కనీసం సర్టిఫికెట్స్ తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో విద్యార్థులున్నారని విద్యార్థి సంఘాలుగా తాము గతంలో  డిమాండ్ చేసినప్పుడు... అదే విధంగా రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ "ప్రైవేట్ కళాశాలల ఫీజులు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని, అవి దోచుకుంటున్నాయని, ఇంతింత ఫీజులు ఎక్కడైనా ఉంటాయా.." అని చిలుక పలుకులు పలికి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారని రాంబాబు గుర్తు చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీలో కళాశాలలకు ముఖ్యమంత్రి గారికి నడిచిన రహస్య ఒప్పందంతోనే ఈ ఫీజుల పెంపు నిర్ణయానికి వచ్చినట్లు ABVP భావిస్తుందన్నారు.
 
ముఖ్యమంత్రికి దమ్ముంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఆడిట్ రిపోర్ట్స్ బహిర్గతపర్చాలని రాంబాబు డిమాండ్ చేశారు. ఒక వైపు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు జీతాలు పెంచకుండా, సౌకర్యాలు కల్పించకుండా ఏ విధంగా ఫీజులు పెంచుతారని నిలదీశారు. ఈ నిర్ణయం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ 19 కళాశాలల్లో తగ్గించిన ఫీజులు సైతం ఈ పెంపుపై విమర్శలు రాకుండా తీసుకున్న నిర్ణయమే అన్నారు. తన అనుయాయులకు సంబంధించిన కళాశాలలకు లబ్ది చేకూర్చడమే ముఖ్యమంత్రి ధ్యేయం అని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని కళాశాలల్లో ఫీజుల తగ్గించాలని, తప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ పై ఎంక్వైరీ చేసి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు బాకీ పడ్డ రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హెచ్చరించారు.