అన్ని జీవులూ భగవంతుని స్వరూపాలేనని, అందుకే ఇతరులకు సేవ చేయడం మన కర్తవ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ఉద్బోధించారు. దాన ధర్మాలను కాదు, మన సేవనే విశ్వసిస్తామని అన్నారు. జీవితంలో ఇతరులకు సేవ చేయానికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సేవ మనల్ని శుద్ధి చేస్తుందని, మన దగ్గర ఉన్నది ఏదైనా సమాజానికి ఇవ్వాలన్నారు.
ఇండోర్ లోని కాస్రవాడలోని లేపాలోని శ్రీరామకృష్ణ విశ్వ సద్భావన నికేతన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తి నిర్మాణం నుంచి దేశ నిర్మాణం అనే అంశంపై మార్గదర్శనం చేశారు.
మానవులు వినడం లేదా మాట్లాడటం ద్వారా కాకుండా పరిశీలించడం ద్వారానే నేర్చుకుంటారని వివరించారు. సత్యం అనేది బయట ఎక్కడో లేదని, మనుషుల లోపలోనే వుందన్న విషయం కేవలం భారత్ లోనే అర్థమవుతుందన్నారు. భారత్ లోనే స్వీయ అన్వేషణ, అంతర్గత శోధన అనే ప్రయాణం ప్రారంభమవుతుందున్నారు. మనలో మనం ప్రయాణం చేస్తుంటే (అంతర్ముఖత్వం) ద్వారా జీవుడు శాశ్వత ఆనందం వైపు వెళ్తాడని వివరించారు. ఈ అంతర్ముఖత్వం అనేది మనుష్యుడిని శాశ్వత ఆనందం వైపు నడిపిస్తుందని, మన ఉనికి అంతా ఆధ్యాత్మికతే పునాదిగా వుండాలని పూర్వీకులు బోధించారన్నారు.
ఇతరుల కష్ట సుఖాలను అర్థం చేసుకునే శక్తి భగవంతుడు ఒక్క మనుష్యుడికే ప్రసాదించాడని, ఇతరులను నిర్లక్ష్యం చేసి, మనం మాత్రమే ఆనందాన్ని పొందడం అనేది కరుణ అనిపించుకోదన్నారు. నైతిక విలువలను నిలబెట్టడానికి విద్య, శీలశుద్ధి అత్యవసరం అని అన్నారు. తమకు వచ్చే కష్టాల నుంచి బయటపడడానికే కాకుండా సమాజాన్ని కూడా కష్టాల నుంచి బయటపడేయడానికి విద్య ఉపకరిస్తుందన్నారు. ఇదే భారత సహజ స్వభావం అని, ఇలాంటి చైతన్యాన్ని ప్రపంచానికి అందించడానికే భారత్ ఆవిర్భవించిందన్నారు. పరాయి పాలనలో వున్నా.. ఈ సహజత్వం మారలేదని గుర్తు చేశారు.
గత జన్మల జ్ఞానం మానవ మనస్సులోనే నిక్షిప్తమై ఉంటుంది; కాబట్టి, మనసులో ఉన్న ఆ జ్ఞానాన్ని బయటకు తీసుకురావాలని సూచించారు. తాంత్యా మామా మరియు గాడ్గే మహారాజ్ వంటి మహనీయులు ఎలాంటి అద్భుతమైన విద్యను అభ్యసించకపోయినా.. నేటికీ వారిని సమాజం గౌరవిస్తూనే వుందన్నారు. దైవిక లక్షణాలు మనలో అంతర్లీనంగా ఉంటాయి; మనం వాటిని వెలికి తీయాలని తెలిపారు. విద్య అంటే ప్రపంచ మానవతా జ్ఞానాన్నిఅందిచేదని, ఓ వ్యక్తిని స్వావలంబన చేసేదని వివరించారు. కేవలం ఫలితాలపైనే కాకుండా, ప్రామాణికమైన, అద్భుతమైన పనిపై దృష్టి నిలపడం భారత దేశ స్వభావం అని వివరించారు.
భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. భారతదేశ ప్రగతి అంటే నీరు, అడవులు, నదులు, పర్వతాలు, జంతువులు మరియు మానవులు - వీటన్నింటి ప్రగతి అని వివరించారు.