సంఘ శిక్షావర్గ (సామాన్య) - సార్వజనికోత్సవంలో ప్రస్తుతించిన వక్తలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వందేళ్ళుగా దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థసేవ చేస్తూ స్వామి వివేకానందుడు ఆశించిన యువశక్తిని తయారుచేస్తోందని, పంచపరివర్తన ద్వారా హిందూ సమాజంలో తామంతా ఒక్కటేనన్న భావనను కలిగిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నదని RSS-తెలంగాణ శుక్రవారం నిర్వహించిన సంఘ శిక్షావర్గ (సామాన్య) - సార్వజనికోత్సవంలో వక్తలు కొనియాడారు. భాగ్యనగర్‌లోని నాదర్‌గుల్‌లో ఉన్న విద్యాభారతి విజ్ఞానకేంద్రంలో జరిగిన సార్వజనికోత్సవం హిందూ సంఘటనకు, భారతీయతకు ప్రతిబింబమై శిక్షార్థుల దేశభక్తికి ప్రతిభాపాటవాలకు వేదికై నిలిచింది.
సార్వజనికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోహియా గ్రూప్ అధినేత కన్హయ్య లాల్ లోహియా ప్రసంగిస్తూ RSS సారథ్యంలో రాష్ట్ర చేతనకు నడుంబిగించిన స్వయంసేవకుల ముఖాలలో ఆ చైతన్యాన్ని తాను చూస్తున్నానని ప్రశంసించారు. స్వాతంత్రోద్యమ కాలంలోను, దేశవిభజన సమయంలోను జాతికి స్వయంసేవకులు అండగా నిలిచారని, విపత్తుల వేళ ప్రజలకు తోడై నిలిచి ఆకలి తీర్చడంతో పాటు ఔషధాలు అందించి, అంతిమ సంస్కారాలు సైతం చేసిన సందర్భాలను తాను కళ్ళారా చూశానని, కేవలం దేశభక్తి గలవారు మాత్రమే ఇలా చెయ్యగలరని అన్నారు. సంఘ్‌లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే తప్ప వ్యక్తిగతం కాదన్నారు. తాము వ్యాపారం చేస్తున్నప్పటికీ అది కేవలం లాభాల కోసం కాదని, దేశ వికాసం కూడా అందులో భాగమై ఉందని కన్హయ్య లాల్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, విద్యా వికాసం, గోసేవలకు వ్యాపార రంగం ఉపయోగపడాలని తాను నమ్ముతానని, నర సేవే నారాయణ సేవ అని, RSS ఇదే చేస్తున్నదని తన మనోగతాన్ని వెల్లడించారు. ఈ శిక్షావర్గలో శిక్షణ పొందినవారంతా భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలుస్తారని తాను ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్య వక్తగా పాల్గొన్న RSS తెలంగాణ ప్రాంత సహకార్యవాహ శ్రీ ఎర్ర నర్సింగ్ మాట్లాడుతూ నూరేళ్ళ సంఘ్ ప్రస్తానాన్ని ప్రస్తావించారు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పుట్టుకతోనే దేశభక్తులని, కలకత్తాలో విప్లవ సంస్థ అనుశీలన సమితిలోను, ఆ తర్వాత నాటి కాంగ్రెస్ పార్టీలోనూ దేశం కోసం బాధ్యతలను భుజానికెత్తుకుని స్వాతంత్ర్యం కోసం విప్లవయోధులు, సమరయోధులతో కలసి పనిచేసిన పరిస్థితులను వివరించారు. సువిశాలమైన, సంపద్భరితమైన మన భారతదేశం కేవలం గుప్పెడు మంది చేతుల్లో బందీ కావడాన్ని డాక్టర్ జీ తరచుగా ప్రశ్నించుకుంటూ చివరికి హిందూ సంఘటనమే ఇందుకు సరైన మార్గమని నమ్మి 1925లో కేవలం ఐదారుగురు పిల్లలతో సంఘ్‌ని ప్రారంభించారని, ఎన్నో పరిహాసాలు, నిరుత్సాహపూరితమైన మాటలు ఎదురైనప్పటికీ లెక్కచేయక ముందుకు నడిపించారని నర్సింగ్ వివరించారు. సంఘ్ పై 3 సార్లు నిషేధం విధించినప్పటికీ దృఢమైన సంకల్పంతో వాటిని దాటి ముందుకు రావడమే గాక, చైనా యుద్ధ జరిగినప్పుడు స్వయంసేవకుల త్యాగనిరతిని నాటి ప్రధాని నెహ్రూ కొనియాడి 1963లో రిపబ్లిక్ డే కవాతుకు ఆహ్వానించిన సంఘటనలను ముఖ్య వక్త ఆహూతులకు తెలియజేశారు.
అలాగే ఎమర్జెన్సీ నాటి నిషేధం, సంఘ కార్యకర్తలు ఎదుర్కున్న సవాళ్ళు, కృతనిశ్చయం, 1992లో రామాలయోద్యమ సమయంలో చోటు చేసుకున్న మరో నిషేధం, దానిని సైతం అధికమించిన వైనాన్ని నర్సింగ్ తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లోను సంఘ్ దేశం కోసమే కట్టుబడి ఉందంటూ విద్య, వైద్యం సహా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాద ఘటనల వేళ పరిస్థితులకు ఎదురీది సేవలను అందించడమే గాక ఈ క్రమంలో క్రైస్తవులు, ముస్లింలు సైతం స్వయంసేవకులను ప్రశంసించిన ఘటనలను ఉదహరించారు. సంఘ్ ద్వారా దాదాపు లక్షా 30 వేలకు పైగా సేవలు కొనసాగుతున్నాయన్నారు. మాయ మాటలు చెప్పి మతం మార్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచపరివర్తన ద్వారా హిందూ సమాజంలో తామంతా ఒక్కటేనన్న భావనను కలిగిస్తూ దేశాన్ని సంఘ్ ముందుకు నడిపిస్తున్నదని పేర్కొంటూ మన దేశాన్ని వ్యాపారం ద్వారా నియంత్రించాలని భావించే గ్లోబల్ మార్కెట్ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీకి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని నర్సింగ్ పిలుపునిచ్చారు. సంఘ్‌లోని నిత్యశాఖ శక్తికేంద్రంగా, వ్యక్తి నిర్మాణ వ్యవస్థగా, సంస్కార నిలయంగా యువతను తీర్చిదిద్దుతున్నదని తెలిపారు. త్రేతాయుగంలో యజ్ఞస్థలం శక్తికేంద్రంగా ఉండేదని, నేడు సంఘ స్థాన్ అటువంటి సామాజిక శక్తికేంద్రంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర సంచాలక్ డాక్టర్ వామన్, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బర్ల సుందర్ రెడ్డి, వర్గ సర్వాధికారి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. మే 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ జరిగిన సంఘ శిక్షావర్గ (సామాన్య)లో మొత్తం 260 మంది శిక్షార్థులు పాల్గొన్నారని, 15వ తేదీన 94 కుటుంబాలతో మాతృహస్త భోజన కార్యక్రమం విశేషంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా, విభాగ్, ప్రాంత, క్షేత్ర, అఖిలభారత స్థాయి అధికారులు శిక్షార్థులకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. సార్వజనికోత్సవంలో భాగంగా రక్షణ, నియంత్రణ, సమాజహితం లక్ష్యంగా నేర్చి స్వయంసేవకులు ప్రదర్శించిన పథసంచలన్, పద విన్యాస్, దండ వ్యాయామ్, నియుద్ధ, ద్వంద్వ యుద్ధం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘోష్ వాద్య ప్రదర్శన, శాఖలోని ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.