అక్రమ చొరబాటుదార్లను గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వండి : భాగవత్ పిలుపు

    09-Feb-2026
Total Views |
 
bombay
 
తమ తమ నివాస స్థలాల్లో అక్రమ చొరబాటుదారులను గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు. అలాగే వారికి ఎలాంటి ఉపాధి కల్పించొద్దని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
ముంబైలోని వర్లీలో ‘‘100 ఏళ్ల సంఘ యాత్ర - కొత్త ఆశయాలు’’ అన్న శీర్షికతో కార్యక్రమం జరిగింది. అందులో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొరబాట్లకు సంబంధించి ప్రభుత్వం చాలా చేయాల్సింది వుందని, వారిని దేశం నుంచి బహిష్కరించాలని, ఇప్పటి వరకూ ఇది జరగలేదన్నారు. కానీ నెమ్మదిగా ప్రక్రియ ప్రారంభమైందని, ఇది క్రమంగా పెరుగుతోందన్నారు. జనాభా లెక్కలు లేదా సర్ ప్రక్రియ చేస్తే ఈ దేశ పౌరులు కాని చాలా మంది బయటికి వస్తారని అన్నారు.
 
ఇక.. సంఘ్ కి సంబంధించిన సరసంఘచాలక్ బాధ్యతపై కూడా స్పందిస్తూ.. క్షత్రియ, వైశ్య, శూద్ర లేదా బ్రాహ్మణ అనే కులంతో సంబంధం లేకుండా ఆ బాధ్యతను చేపట్టవచ్చని అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారైనా సర సంఘ్ చాలక్ కావచ్చన్నారు. ఎవరైనా ఈ బాధ్యతలు చేపట్టవచ్చని, అది పనిచేసే స్వభావంపై ఆధారపడి వుంటుందన్నారు.
 
ఇక.. ఉమ్మడి పౌరస్మృతి ఆలోచన కూడా మంచిదేనని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. వైవిధ్యం విషయంలోనూ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సమానత్వం, దేశ ఐక్యతను బలోపేతం చేస్తే, దానికి తాము మద్దతిస్తామని ప్రకటించారు. భిన్నత్వంపై కూడా తమకు అభ్యంతరం లేదన్నారు. సమానత్వం దేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని, అందుకే తాము మద్దతిస్తామన్నారు.ఉత్తరాఖండ్ రాష్ట్రం మొదట ఉమ్మడి పౌర స్మృతిని ప్రతిపాదించి, ఆ తర్వాత ప్రజల నుండి సూచనలు కోరింది, మరియు మూడు లక్షల సూచనలను స్వీకరించింది. ఆ తర్వాత వారు ఆ చట్టాన్ని అమలు చేశారని గుర్తు చేశారు,. ఒక చట్టాన్ని రూపొందించడం మాత్రమే సరిపోదు. ఆ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
 
హిందూ ధర్మం, బౌద్ధమతం గురించి సమాధానమిస్తూ.. బుద్ధుడు కూడా తన మతాన్ని సనాతన ధర్మం అనే పిలిచేవాడని, హిందూమతం అనేది స్వతహాగా ఒక మతం కాదని, వైదిక మతం, బౌద్ధమతం అని రెండు శాఖలున్నాయని వివరించారు.
 
ఇక.. ఇస్లాం, క్రైస్తవం గురించి మాట్లాడుతూ.. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక ఆదర్శాల నుంచి పక్కకు తొలగి, రాజకీయ ఆధిపత్య మార్గంలో పయనిస్తున్నాయని అన్నారు. ఈ రెండూ వాటి వాటి మూలాల వైపు తిరిగి రావడం అవసరం అన్నారు.
 
ఇక.. సావర్కర్ కి భారత రత్న పురస్కారం ఇస్తే.. ఆ గౌరవం, ప్రతిష్ఠ మరింత పెరుగుతుందన్నారు. అయితే.. ఇంకా ఎందుకు ఆలస్యం అవుతోందని అడగ్గా.. ఆ కమిటీలోనే తాను లేనని, సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకుంటానని అన్నారు.
 
దేశ వ్యతిరేక శక్తులు పన్నుతున్న కుట్రల గురించి కూడా ప్రస్తావిస్తూ.. 2047 లో దేశం విడిపోతుందన్న భయాలను పెంచుకోవడం మానేసి, అఖండ భారత్ ఆవిర్భావం గురించి ఆలోచించాలని సూచించారు. భారత్ ఇప్పుడు చాలా ముందుకు వెళ్లిందని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారే స్వయంగా విచ్ఛిన్నమవుతున్నారని అన్నారు. భారత్ అఖండ భారత్ గా రూపుదిద్దుకుంటుందని, ఇదే విషయాన్ని హృదయాలలో సుస్థిరం చేసుకోవాలన్నారు.
 
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లోని 1.25 కోట్ల మంది హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
బీజేపీ అధికారంలోకి రావడం వల్ల సంఘ్ కి ప్రత్యేకంగా లాభమేమీ జరగలేదని, పైగా సమాజంలో సంఘ్ పై పెరుగుతున్న నమ్మకం, ఆమోదంతో భారతీయ విధానాలకు కట్టుబడి వుండే పార్టీలకు ప్రయోజనం చేకూరిందన్నారు. స్వయంసేవకుల అహర్నిషలు కష్టపడే స్వభావంతో, అలాగే సమాజం నుంచి లభిస్తున్న ప్రేమ, నమ్మకం కారణంగా సంఘ్ కార్యం విస్తరించిందన్నారు.