ఒక బలమైన,ఆదర్శవంతమైన దేశ నిర్మాణానికి సద్గుణ సంపన్నమైన సమాజమే ప్రాథమికమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. జగద్గురు ద్వారాచార్య శ్రీ మలుక్ దాస్ మహారాజ్ 452 వ జయంతి ఉత్సవాలు బృందావన్ లో జరిగాయి. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ సాధు సంతుల మహిమలను ప్రస్తావించారు. సాధువుల స్వభావం ఓ పర్వతం లాంటిదని,ఇతరులలోని అత్యల్పంగా వుండే సద్గుణాన్ని సైతం కొండంతగా చెబుతారన్నారు. దానిని ఓమహత్తర విషయంగా చెబుతారన్నారు.
అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి కూడా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య పరిధిలో మంచి వ్యక్తులు ముందుకు రావడం అత్యంత శ్రేయస్కరం అని అన్నారు. అలాగే అత్యంత ఆవశ్యకమని కూడా నొక్కి చెప్పారు. మనది మంచి ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ఇందులోకి మంచి వారే రావాలన్నారు. అయితే.. తాను ఓ పార్టీ గురించి గానీ, వ్యక్తి గురించి గానీ మాట్లాటం లేదని స్పష్టతనిచ్చారు. తాను మంచి వారి గురించే మాట్లాడుతున్నానని, మంచి వారు ఎప్పుడూ మంచే చేస్తారన్నారు.
అయితే వ్యవస్థలో మంచి వ్యక్తి ఓ ఉన్నత స్థానంలో వుండాలంటే మొదట సామాన్య ప్రజలు సద్గుణవంతులుగా అవ్వాలని, అలా వుండటం అత్యంత అవసరమని అన్నారు. అలాగే మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ప్రతినిధులను ప్రజలే ఎన్నుకొని చట్టసభలకు పంపుతారని, అందుకే ప్రజలే అవినీతిపరులుగా వుంటే, ప్రతినిధులు కూడా అనివార్యంగా అవినీతిపరులే అవుతారన్నారు.
ఇక.. భారత్ మాత్రమే ఈ ప్రపంచానికి ఆత్మ అని పునరుద్ఘాటించారు. భారత్ నిలిచి వుంటేనే ప్రపంచం మనుగడ సాగిస్తుందని, భారత్ తన పూర్ణమైన వైభవంతో సగర్వంగా నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచమంతటా తేజస్సు, ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయన్నారు. భారతదేశం మరోసారి 'విశ్వ గురువు'గా అవతరించి, ప్రపంచాన్ని ఒక నూతనమైన, సుఖమయమైన మరియు సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే సమయం ఆసన్నమైందని, ఈ దిశగానే సాధుసంతులు క్రియాశీలకంగా కృషి చేస్తున్నారన్నారు.
అలాగే గోరక్షణ ఆవశ్యకత గురించి కూడా మోహన్ భాగవత్ ప్రస్తావించారు.గోరక్షణ అనేది సమాజంలో అత్యంత అవసరమని, అయితే ఇది కేవలం వ్యవస్థలను ఏర్పాటు చేయడం, చట్టాలను రూపొందించడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు.అయితే అధికారంలో వున్న వారికి గోరక్షణ పట్ల కాంక్ష వుందని, అయితే చర్యలు తీసుకునే ముందు, ఈ విషయంపై సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం ఏర్పాడాల్సిందేనన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడమే అసలైన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం గనక దృఢంగా నిలిస్తే, వ్యవస్థ దానికి తలవంచక తప్పదన్నారు. సమాజాన్ని గోభక్తులుగా మార్చితే, గోవధ దానంతటదే ఆగిపోతుందన్నారు.
ప్రస్తుత వైజ్ఞానిక యుగంలో, గోమాత పట్ల గల దృక్పథాన్ని ప్రస్తావిస్తూ, మనం కేవలం 'ఆవు మన తల్లి' అనే భక్తి భావనకు మాత్రమే పరిమితం కాకూడదని, శాస్త్రీయ ప్రాతిపదికన కూడా గోవు ప్రాముఖ్యతను నిరూపించాలని సూచించారు.అలాగే నేటి ఆధునిక యుగంలో స్వదేశీ గో ప్రాముఖ్యాన్ని కేవలం భారత ప్రజలకే కాకుండా, యావత్ ప్రపంచానికి అర్థం చేయించాలన్నారు. ఆవు పాలు, పంచగవ్యాల ప్రయోజనాలు, వ్యవసాయ రంగంలో వాటి ఉపయోగాలను కూడా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు శిక్షణ ఇస్తే కూడా మంచిదని పిలుపునిచ్చారు.ఈ శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా మనం సమాజంలో అవగాహన కల్పిస్తున్న కొద్దీ, గోరక్షణ అనేది యావత్తు భారత జాతి యొక్క సమిష్టి సంకల్పంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని, ఆ సంకల్పం తక్షణమే నెరవేరుతుందని నొక్కి చెప్పారు.
ధర్మ మార్గంలో పయనించాలంటే, ముందుగా తనలోని అహాన్ని జయించాలని భాగవత్ సూచించారు. ధర్మం అనేది సత్యం, కరుణ, పవిత్రత, తపస్సుపై ఆధారపడి వుంటుందని, వీటిలో కరుణ అత్యంత ఆవశ్యకమైందని, ఎందుకంటే.. కరుణ లేకపోతే ధర్మాన్ని ఊహించడమే సాధ్యం కాదని వివరించారు.