పాలస్తీనా అనుకూల పోస్టర్లు, స్టిక్కర్లను ప్రదర్శిస్తున్న బ్రిటీష్ పర్యాటకులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సీరియస్ అయ్యి, వెంటనే భారత్ విడిచి వెళ్లిపోవాలని బ్రిటీష్ పర్యాటకులను ఆదేశించారు.
రాజస్థాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు విదేశీ పర్యాటకులు పర్యాటక వీసా షరతులను ఉల్లంఘించారని, దీంతో వెంటనే భారత్ విడిచి వెళ్లిపోవాలని సీఐడీ పోలీసులు ఆదేశించారని వెల్లడించారు. పర్యాటక వీసా తీసుకొని వచ్చేవారు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దన్న నిబంధన స్పష్టంగా వుందని, దానిని వీరు ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు.
గత 21 వ తేదీన ‘‘ఫ్రీ పాలస్తీనా, ఇజ్రాయిల్ ను బహిష్కరించండి’’ వంటి సందేశాలున్న స్టిక్కర్లు, పోస్టర్లు పుష్కర్ అంతటా కనిపించాయి. దీంతో పోలీసులు విచారణకు ఉపక్రమించారు. ఈ పోస్టర్లు ఇద్దరు బ్రిటీష్ పౌరుల వద్ద వున్నట్లు చివరికి సీఐడీ పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు పౌరులు కూడా జనవరి మొదటి మాసంలో న్యూఢిల్లీ నుంచి పుష్కర్ కి వచ్చారు. స్థానిక ప్రింటింగ్ ప్రెస్ లో తొమ్మిది షీట్ల పోస్టర్లను తయారు చేయించుకొని, ఆ తర్వాత పుష్కర్ నగరంలో చాలా చోట్ల అతికించారు. ఈ విషయాన్ని పోలీసులు పేర్కొంటున్నారు.
మరో వైపు ఈ ఘటనపై సీఐడీ ఎస్పీ రాజేష్ మీనా కూడా ధ్రువీకరించారు. పర్యాటక వీసా నిబంధనలను ఆ పౌరులు స్పష్టంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘‘వారు పర్యాటక వీసాలపై భారత దేశానికి వచ్చారు. భారత్ లో వున్నప్పుడు మరో దేశం పట్ల శత్రుత్వం, లేదా అగౌరవాన్ని చూపే కార్యకలాపాలకు వీసా నిబంధనల ప్రకారం తప్పు. పుష్కర్‌లో ఇజ్రాయెల్ దేశస్థులు గణనీయమైన సంఖ్యలో వుంటారు. అక్కడ ఒక చబాద్ హౌస్ కూడా ఉండటంతో, ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు.
అయితే... పోలీసుల విచారణలో బ్రిటీష్ పర్యాటకులు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయినా.. అది కుదరదని, నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని తాము విస్మరించలేమని పోలీసులు ఖరాఖండిగా చెప్పేశారు. విచారణ అనంతరం ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద నోటీసులు అందజేశారు. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.