కుటుంబం ఒక శిక్షణాలయం

VSK Telangana    03-Feb-2026
Total Views |

family
 
 
మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన కుటుంబాలలో సంబంధ బాంధ్యవాలు ఉంటాయి. అది రక్త సంబంధమైనా, భావనా సంబంధం అయినా, ‘వీళ్ళు మనవాళ్ళు’ అనే భావంతో కుటుంబం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యం. బయటి దేశాలవాళ్ళు కుటుంబం భద్రత కోసం ఉంటారు. కాని మనుషులు ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా ఉంటే పిచ్చివారయి పోతారు. సాధారణంగా కుటుంబంలో పిల్లలు అల్లరి చేస్తారు. చాలా విషయాలు వాళ్లకు తెలియవు. వాటిని క్రమంగా నేర్చుకుంటారు. అలా నేర్చుకునే వ్యవస్థ కుటుంబం నుండే వస్తుంది. సమాజంలో ఒక భాగం ‌ కుటుంబం.
 
కుటుంబం ఒక శిక్షణాలయం. ఇంట్లో పనిచేసే వాళ్లను సైతం మనం పిన్ని, బాబాయ్ అంటాం. ఇంట్లో కుక్క, గోవు ఉంటే వాటిని కూడా ఆదరించాలని తెలుస్తుంది. ఇంట్లో వేపచెట్టు, తులసిచెట్టు ఉన్నాయి. ఇవి కూడా నావే. కుటుంబం తరువాత అవన్నీ ‘పరివారం‌’ అయిపోతాయి. బిచ్చగాడు వస్తే ఒక పిడికెడు బియ్యం వేసి రమ్మని పిల్లలను పంపిస్తే ఆ బిచ్చగాడు మన కుటుంబంలోని వాడు కానప్పటికీ, అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వాలి అని తెలుస్తుంది. అలా సమాజం నడుస్తుంది. ఇంట్లో తండ్రి సంపాదిస్తాడు. అందరూ భోజనం చేస్తారు. కాని తండ్రి ఇంటికి రాగానే సేవలు చేస్తారు. పిల్లలు సంపాదించడం లేదు. కాని వారిని చక్కగా పెంచి పోషించి, పెద్ద చేస్తారు తల్లిదండ్రులు. తరువాత వాళ్ళు చూస్తారా లేదా.. అని కాదు. పిల్లలు మంచి వ్యక్తులుగా తయారు కావాలనేది వారి ఉద్దేశ్యం.
 
కుటుంబంలో చేసే విషయాలే సమాజంలో ప్రతిబింబిస్తాయి. కుటుంబంలో ఇచ్చిన సంస్కారమే పెద్దయిన తరువాత పిల్లల్లో వెల్లివిరిసే విషయమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కుటుంబం ఒక ఆర్థిక ఆలంబన అవుతుంది. పొదుపు చేయమని ఇంట్లో అమ్మకు ఎవరు చెప్పారు.. అది ఆమె కర్తవ్యంగా చేసేస్తుంది. మన కుటుంబాల్లో ఎంతకావాలో అంత వాడుకుంటారు, పొదుపు చేస్తారు. కాని దేశం కోసం అవసరమైతే ఇచ్చేస్తారు కూడా.. ఇది కుటుంబం నుంచి వచ్చిన సంస్కారం. పరస్త్రీ తల్లి అనేది మన భావన. ఇది ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇచ్చే సంస్కారం. పరద్రవ్యం మట్టి అనే విషయం కుటుంబంలో అనుభవమవుతుంది. విదేశాల్లో వివాహం ఒక కాంట్రాక్ట్‌ వంటిది. మనకు వివాహం బంధం వంటిది. ఏడు జన్మల సంబంధం. నలదమయంతులు, సీతారాముల దాంపత్యం ఆదర్శవంతమైనది.
 
వ్యక్తి.. `వ్యక్తి నుంచి కుటుంబం, కుంటుంబం నుంచి పరివారం, పరివారం నుంచి గ్రామం, గ్రామం నుంచి సమాజం, సమాజం నుంచి మానవత, మానవత నుంచి విశ్వ సృష్టి వరకు మన పిల్లలు ఆలోచించే సంస్కారాన్ని మనం ఇవ్వగల్గుతున్నామా? అని ఆలోచించాలి. కొత్త తరానికి ఈ సందేశం వెళ్తున్నదా? వారంలో ఒకసారి ఈ సంవాదం జరగాలి. సమాజం, దేశం ముందు అన్న విషయం కటుంబ జీవనంలో మనం గ్రహించాలి. మంచి సమాజం కోసం మంచి కటుంబం కావాలి. ఇవాళ ప్రపంచానికి మన కుటుంబ వ్యవస్థ ఆదర్శం కావాలి. ప్రపంచం మన వైపు చూస్తున్నది.