సమ్మక్క సారక్క జాతర ఘనంగా ముగిసింది. 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. అయితే.. ఇంతటి మహత్తర జాతరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో వనవాసి, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (ఎస్ ఎఫ్ డి), స్టూడెంట్స్ ఫర్ సేవ (ఎస్ఎఫ్ఎస్), రాష్ట్రీయ కళామంచ్ (ఆర్ కె ఏం)ల ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “వన జాతర – మన జాతర” అనే భావన మాటల్లో కాదు, కార్యాచరణలో కనిపించింది.
పర్యావరణానికి సేవ – లక్ష క్లాత్ బ్యాగుల పంపిణీ లక్షలాది భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎబివిపి ఆధ్వర్యంలో మీదుగా మొత్తం 1.22 లక్షల క్లాత్ బ్యాగులు, 10 వేల మాస్క్ లను భక్తులకు పంపిణీ చేశారు. కేవలం పంపిణీ కార్యక్రమంగా కాకుండా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణాన్ని కాపాడే ఒక స్పష్టమైన, బాధ్యతాయుతమైన చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అడవుల్లోకి సరుకులు మోసుకుంటూ, ఎండను, అలసటను లెక్కచేయకుండా పని చేసిన కార్యకర్తల అంకితభావం ఈ కార్యక్రమానికి ప్రాణం. ఎస్ ఎఫ్ డి ఆధ్వర్యంలో `ప్లాస్టిక్ విముక్త మేడారం’ (ఎస్ ఎఫ్ డి) నినాదంతో విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అడవులకు, జీవజాలానికి, మానవ ఆరోగ్యానికి కలిగే నష్టాలపై భక్తులకు అవగాహన కల్పించారు.
అలాగే మేడారం, ఊరటం గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా పరిశుభ్రతపై చైతన్యం నింపారు. “పర్యావరణాన్ని కాపాడటం కూడా అమ్మవారికి చేసే సేవే” అనే భావనను ఆచరణలో చూపించారు. ఎస్ఎఫ్ఎస్ ఆధ్వర్యంలో పరిశుభ్రత నుండి ప్రాణరక్షణ వరకు `ప్లాస్టిక్ మేడారం ను శుభ్రం చేయండి’ కార్యక్రమం ద్వారా జాతర ప్రాంగణమంతా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పరిశుభ్రతను కాపాడారు.
లక్షలాది భక్తులు వచ్చే జాతరలో ఇది అత్యంత కష్టమైన పని అయినా, చిరునవ్వుతో పనిచేసిన కార్యకర్తల నిబద్ధత ప్రశంసనీయం. అలాగే ఎస్ ఆర్ డి ఎఫ్ బృందం ద్వారా జంపన్న వాగులో పడిపోయిన భక్తులను ప్రాణాపాయం నుంచి రక్షించడం, ట్రాఫిక్ నియంత్రణ నిర్వహించడం, అంబులెన్స్లకు దారి ఇవ్వడం వంటి అత్యంత బాధ్యతాయుతమైన సేవలు నిర్వహించారు. ఇది ధైర్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.
మేడారం జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకురావడం. ఈ పవిత్ర కార్యక్రమంలో వనవాసి కార్యకర్తలు రోప్ పార్టీగా పనిచేశారు. అడవుల్లోకి వెళ్లి, కఠినమైన దారుల్లో నడిచి, భద్రతను కాపాడుతూ, దారులు సరిచేస్తూ సాహసోపేత సేవలు అందించారు. అలాగే గద్దెల దగ్గర భక్తుల నియంత్రణ, దర్శన వ్యవస్థ నిర్వహణలో వనవాసి కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటల కార్యక్రమాలు జాతర వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చాయి. సమ్మక్క–సారలమ్మ గాథ, గిరిజన సంస్కృతి, సేవా భావనను పాటల రూపంలో ప్రజలకు చేరవేయడం ఎంతో ప్రభావవంతంగా జరిపారు. మొత్తం 240 మంది కార్యకర్తలు వారం రోజులపాటు సేవా ప్రవేశశిక్షణ ద్వారా జనవరి 25 నుండి 31 వరకు ఈ సేవలు అందించారు. వారిలో 20 మంది బాలికలు ఉన్నారు.చివరి రోజున సేవాకార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు ఏబీవీపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ సేవా ప్రవేశశిక్షణ సర్టిఫికెట్లు అందించారు.