చిన్న సంస్కార కేంద్రాలతో బస్తీల్లో పెద్ద మార్పులు.. విద్యాపీఠం ఘనత

VSK Telangana    03-Mar-2026
Total Views |
 
vidya
 
‘‘నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్ష’’ ప్రస్తుత కాలం ఇదే. ఎవరిది వారే చూసుకునే ‘‘ఏకాంత కాలం’’ వచ్చేసింది. దీంతో పక్కవాడి బాగోగులు, యోగక్షేమాలు చూసి, వారిని సరైన దారిలో పెట్టాలన్న ‘‘వసుధైక కుటుంబ’’ భావన కొరవడింది. దీంతో సమాజంలో అనేక ‘‘వక్ర గమనాలు’’ ప్రారంభమయ్యాయి. హిరణ్య కశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడ్ని దగ్గరికి తీసుకొని, గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావు? అని అడగ్గా... ‘‘చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!" అని బదులిస్తాడు. అంటే అందరిలో ఈశ్వరుడ్ని, అందరిపై భూతదయ, జాలి, కరుణ, ఇతరులను అభివృద్ధి చేసే చదువులు చదివానని చెప్పుకొచ్చాడు.
 
కానీ.. ఇప్పుడు చదువులు చెబుతున్నారు, విద్యార్థులు నేర్చుకుంటున్నారు.. కానీ.. అసలు ‘‘మర్మం’’ తెలుసుకుంటున్నారా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరి వ్యక్తిగత జీవితం, మార్కుల చుట్టూనే విద్యార్థులను తిప్పేస్తున్నారు. ఆయా విద్యా సంస్థలు కూడా ‘‘నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష’’ అని చూసుకుంటున్నాయో తప్పించి, పేదలకు, నిరక్షరాస్యులకు చదువు చెప్పి, వారిని ఉద్ధరించాలన్న బృహత్ సంకల్పం వాటికి కరువైంది.
 
కానీ.. ‘‘విద్యా భారతి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం’’ అన్న సంస్థ మాత్రం తమ పిల్లలకు చదువులు చెబుతూనే, తోటి సమాజం,నిరక్షరాస్యులు, పేదల జీవితాలలో కూడా ‘‘జ్యోతులు’’ వెలిగించే బృహత్ సంకల్పాన్ని తమ భుజాలకు ఎత్తుకుంది. ఇందుకు యావత్ సమాజం కూడా తనతో కదిలివస్తోంది. సమాజ సహాయ సహకారాలతో ‘‘ఏకోపాధ్యాయ పాఠశాలలు, సేవా బస్తీల్లో ‘‘సేవా కేంద్రాలు, బాల సంస్కార కేంద్రాలు, ఉచిత బోధనా తరగతులను నిర్వహిస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.

vidya2 
 
‘‘అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం.. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలూ కట్టేద్దాం’’ అన్న దానిని తీసుకొని ముందుకు సాగుతోంది విద్యాపీఠం. సమాజంలో వున్న ధనిక, పేద, చిన్న, పెద్ద, జాతి, కుల భేదాలు పోవాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం.
 
‘‘విద్యయా అమృత మశ్నుతే’’ అని ఈశావాస్యం చెబుతోంది. విద్య ద్వారా అమృతత్వాన్ని పొందవచ్చు అని అంటోంది. ఈ అమృతత్వం అందరికీ అందాలన్నది విద్యాపీఠం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా భారతి లక్ష్యానికి అనుగుణంగా ప్రతి శిశుమందిర్ సమీపంలో వున్న సేవా బస్తీలోని బాలబాలికలకు విద్య, సంస్కారం అందిస్తూ ఆ బస్తీలో సామాజిక మార్పును తీసుకొని రావాలన్నది సంకల్పం.
 
అందుకే శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ వ్యాప్తంగా 181 సంస్కార కేంద్రాలను బస్తీల్లో నడుపుతోంది. దీని ద్వారా బస్తీల్లో అనేక సకారాత్మక మార్పులు వస్తున్నాయి. కుటుంబాల్లో మార్పులు వస్తున్నాయి. విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గి, చక్కగా పాఠశాలలకు వెళ్తున్నారు. మొదట పిల్లల్లో సంస్కారాలు అబ్బిన తర్వాత, వాటిని వారి వారి ఇళ్లల్లో కూడా అమలు చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఒక ఐదు ఉదాహరణలను మనం చూద్దాం...
 
విశ్వరూప నగర్ : ఇది హైదరాబాద్ నగరంలోని ఓ బస్తీ. ఆ బస్తీలో ఎక్కువ డ్రాపౌట్స్ వున్నారు. బడికి వెళ్లని పిల్లల సంఖ్య ఎక్కువ. అక్కడ విద్యాపీఠం సంస్కార కేంద్రం ప్రారంభమైన తర్వాత వారిని గుర్తించి, కొన్ని రోజుల పాటు సంస్కార కేంద్రంలో శిక్షణనిచ్చారు. చదువు, సంస్కారాలను బోధించారు. దీంతో పిల్లల్లో ఓ స్పష్టమైన మార్పులు కనిపించాయి. దీని తర్వాత దగ్గర్లో వున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. చక్కగా విద్యనభ్యసించారు. నవోదయ, లాంటి పరీక్షలకు కూడా వెళ్లి పాసయ్యారు. కుటుంబాలు స్థిరత్వం పొందాయి.
 
గౌలిదొడ్డి : ఇది కూడా హైదరాబాద్ నగరంలో వుండే బస్తీ. ఈ సంస్కార కేంద్రాన్ని విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతోంది. ఆ బస్తీలో ఓ ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది. మొత్తం 50 మంది పిల్లలుంటే. అందులో 40 మంది సంస్కార కేంద్రం విద్యార్ధులే. దీంతో ఆ ప్రభుత్వ పాఠశాల దృక్పథమే మారిపోయింది. ప్రతి రోజూ ఆ పాఠశాలలో సూర్య నమస్కారాలు చేయించడం, మధ్యాహ్న భోజన సమయంలో భోజన మంత్రం విధిగా చెప్పించడం, యోగా చేయించడం, నీటి వృథా కాకుండా అరికట్టడం, పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకం లాంటివి చేస్తున్నారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాల సమయంలో సంస్కార కేంద్రంలో పిల్లలకు నేర్పించిన వాటిని ప్రదర్శించడం, అభినయ గేయాలు, వైయక్తిక్ గీత్ లాంటివి కూడా ప్రదర్శిస్తున్నారు.
 
బడంగ్ పేట్, బాలాజీ నగర్ : ఈ బస్తీలో విధర్మీయ శక్తులు విపరీతంగా వున్నాయి. దీంతో అక్రమ మత మార్పిళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడ సంస్కార ప్రారంభమైంది. దీని తర్వాత మతాంతీకరణలు ఆగాయి. ఆదర్శ బస్తీగా మారింది.
 
మహబూబ్ నగర్ నారాయణపేటలో హనుమాన్ నగర్ బస్తీ వుంది. అక్కడ కూడా డ్రాపౌట్స్ సంఖ్య ఎక్కువే. సంస్కార కేంద్రాలు ప్రారంభమైన తర్వాత దీని సంఖ్య తగ్గిపోయింది. పాఠశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. పిల్లల వ్యవహరంలో బాగా మార్పు వచ్చింది. ప్రతి రోజూ దేవాలయానికి వెళ్లడం, ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, రోజూ వారికి నమస్కరించడం లాంటి చక్కని సుగుణాలు అలవడ్డాయి. దీంతో తల్లిదండ్రులు కూడా అమితంగా సంతోషపడుతున్నారు.
 
విశ్వరూప నగర్‌లో సంస్కార కేంద్రం నిర్వహించే వ్యక్తి భర్త ప్రతిరోజూ తాగేవారు. కానీ.. సంస్కార కేంద్రం ప్రభావం మెళ్లి మెళ్లిగా ఆయనపై కూడా ప్రస్ఫుటంగా పడింది. కొన్ని రోజుల తర్వాత మద్యపానాన్ని మానేశారు. ఇప్పుడు వారిది ఆదర్శ కుటుంబం అయ్యింది.
 
కుషాయిగూడ సమీపంలోని నాగారం సమీపంలో రాజీవ్ గృహకల్ప కాలనీ వుంది. దాదాపు ఇందులో 1050 కుటుంబాలు వుంటాయి. అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోనే సంస్కారం కేంద్రం నడుస్తుంది. అక్కడి యువతలో కూడా మార్పు వచ్చింది. శ్రీ సరస్వతీ శిశు మందిరాలను అభిమానించే వారి సంఖ్య కూడా పెరిగింది.
 
ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ కాలనీ అని బస్తీ వుంది. డ్రాపౌట్స్, వ్యసనాలకు బానిసలైన కుటుంబాలు, ప్రతిరోజూ పనిచేస్తే గానీ పొట్ట నిండని కుటుంబాలు వున్నాయి. దీంతో పూర్వ విద్యార్థుల సహకారంతో ‘‘సంస్కార కేంద్రం’’ ప్రారంభమైంది. దీంతో పిల్లల్లో మార్పు సాధ్యమైంది. ‘‘సేవా మండలి’’ పేరుతో ఒక కమిటీ కూడా బస్తీలో నిర్మాణం అయ్యింది.
 
విద్యాభారతి, విద్యాపీఠం పెద్దలు ఆ బస్తీని సందర్శించి, అక్కడి ప్రజలను అడిగినప్పుడు ఆ బస్తీ వాసులు తెగ సంతోషం వ్యక్తం చేశారు. సంస్కార కేంద్రం ద్వారా చాలా నేర్చుకుంటున్నామని, తమ కుటుంబాల్లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ‘‘మా బస్తీలోని బాల సంస్కార కేంద్రం ద్వారా బాలబాలిక వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారు.
 
ఈ ఐదు ఉదాహరణలే కాదు.. ఇలాంటివి కోకొల్లలు. కేవలం చదువు నేర్పించడమే కాకుండా, పిల్లల్లో, కుటుంబాల్లో సంస్కార బీజాలు నాటుతోంది సంస్కార కేంద్రాలు. అలాగే బస్తీల్లో వుండే వారి అవసరాలు చూస్తూ, వారి అవసరాలను కూడా తీరుస్తోంది సంస్కార కేంద్రం. అప్పుడప్పుడు సమాజంలోని ప్రతిష్ఠిత వ్యక్తులను సంస్కార కేంద్రాలకు తీసుకెళ్లి, అక్కడి విద్యార్థులకు, బస్తీలోని ప్రజలకు వారిని పరిచయం చేయడం, వారీ ఆదర్శ జీవితాలను పరిచయం కూడా చేస్తున్నారు.
 
సంస్కారం కేంద్రం చిన్నదే. కానీ.. బస్తీల్లో పెద్ద పెద్ద సామాజిక మార్పులకు కారణమవుతోంది. అలాగే వనవాసీ
క్షేత్రాల్లో కూడా అంటే ఖమ్మం, కొత్తగూడెం, లాంటి ప్రాంతాల్లో కూడా శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 కి పైగానే ఏకోపాధ్యాయ పాఠశాలలను నిర్వహిస్తోంది. దీని ద్వారా పిల్లల్లో మార్పులు వస్తున్నాయి. అలాగే అమాయకులైన వనవాసులను విధర్మీయులు ప్రలోభాలకు గురిచేసి, మతాంతీకరణ చేస్తున్నారు. వారి ప్రలోభాలు, కుయుక్తులకు అడ్డుకట్ట వేసేందుకు గిరిజనుల్లో మన హిందూ ధర్మంపై, సంస్కృతి, సంప్రదాయాల అవగాహనపై కూడా విద్యాపీఠం పనిచేస్తోంది. ఆ ప్రాంతంలోనే చదువుకుంటున్న యువతను గుర్తించి, వారి ద్వారానే ఏకోపాధ్యాయ పాఠశాలలను నిర్వహిస్తోంది. దీని ద్వారా ఆ చిన్నారుల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. సంస్కారం పెరిగింది.
 
అలాగే జాతీయ భావాలను పెంపొందించేందుకు, మన సంస్కృతి సంప్రదాయాలు తరువాతి తరాలకూ అందించేందుకు రక్షా బంధన్ తో పాటు వరలక్ష్మీ వ్రతం, వసంత పంచమి ఇతర పర్వదినాలను కూడా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వనవాసల్లో హిందూ ధర్మంపై మరింత నిష్ఠ ద్విగుణీకృతమవుతోంది.
పూర్తిగా వనవాసులుండే ఉట్నూరు లాంటి ప్రాంతాలు, ఆసిఫాబాద్, లాంటి ప్రాంతాలు, ఇక ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, లాంటి ప్రాంతాలలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం విస్తరించింది. ఇందులో చదువుకున్న వారు పెద్ద పెద్ద అధికారులుగా దేశానికి సేవ చేస్తున్నారు. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా వనవాసులు ఎదిగారు.
 
ఈ విధంగా వనవాసీ క్షేత్రాల్లో, బస్తీల్లో శిశు మందిరాలు సమాజంలో జాతీయ చైతన్యాన్ని సంఘటితం చేస్తున్నాయి. పరివర్తనకు మూల బిందువులుగా మారుతున్నాయి. దీని ద్వారా వనవాసులు మన హిందూ ధర్మం పట్ల జాగృతం అవుతున్నారు.