సంఘ్ సమగ్రతా స్వరూపం- ముఖ్యమైన విభాగాలు

    22-May-2026
Total Views |
rsss
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తైంది. ఈ సంవత్సరం ‘‘సంఘ కార్య శతాబ్ది’’. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీంతో దేశ ప్రజల్లో సంఘ్ వైపు మరింత ఆసక్తి, ఆకర్షణ పెరుగుతోంది. సంఘ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘ్ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో సంఘ్ స్వరూపం గురించి కొంత తెలుసుకుందాం.
 
సంఘ్‌ వ్యవస్థలో ముఖ్యమైన పని విభాగాలు:
 
 
1. శారీరిక్ విభాగము (వ్యాయామాలకు సంబంధించింది)

2. బౌద్ధిక్ విభాగము (సైద్ధాంతిక శిక్షణా విభాగం)

3. ప్రచారక్ వ్యవస్థ (పూర్తి సమయ కార్యకర్తల విభాగం)

4. ప్రచార విభాగము (ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విభాగం)

5. సంపర్క విభాగము (కొత్త వారికి సంఘ్‌ను పరిచయం చేసే విభాగం)

6. సేవా విభాగము (సేవా కార్యక్రమాలు నిర్వహించేది)

7. వ్యవస్థా విభాగము (స్వయంసేవకులకు వ్యవస్థిత జీవనాన్ని అలవాటు చేసే విభాగము)

8. కుటుంబ ప్రబోధన్ (కౌటుంబిక విలువలను ప్రబోధించే విభాగము)

9. గోసేవ (గో ఆధారిత జీవనాన్ని అలవాటు చేసే విభాగము)

10. గ్రామ వికాస్ (గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే విభాగం )

11. ధర్మ జాగరణ విభాగము (ధర్మ ప్రచార విభాగం)
 
12. పర్యావరణ విభాగము (ప్రకృతి సంరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు)
 
13. సమరసత విభాగము  (కులాలకు అతీతంగా జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో సమాజంలో సమరస భావనను నెలకొల్పేందుకు..)
 
సమాజంలో జాతీయ స్ఫూర్తిని బలోపేతం చేయడం కోసం స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో సమన్వయంతో ఈ విభాగాలు పనిచేస్తుంటాయి. యోజన చేయడం, అమలు చేయడం, సమీక్ష చేయడం అనేది నిరంతరంగా సంఘ్‌లో జరుగుతుంది. ‘‘అనువర్తి బైఠక్, సమీక్షా బైఠక్ అని కూడా జరుగుతాయి.
ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు వున్నాయా? అని తెలుసుకోవడానికి స్థానిక, ప్రాంత, క్షేత్ర, అఖిల భారత స్థాయి కార్యవర్గమంతా వారి వారి స్థాయిలో నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉంటారు.
 
అలాగే సంఘ్‌లో శిక్షాణా శిబిరాలు వర్గలు కూడా నడుస్తుంటాయి.25 రోజుల పాటు శిక్షార్థులందరూ కలిసి మెలిసి ఒకేచోట వుంటారు. ఒకేచోట భోజనం కూడా చేస్తారు. శిక్షణ సమయంలో శిక్షణ సరిగ్గా అర్థం కావడానికి బృందాలుగా విడదీస్తారు. వాటినే సంఘ్ పరిభాషలో ‘‘గణలు’’ అంటారు. ఇక.. బౌద్థిక్ అంశాల సమయంలో వుండే బృందాలను ‘‘ఘట’’ అని అంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయవీరుల పేర్లు, దేశ భక్తుల పేర్లు వీటికి పెడుతుంటారు. ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. దీని ద్వారా స్వయంసేవకులకు జాతీయ దృక్పథం అలవడుతుంది.