హిందుత్వం అనేది ఓ పుస్తకం కాదు.. విశాల గ్రంథాలయం : కృష్ణ గోపాల్

VSK Telangana    04-Feb-2026
Total Views |
 
gopal ji
 
భారత్ కి అద్భుతమైన నాగరిక చరిత్ర వున్నప్పటికీ, దేశం దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు విదేశీ పాలనలో వుండటం వల్ల హిందువుల ఐక్యత, సంఘటనా శక్తి కోల్పోయేలా చేసిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ కృష్ణగోపాల్ అన్నారు. ఈ నేపథ్యంలో హిందూ సమాజాన్ని సంఘటిత పరచడానికే హెడ్గేవార్ 1925 లో విజయదశమి నాడు సంఘ్ ని స్థాపించారని వివరించారు. హిమాచల్ ప్రదేశ్ లోని నలాఘర్ లో సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘ప్రముఖ జన గోష్ఠి’’ నిర్వహించారు. ఈ గోష్ఠికి 230 మంది హాజరయ్యారు. ఇందులో వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా కృష్ణ గోపాల్ సంఘ్ కి సంబంధించిన 100 ఏళ్ల ప్రయాణం గురించి వివరించారు. అలాగే పంచ పరివర్తన్ (కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, పౌర విధులు) గురించి వివరించారు. దీని ద్వారా ‘‘స్వ’’ అనేది మేల్కొలపడానికి కుదురుతుందన్నారు. ;పౌరులందరూ హక్కుల కంటే ముందు పౌర విధులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 

మతం, ఆరాధనా పద్ధతి, విశ్వాసంతో సంబంధం లేకుండా ఈ భారత భూమిని తమ తల్లిగా భావించే ప్రతి ఒక్కరూ హిందువేనని స్పష్టం చేశారు. హిందుత్వం అనేది కేవలం ఓ పుస్తకం కాదని, విభిన్న ఆలోచనా స్రవంతులు కలిగిన ఓ విశాల గ్రంథాలయం లాంటిదని అభివర్ణించారు.
 
ఇక.. సంఘ్ సంస్థాగత బలాన్ని కూడా నొక్కి చెబుతూ.. ఈరోజు దేశ వ్యాప్తంగా 83,00 శాఖలు నడుస్తున్నాయని, అలాగే సంఘ్ స్ఫూర్తితో నడిచే 40 కి పైగా సంస్థలు జాతీయ పునర్నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నాయని వివరించారు. విలువలు, సంస్కారాలకు కేంద్రంగా కుటుంబాలు మారాలని, దైనందిన జీవితంలో మాతృభాష వాడకాన్ని ప్రోత్సహించాలని, భారత దేశపు మహోజ్వల చరిత్ర, పూర్వీకుల పట్ల గర్వపడేలా సమాజాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
 
ఇక.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశ్రీ 1008 జగద్గురు వికాస్ దాస్ మహారాజ్ హాజరై, ఆశీ:పూర్వక ప్రసంగం చేశారు. సంఘ్ చేస్తున్న, చేసే కార్యకలాపాలకు సమాజం మరింత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. దేశ ఐక్యతను మరియు సమగ్రతను బలోపేతం చేయడానికి, యావత్ హిందూ సమాజం సంఘటితంగా ఉండటం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు.