భారీ కుట్ర భగ్నం..ఎనిమిది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన భద్రతా సంస్థలు

VSK Telangana    23-Feb-2026
Total Views |



terrorist

పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా, బంగ్లాదేశ్లోని ఉగ్ర గ్రూపుల అండదండలతో భారత్లో భారీ ఉగ్ర దాడికి కుట్ర పన్నారన్న అనుమానంతో 8 మంది వ్యక్తులను తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. వీరిలో ఆరుగురు అనుమానితులను తమిళనాడు తిరుపూర్జిల్లాలోని వస్త్ర తయారీ యూనిట్ల నుంచి అరెస్టు చేయగా ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

అరెస్టయిన అనుమానితుల్లో ఓ బంగ్లా దేశీయుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనుమానితులను తమిళనాడు పోలీసులు ఢిల్లీ పోలీసులకు అప్పగించనున్నారు. ఉగ్రవాద సంస్థల నుంచి వీరికి నిధులు సమకూరుతున్నాయని, వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సోషల్మీడియా ద్వారా ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న ఓ బంగ్లాదేశీ హ్యాండ్లర్తో సంప్రదింపులు జరిపినట్లు వారు చెప్పారు.

ఇక ఆపరేషన్ సమయంలో ఎనిమిది మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ఆధారాలు, ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. బంగ్లాదేశ్కు చెందిన తంజీమ్ సంస్థలతో వీరి సంబంధాలపై మరింత విచారణ చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఉగ్రముఠాతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఎనిమిది మంది సోషల్ మీడియా ద్వారా పరస్పరం సంప్రదింపులు కొనసాగించిటన్లు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్కు చెందిన ఉగ్ర సంస్థలకు మద్దతుగా పోస్టులు పెట్టినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా దిల్లీకి వచ్చి 'ఫ్రీ కశ్మీర్' వంటి ప్రేరేపణాత్మక పోస్టర్లు మెట్రో స్టేషన్లో అతికించినట్లు పోలీసుల తెలిపారు. ఆ తర్వాత తిరిగి తమిళనాడు, బెంగాల్కు వెళ్లినట్లు వెల్లడించారు.