దేశానికి జనాభా నియంత్రణ చట్టం అత్యంత అవసరమని త్రిస్సూర్ కొలత్తూర్ అద్వైతాశ్రమ పీఠాధిపతి స్వామి చిదానంద పురి అన్నారు. అలాగే దేశం నిరంతరంగా అభివృద్ధి పథంలోనే వుండాలని, 2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా వుండాలన్నారు. లేకపోతే నిద్రపోతూ, సోమరిపోతులం అవుతామన్నారు. ఇదే మనం మన జీవితంలో నేర్చుకునే పాఠమన్నారు.
ఏకనాథ్ రాణడే స్థాపించిన వివేకానంద కేంద్రకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జనాభా నియంత్రణ చట్టం చేయకపోతే అభివృద్ధి అనేది కష్టతరం అవుతుందని, ప్రజలకు సైద్ధాంతిక ఆదర్శాలుండాలని, అప్పుడే అభివృద్ధి అనేది వారి జీవితాల్లో భాగం అవుతుందన్నారు. ఒక రంగంలోకి అడుగుపెట్టే ముందే ఇదే తమ కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలని సూచించారు.
గత ఐదు దశాబ్దాలుగా కేరళ యువత చేగువేరాతో తెగ ప్రేరణ పొందుతున్నారని, ఆ వ్యక్తి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడని అన్నారు. అయినా సరే.. ఇప్పటికీ విద్యుత్ స్తంభాలపై చేగువేరా చిత్ర పటాలు వేలాడుతూనే కనిపిస్తుంటాయన్నారు.
యువత ముందు సరైన ఆదర్శనీయ వ్యక్తిని చూపించడం ఇప్పుడు అత్యంత అవసరమని స్వామీజీ నొక్కి చెప్పారు. అలాగే ప్రస్తుతం ఏకనాథ్ రాణడే గురించి నేటి యువతకు అవగాహన కల్పించాలని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి తెలియజేయడం కూడా అత్యంత అవసరమేనన్నారు. వీటితో పాటు ప్రాచీన గురుపరంపరను కూడా యువతకు అందజేయాలన్నారు.
గురు అనే పదం కేవలం సాధు సంతులకు మాత్రమే వర్తించని, సాధు సంతులు దేశ రక్షణకు ప్రతిరూపాలని అభివర్ణించారు. వీరి గురించి యువతకు బోధించాలన్నారు. ప్రస్తుతం చరిత్రను వక్రీకరిస్తున్నారని, అందుకే ఒకసారి తిరిగి వెనక్కి చూసుకొని, చీకటి నుంచి వెలుగులోకి నడిపించే వారి గురించి బోధించాలన్నారు.
తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే వారిని, మూఢ నమ్మకాలను ప్రేరేపించేవారి గురించి కాకుండా ఆ దేశం గురించి తెలిసిన గొప్ప గొప్ప వ్యక్తులను యువతకు పరిచయం చేయాలన్నారు. గత కొన్నేళ్లుగా తాను ఇదే పనిలో వున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా వేదగురు సదానంద స్వామిజీ, అయ్యకాళీ, శ్రీ నారాయణ గురుదేవ్, చట్టాంబీ స్వామీజీ, మన్నత్ పద్మనాభన్ గురించి, వీరు సమాజానికి చేసిన సేవల గురించి వివరించారు.
విద్యుత్ కోతలను అధిగమించిన రాష్ట్రం కేరళ అంటూ ఈ మధ్య తెగ హోర్డింగులు కనిపిస్తున్నాయని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర ప్రభుత్వ జోక్యం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. 10 సంవత్సరాల క్రితం వరకు, కేవలం రెండు గ్రిడ్‌లు మాత్రమే అనుసంధానించబడ్డాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం నాలుగు పవర్ గ్రిడ్‌లను కలిపింది. ఆ విధంగా విద్యుత్ మొత్తం దేశానికి చేరుకుంది. ఇప్పుడు, మనది విద్యుత్ మిగులు దేశం. అని పేర్కొన్నారు.