అభివృద్ధి కాంతుల్లో ‘‘కర్రెగుట్టలు’’.. రోడ్లు, ఎకో టూరిజం దిశగా అడుగులు

VSK Telangana    08-Apr-2026
Total Views |

dgp
 
తెలంగాణ ప్రభుత్వం నక్సల్స్ విముక్త రాష్ట్రంగా అవతరించింది.డీజీపీ శివధర్ రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు.తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతరించిందని ప్రకటించారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టుల ఉనికి ఇప్పుడు తెలంగాణలో లేదన్నారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పాటు కీలక నాయకత్వం, భద్రతా బలగాల వ్యూహంతో నక్సల్స్ పూర్తిగా పతనం అయ్యారన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాలు నక్సల్స్ రహిత జోన్లుగా మారాయని, ప్రజలు కూడా పూర్తి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని ప్రకటించారు.  అటవీ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శివధర్ రెడ్డి మంగళవారం కర్రెగుట్టల ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  
 
ఈ సందర్భంగా పామునూరు ఆపరేటింగ్ బేస్ సమీపంలో ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్, పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణానికి పోలీసు అధికారులతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో మురుమూరు నుంచి పామునూరుకు, అక్కడి నుంచి తడపల అనే ప్రాంతానికి 13 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టారు కూడా. మట్టి రోడ్డు పనులను కూడా పూర్తి చేయనున్నారు.
 
అలాగే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఏకో టూరిజంగా కూడా అభివృద్ధి చేయనున్నారు. పామునూరు గుట్టలపై నివసిస్తున్న ఏడు ఆదివాసీ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు రవాణా కోసం ఆటోలను, బైక్ లను కూడా పోలీసు శాఖ పంపిణీ చేసింది. దీంతో వారికి పట్టణాలకు, గ్రామానికి మధ్య కనెక్టివిటీ అవుతుంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా వారికి అందేట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్రెగుట్టలు ప్రాంత అభివృద్ధికి అటంకంగా ఉన్న సమస్య చాలా వరకు తీరిపోయిందని డీజీపీ శివధర్​ రెడ్డి అన్నారు. అభివృద్ధికి దూరమైన ప్రాంతాలను మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలని, అలా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని కేంద్ర, రాష్ట్రాలు భావించాయని తెలిపారు. ఏ ప్రాంతం అయిన బాగుండాలంటే మౌలిక వసతులు, భద్రత బాగుండాలన్నారు.
 
కొన్ని కారణాల వల్ల కర్రెగుట్టల్లో అభివృద్ధికి దూరమైందని, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. మున్ముందు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ నక్సల్స్​ విముక్త ప్రాంతంగా మారిందని వివరించారు. పామునూరు గ్రామస్థులకు బియ్యం, నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లను డీజీపీ పంపిణీ చేశారు. అటవీ చట్టాలను ఉల్లంఘించకుండా కర్రెగుట్టల్లో రోడ్లు వేస్తున్నామని తెలిపారు.
 
అలాగే దశాబ్దాలుగా సమాజానికి దూరంగా వున్న గిరిజనుల బాగోగులను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. వారికి స్వయంగా కానుకలు అందజేశారు. వారిలో ధైర్యం నింపారు. శాంతిభద్రతల సమీక్షతో పాటు గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
 
dgp23
 
అత్యంత కీలకమైన ఆపరేషన్లు.. కర్రెగుట్టల్లోనే...
 
కర్రెగుట్టలు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా వుండేది. ఇందుకు అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణం. ఈ గుట్టలు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తరించి వున్నాయి. మావోయిస్టులు ఆపరేషన్ ను ఎదుర్కోవాల్సి వస్తే... వెంటనే మరో ప్రాంతానికి వేగంగా, సులభంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. ఈ గుట్టలు అత్యంత ఎత్తుగా, దట్టమైన చెట్లతో, లోయలతో కూడిన ప్రాంతం. బలగాలు వేగంగా, సులభంగా వెళ్లడానికి కూడా అవకాశం వుండదు. గెరిల్లా యుద్ధానికి, నక్సల్స్ తలదాచుకోవడానికి అత్యంత ప్రముఖమైన ప్రాంతం.
 
అయితే.. ఈ కర్రె గుట్టల్లో మావోయిస్టు అగ్రనాయకులకు చెందిన బంకర్లు కూడా వున్నాయి. దీంతో వారు దీర్ఘకాలికంగా ఇక్కడే వుండేవారు. అలాగే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ వుండేవారు. సుమారు 4 నుంచి 5 వేల మంది నక్సల్స్ ఈ ప్రాంతంలో వుండేవారు.
 
గత యేడాదిలో భారీ ఎన్ కౌంటర్...
 
ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రె గుట్టలను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు వ్యూహం రచించాయి. ఇందుకోసం చాలానే శ్రమించాయి. నావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో ముందుకు సాగేవారు. అలాగే హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, సరుకులు కూడా సరఫరా చేసేవారు.
అయితే గత యేడాది ఏప్రిల్ మాసంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 30 మంది నక్సల్స్ హతమయ్యారు. దాదాపు 10 వేల మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలే టార్గెట్ గా ఆపరేషన్ నిర్వహించాయి. చివరికి ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి ముఖంగా పయనిస్తోంది.
 
మావోయిస్టు అగ్రనేత హిడ్మా అక్కడే వున్నాడన్న సమాచారంతో భద్రతా బలగాలు మరింత పట్టు పెంచుకున్నాయి. చాలా రోజుల పాటు అత్యంత జాగరూకతతో కూంబింగ్ నిర్వహించాయి. అయితే గత యేడాది ఏప్రిల్ మాసంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 30 మంది నక్సల్స్ హతమయ్యారు. దాదాపు 10 వేల మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలే టార్గెట్ గా ఆపరేషన్ నిర్వహించాయి.
 
భద్రతా బలగాలకు దీనిని స్వాధీనం చేసుకోవడం కాస్త సవాల్ గానే మారింది. ‘‘సేవ్ కర్రెగుట్టలు’’ అంటూ నక్సల్స్, అర్బన్ నక్సల్స్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ కి వ్యతిరేకంగా ప్రతిఘటించారు. భద్రతా బలగాలు తమ ప్రాంతంలోకి రాకుండా వుండేందుకు భారీగా మందుపాతరలు కూడా అమర్చారు. అలాగే కర్రె గుట్టల వైపు రావొద్దని కర పత్రాలు కూడా పంచిపెట్టారు. అయినా సరే భద్రతా బలగాలు బెదరకుండా 25 వేల మంది కూంబింగ్ నిర్వహించారు.
 
ఈ ప్రాంతాన్ని వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి సురక్షిత ప్రాంతంగా ఉపయోగించుకుంటున్న దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (DKSZC), తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC), పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) నంబర్ వన్ బెటాలియన్ మరియు ఇతర మావోయిస్టు గ్రూపుల ప్రభావాన్ని నిర్మూలించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం.
 
కర్రె గుట్టలపై జాతీయ జెండా...
 
అప్పట్లో ఏకంగా తొమ్మిది రోజుల పాటు భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. కాస్త పట్టు సాధించిన తర్వాత కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఎగరేసి, సక్సెస్ అయ్యామంటూ ప్రకటించారు. అలాగే మెళ్లి మెళ్లిగా బేస్ క్యాంపును భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకున్నాయి. అబూజ్ మఢ్ తర్వాత అతి కీలకమైన ప్రాంతం కర్రెగుట్టలే.