ప్రపంచాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేస్తూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అదేమిటంటే, అమెరికాకు వత్తాసుగా ఉన్నాయంటూ ఇరాన్ పాలకులు సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, కతార్, యుఎఇ, ఒమాన్, బహ్రెయిన్ దేశాలను కూడా లక్ష్యం చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ప్రపంచంలోని ముస్లిం సమాజంలో అత్యధికులుగా ఉన్న సున్నీ ముస్లింల అతి పవిత్ర క్షేత్రం మక్కా నగరం ఉన్న సౌదీ అరేబియాను సైతం ఇరాన్ వదల్లేదు. ఈ దేశానికి చెందిన అతి పెద్ద చమురు ఉత్పత్తి క్షేత్రం అరొంకోపై బాంబులు వేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇరాక్‌లో షియా ముస్లింలు అత్యధికంగా ఉండగా, ఈ దేశం దాడులు చేసిన ఇతర ఇస్లామిక్ దేశాలను చూస్తే సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, కతార్, యుఎఇ దేశాలు అత్యధికంగా సున్నీలను కలిగి ఉన్నాయి. బహ్రెయిన్‌లో పాలకులు సున్నీలు కాగా, ప్రజల్లో అత్యధికులు షియాలు, ఇక ముస్లిం సమాజం సున్నీ - షియాలుగా విడిపోక ముందున్న ఇస్లామిక్ పద్ధతులను అనుసరించేవారిని 'ఇబాదీ'లుగా పిలుస్తున్నారు. ఒమాన్‌లో వీరే అధికులు.
ఒక్కసారి గతంలోకి వెళదాం.. 1980-88 మధ్య కాలంలో అంటే, 9 ఏళ్ళ పాటు ఇరాన్ పాలకులు ఇరాక్‌తో తీవ్ర యుద్ధం చేశారు. ఇరాక్‌లో కూడా ఇరాన్ వలెనే షియాలు అధికం కాగా.. మిగిలినవారు అరబ్బులు, కుర్దులు. ఆ తర్వాత జనవరి 2024లో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న బలొచిస్తాన్‌లోని అల్-అద్‌ల్ ఉగ్రవాద గ్రూపు లక్ష్యంగా అక్కడ ఇరాన్ దాడి చేసింది. బదులుగా పాకిస్తాన్ కూడా ఇరాన్ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అదే సంవత్సరంలో సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యం అంటూ ఆ దేశంపైనా దాడులు చేసింది. పాకిస్తాన్, సిరియా దేశంలో కూడా సున్నీ ముస్లింలదే ఆధిక్యం. మొత్తంగా చూస్తే ఇరాన్ చేసిన దాడులన్నీ అత్యధికంగా సున్నీ ఇస్లామిక్ దేశాలపైనే జరిగాయి.
ఈ నేపథ్యంలో ఇస్లామిక్ సమాజంలోని ఈ సున్నీ, షియా ముస్లింల గురించి కాస్త తెలుసుకుందాం..
ఇస్లాంలో సున్నీ, షియా అనేవి రెండు ప్రధాన విభాగాలు. వీరిద్దరూ అల్లాహ్‌ను ఏకైక దేవుడిగా, ముహమ్మద్ ప్రవక్తను చివరి ప్రవక్తగా, ఖురాన్‌ను పవిత్ర గ్రంథంగా నమ్ముతారు. అయితే, ముహమ్మద్ ప్రవక్త మరణం (సామాన్య శకం 632) తర్వాత ఇస్లాం సమాజానికి నాయకత్వం ఎవరు వహించాలనే విషయంలో తలెత్తిన విభేదాల వల్ల ఈ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వీరి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటంటే..
1) నాయకత్వం (ఖిలాఫత్ vs ఇమామత్)
సున్నీలు: ప్రవక్త తన తర్వాత వారసుడిని ప్రకటించలేదని సున్నీ ముస్లింలు నమ్ముతారు. సమాజంలోని పెద్దలు చర్చించి ఎన్నుకున్నవారే నాయకుడు (ఖలీఫా) కావాలని వీరు భావించారు. దీని ప్రకారం, ప్రవక్తకు అత్యంత సన్నిహితుడైన అబూ బకర్ మొదటి ఖలీఫా అయ్యారు. వీరు ప్రవక్త సంప్రదాయాలను (సున్నత్), ఖురాన్‌ను అనుసరిస్తారు. మతపరమైన అంశాల్లో ఖలీఫాకు రాజకీయ అధికారం ఉంటుంది కానీ, అతను ప్రవక్త అంతటి దైవిక శక్తి కలవాడు కాదని భావిస్తారు.
షియాలు: ప్రవక్త తన వారసుడిగా తన అల్లుడు, మేనల్లుడు కూడా అయిన అలీ ఇబ్న్ అబీ తాలిబ్‌ను దైవిక ఆదేశం ప్రకారం ప్రకటించారని షియా ముస్లింలు నమ్ముతారు. నాయకత్వం కేవలం ప్రవక్త కుటుంబం (అహ్ల్ అల్-బైత్) నుండే రావాలన్నది వీరి వాదన. వీరి నాయకులను 'ఇమామ్' అని పిలుస్తారు. ఇమామ్‌లు దైవిక ప్రేరణ పొందినవారని, తప్పులు చేయనివారని నమ్ముతారు. ఇమామ్‌లకు ఖురాన్‌లోని నిగూఢ అర్థాలను వివరించే శక్తి ఉంటుందని షియాల విశ్వాసం. షియాలకు మొహర్రం నెల అత్యంత కీలకం. ప్రవక్త మనవడైన ఇమామ్ హుస్సేన్ కర్బలా యుద్ధంలో అమరుడైనందుకు గుర్తుగా వీరు తీవ్రమైన సంతాప దినాలను పాటిస్తారు.
ప్రపంచ ముస్లింలలో సున్నీలు సుమారు 85% నుంచి 90% ఉండగా, షియా ముస్లింలు సుమారు 10% నుంచి 15% ఉంటారు. షియాలు అధికంగా ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్నారు. భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో సున్నీలు, వారి తర్వాత షియాలు ఉన్నారు.
సున్నీ, షియా వర్గాల చారిత్రక యుద్ధాలు జరిగాయి, కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విభేదాలు కేవలం మతపరమైనవి మాత్రమే కావు, ఇవి అధికారం, వారసత్వం కోసం జరిగిన పోరాటాలు.
ఖలీఫాల కాలం (రాషిదున్ ఖిలాఫత్)లో చూస్తే... మహ్మద్ ప్రవక్త మరణం తర్వాత మొదటి ముగ్గురు ఖలీఫాల (అబూ బకర్, ఉమర్, ఉస్మాన్) పాలనను సున్నీలు అంగీకరించారు. కానీ షియాలు వీరిని ప్రవక్త వారసుడైన అలీ హక్కును కాలరాసిన వారిగా భావిస్తారు. నాలుగవ ఖలీఫాగా 'అలీ ఇబ్న్ అబీ తాలిబ్' బాధ్యతలు చేపట్టినప్పుడు విభేదాలు యుద్ధాలకు దారితీశాయి. ఆ తర్వాత ఈ రెండు వర్గాల మధ్యా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరిగాయి. అవి జెమల్ యుద్ధం, సిఫ్ఫిన్ యుద్ధం, కర్బలా యుద్ధం జరిగాయి. ఈ కర్బలా యుద్ధం (సామాన్య శకం 680) అత్యంత కీలకమైనది. ఇస్లాం చరిత్రలో సున్నీ-షియా విభజనను శాశ్వతం చేసిన ఘటన ఇది.
చరిత్ర ఇలా ఉంటే, ఈ సందర్భంగా ఒకసారి భారత ముస్లింల విస్మయకర వైఖరిని గమనిద్దాం..
భారతదేశంలోని ముస్లింలలో 85 నుంచి 90 శాతం సున్నీ ముస్లింలే.. రెండు రోజుల కిందట అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖొమేనీ (Ayatollah Ali Khamenei) మరణించినప్పుడు భారత్‌లోని సున్నీ ముస్లింలలో అత్యధికులు ఖొమైనీకి సానుభూతి తెలియజేస్తూ ఇరాన్‌కు మద్దతుగా ప్రతిస్పందిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. పాకిస్తాన్‌లోనూ ఇదే పరిస్థితి... అక్కడి నిరసనల్లో 20 మందికి పైగా ముస్లింలు చనిపోయారు. ఈ మృతుల్లోనూ అధికులు సున్నీలే.. అయితే, ఇరాన్ దాడికి గురైన సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, కతార్, యుఎఇ, ఒమాన్, బహ్రెయిన్ దేశాలలో సున్నీలే అధికమని, పైగా అవన్నీ సాటి ముస్లిం దేశాలేనని ఈ నిరసనకారులు విస్మరించడమే గాక ఇరాన్ బాధిత 'తమ' సున్నీ ముస్లిం దేశాల పరిస్థితి గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ దాడుల్లో అత్యధిక బాధితులు సున్నీ ముస్లింలే.. మరోవైపు ఇరాన్‌లోనే ఎందరో పౌరులు ఖొమేనీ మరణ వార్త తెలిసి ఎంతో సంతోషపడుతూ వేడుక చేసుకుంటున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉంటే ఇరాన్‌లోని ఆయతొల్లా అలీ ఖొమేనీ పాలనలో సున్నీ ముస్లింల పరిస్థితిపై ఒకసారి దృష్టి సారించాలి..
అయతొల్లా ఖొమేనీ ఇస్లామిక్ ఐక్యతను ప్రోత్సహించే ప్రసంగాలు చేసినప్పటికీ, ఇరాన్‌లో సున్నీ ముస్లింల పట్ల ఆయన వైఖరి ఒక క్రమబద్ధమైన వివక్ష, రాజకీయ అణచివేత, వారిని అట్టడుగున నెట్టివేయడంగా సాగింది. ఆయన పాలనలో సున్నీలు తమ విశ్వాసాలను ఆచరించడంలో అనేక ఆంక్షలను ఎదుర్కొన్నారు. ప్రధాన నగరాల్లో సున్నీ మసీదుల నిర్మాణాన్ని నిషేధించడం, సున్నీ మత నాయకులను వేధించడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
రాజకీయ బహిష్కరణ - వివక్ష:
1979 విప్లవం తర్వాత, నూతన రాజ్యాంగం షియా మతతత్వ రాజ్యాన్ని సుస్థిరం చేసింది. ఇది సున్నీ ఇరానియన్లను ప్రభుత్వంలోని ఉన్నత పదవుల నుండి క్రమబద్ధంగా మినహాయించింది.
మత స్వేచ్ఛ అణచివేత:
ఖొమేనీ బహిరంగంగా ఐక్యత గురించి పిలుపునిచ్చినప్పటికీ, ఆయన ప్రభుత్వం సున్నీల మతపరమైన, విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలను తీవ్రంగా పరిమితం చేసింది. సున్నీ సాహిత్యానికి ఆంక్షలు విధించారు, సున్నీలకు చెందిన అనేక మసీదులు, మదరసాలను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది.
లక్షిత హింస:
అధికారులు సున్నీ మత నాయకులను, కార్యకర్తలను వేధించడం, జైలులో పెట్టడం.. కొన్ని సందర్భాల్లో చట్టవిరుద్ధంగా హత్య చేయడం వంటి ఘటనలు నివేదికల ద్వారా తెలుస్తున్నాయి.
ప్రాంతీయ అణచివేత:
సున్నీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా సిస్తాన్-బలూచిస్తాన్, కుర్దిస్తాన్ వంటి చోట్ల తీవ్రమైన భద్రతా చర్యలు చేపట్టగా నిరసనకారులపై హింస కొనసాగింది. ఇది అక్కడ భయాందోళనలతో కూడిన వాతావరణాన్ని సృష్టించింది.
సైద్ధాంతిక అణచివేత:
ఇరాన్‌లోని పాలక వర్గం, సెమినరీలు తరచుగా సున్నీలను "వహాబీలు" లేదా "పాషండులు"గా చిత్రీకరించేవి. ఈ ముద్రలను ఉపయోగించి వివక్షను, సున్నీ వ్యతిరేక భావజాలాన్ని సమర్థించుకునేవారు, ఇది విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది.
క్లుప్తంగా చెప్పాలంటే, ఖొమేనీ కాలం సున్నీలను రెండవ తరగతి పౌరులుగా చూసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. 'ట్వెల్వర్ షియా' (Twelver Shi'a) చట్రంలో అధికారాన్ని కేంద్రీకరించడం, సున్నీల వ్యతిరేకతను జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించడంపైనే ఆయన పాలన దృష్టి పెట్టింది.
ఇదంతా ఇలా ఉంటే, ఇరాన్‌లో మహిళల దీనాతిదిన పరిస్థితులు, బాలలపై జరిగే అకృత్యాల గురించి పుంఖానుపుంకాలుగా దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. వీటిని తవ్వి తీస్తే అదొక అరాచకాల చరిత్రే అవుతుంది.