ఓ మనిషి బ్రతికున్నపుడు ఎన్ని పాపాలు చేసినా చనిపోయాక కనీసం అయ్యో పాపం అంటాం. కానీ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణవార్తతో సొంత ఇరాన్ దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రజా ఉద్యమకారులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం తన రాక్షస పాలనతో మూడున్నర దశాబ్దాల పాటు ప్రజలను నరకయాతనకు చేయడమే. అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు.
ఇరాన్ సుప్రీం నేతగా 1989లో పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించిన ఆయతుల్లా అలీ ఖమేనీ తన పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజా ఉద్యమాలను క్రూరంగా అణచివేశాడు. అలాంటి నేత.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందనే చెప్పాలి.
చిన్న వయసులోనే షియా మత బోధకుడిగా మారిన ఖమేనీ ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా జరిగిన 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించాడు. 1980లో టెహ్రాన్‌లో శుక్రవారం జరిగే ప్రార్థనలకు మత ప్రబోధకుడిగా నియమితుడయ్యాడు. ఇస్లాం పట్ల అంతగా అవగాహన లేకపోయినా మంచి వక్తగా మాత్రం పేరు సంపాదించాడు.
1989లో అధ్యక్షుడిగా ఎన్నికై ఇరాన్‌ను అభివృద్ధి పథంలో నడుపుతానని ప్రజలకు హామీ ఇచ్చిన ఖమేనీ అధికారాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఐఆర్‌జీసీ - అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ వ్యవస్థను బలోపేతం చేసి దాన్ని తన వ్యక్తిగత అస్త్రంగా మలచుకున్నారు. తనకు ఎదురైన ప్రతి అసమ్మతిని ఐఆర్‌జీసీ సాయంతో అణచివేశాడు.అంతటితో ఆగకుండా లెబనాన్, గాజా, ఇరాక్, యెమెన్, సిరియాలకు ఐఆర్‌జీసీ నెట్‌వర్క్‌ను విస్తరించాడు. ఐఆర్‌జీసీ ద్వారా అక్కడి ఇస్లాంలోని షియా వర్గానికి చెందిన మిలిటెంట్లకు ఆయుధాలు, డబ్బును చేరవేశాడు.
లెబనాన్‌లో హెజ్‌బొల్లా.. ఇరాక్‌లో ఖతాయబ్ హెజ్‌బొల్లా, గాజాలో హమాస్, యెమెన్‌లో హూతీ వంటి కరుడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు పురుడు పోసుకోవడానికి కారణం ఆయతుల్లా అలీ ఖమేనీ చర్యలే. తనకు వ్యతిరేకంగా ఉన్న వేలాది మంది రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా MEK సభ్యులను అమానవీయంగా హత్య చేయించాడు. 2009లో ఎన్నికల మోసం ఆరోపణలపై జరిగిన Green Movement అణచివేతలో వందలాది మంది మరణించారు, వేలాది మంది అరెస్ట్ అయ్యారు. 2019లో ఇంధన ధరలపై జరిగిన నిరసనల్లో వందలాది మంది ప్రజలు చంపబడ్డారు.
2022 సెప్టెంబర్ 13న తెహ్రాన్‌లో 22 ఏళ్ల కుర్దిష్ యువతి జినా మహ్సా అమినీని అక్కడి Gasht-e Ershad అనబడే ఇస్లామిక్ పోలీసులు చేశారు. కారణమేమంటే ఆమె హిజాబ్‌ను "తప్పుగా" ధరించినట్టు ఆరోపణ రావడం. దీంతో ఆ యువతిని ఇస్లామిక్ శిక్షణ పేరిట "రీ-ఎడ్యుకేషన్ సెంటర్"లో ఉంచి చిత్రవధ చేశారు. సెప్టెంబర్ 16న మహ్సా అమినీ మరణించింది. ఆమె "హార్ట్ అటాక్"తో చనిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్లు మాత్రం మెదడు నుండి రక్తస్రావం (brain hemorrhage) అని చెప్పారు. దీంతో సెప్టెంబర్ 17న ఆమె స్వస్థలం సిక్ఖేజ్‌లో అంత్యక్రియల సమయంలో నిరసనలు మొదలయ్యాయి. మహిళలు జుట్టు కత్తిరించుకుని, హిజాబ్‌లు కాల్చారు. ఇరాన్ అంతటా 130పైగా నగరాలు, 31 ప్రావిన్స్‌లు, యూనివర్సిటీలకు ఈ నిరసనలు వ్యాపించాయి.ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేసి దారుణంగా కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం వంటి చర్యలతో చిత్రహింసలకు గురిచేసింది.ఈ క్రమంలో జైలుల్లో వందలాది మంది చనిపోయారు.
మానవత్వం సైతం తలదించుకునేలా నిరసనకారులను బహిరంగంగా క్రేన్‌లపై వేలాడదీసి ఉరితీశారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం మొత్తం 551 మంది ఈ నిరసనల్లో చనిపోగా వారిలో 68 మంది చిన్నారులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా 200 మందే అని చెప్పుకుంది. 2025-2026 మధ్య చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిన నిరసనలపై ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం సాగించిన దమనకాండ చరిత్రలోనే అత్యంత హిసాత్మకమైనది.
ఈ నిరసనల్లో 7,000 పైగా ప్రజలను ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం హత్యచేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు క్రేన్‌లపై వేలాడదీసి బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేసింది.
షియా ముస్లిం వర్గానికి చెందిన ఖమేనీ ముస్లింలలోనే ఒక వర్గమైన సున్నీలను కిరాతకంగా చంపించాడు.ఖమేనీ పాలనలో సున్నీ ముస్లింలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారు. కనీసం నమాజ్ చేసుకునేందుకు మసీదు నిర్మించుకునే స్వేచ్ఛ కూడా సున్నీలకు లేకుండా పోయింది. కేవలం సిద్ధాంతం విషయంలో విబేధిస్తున్న కారణంగా అనేక మంది సున్నీ ముస్లింలను ఉరి తీయించాడు. అదే క్రమంలో బలూచ్, అహ్వాజీ, బహాయీ, యారెసాన్, కుర్దిష్, క్రైస్తవ ప్రజలపై తీవ్రమైన అత్యాచారాలు జరిపించాడు. వారి ఆస్తుల ధ్వంసం చేయడం, అనేక సంవత్సరాలు వారిని జైల్లో వేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో హెజ్‌బొల్లా, హమాస్ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు అండగా నిలిచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీశాడు.
దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ ఇరాన్ ఆర్థికంగా నష్టపోతూ వచ్చింది. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా అమెరికా ఆంక్షల కారణంగా పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ప్రజలకు ఆర్థికంగా అవకాశాలు కల్పించకపోతే మరో విప్లవం వస్తుందని ఖమేనీ అంచనా వేశాడు. 2015లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మళ్లీ ఇరాన్ ప్రధాన స్రవంతిలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 2018లో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అణు ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఇరాన్ మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆర్థికంగానూ, రాజకీయంగా ఆ దేశం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ నిర్వహించిన దాడులు ఖమేనీ పతనానికి దారి తీశాయి. ఆ దాడుల తర్వాతే పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా మారడం ప్రారంభించాయి.
ఇజ్రాయెల్ కేవలం గాజాలోని హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా ఇరాన్ నిర్మించిన మొత్తం నెట్‌వర్క్‌పై విరుచుకుపడింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లాలపై, యెమెన్‌లో హూతీలపై తీవ్రస్థాయిలో దాడులు చేసింది. హెజ్‌బొల్లా నేత నస్రల్లాను హతమార్చి ఆ సంస్థను దాదాపు నిర్వీర్యం చేసింది ఇజ్రాయెల్.
2025 డిసెంబరులో ఇరాన్‌కు మద్దతిచ్చే సిరియాలోని అసద్ ప్రభుత్వం కుప్పకూలడం ఆయతుల్లా అలీ ఖమేనీకి మరో భారీ దెబ్బ. ఇవన్నీ ఇరాన్‌ను బలహీన పరిచాయి. దీనికి తోడు గతేడాది జూన్‌లో 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ దూకుడు.. దానికి అమెరికా తోడవ్వడంతో ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. వాటిని ఆసరాగా చేసుకొని ఇప్పుడు మళ్లీ ఆ రెండు దేశాలు సంయుక్త దాడులు ప్రారంభించి తొలి రోజునే ఖమేనీని హత్య చేశాయి. ఇది రానున్న రోజుల్లో ఇరాన్‌పై, పశ్చిమాసియాపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి. ఇకపోతే కరుడుగట్టిన ఖమేనీ హతమవ్వడంపై భారతదేశంలో కొందరు కన్నీరు కార్చడం వెనుక కారణాలేంటో కనీసం వాళ్ళకైనా తెలుసో లేదో అన్న సందేహం వస్తోంది.