
చేతిలో పైసల్లేవు, తినడానికి తిండి లేదు. దేహీ అంటూ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో నలిగిపోతూ, ఖజానా నింపుకోవడం కోసం అంతర్జాతీయ సంస్థల కాళ్ల వేళ్ల పడుతున్న పాకిస్తాన్, ఇప్పుడు ప్రపంచాన్ని బురిడీ కొట్టించడానికి ఒక వింత నాటకానికి తెరలేపింది. తన చరిత్రలో హిందూ, సిక్కు సంస్కృతులను తుడిచేయాలని ఏ వీధుల పేర్లయితే మార్చిందో... ఈరోజు అదే వీధులకు వెతుక్కుంటూ వచ్చి మరీ పాత పేర్లు పెడుతోంది.
విదేశీ నిధులు, పర్యాటకుల డాలర్ల కోసం రాత్రికి రాత్రే లాహోర్ నగర వీధులకు రంగులు మారుస్తోంది. ఈ తరుణంలో ప్రపంచాన్ని మెప్పించి, పర్యాటక నిధులు గుంజడం కోసం అది ఒక కొత్త పన్నాగాన్ని పన్నింది. అదే సమయంలో తన సొంత గడ్డపై మైనారిటీల రక్తం తాగుతూ, ఆధునిక బానిసత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది
పాకిస్తాన్ ఏర్పడినప్పుడు తాము భారత్ కంటే భిన్నమని నిరూపించుకోవడానికి 'ఇస్లామీకరణ' కార్డు తీశారు. హిందూ, సిక్కుల చరిత్రను ఉంచితే తమ ప్రత్యేక ముస్లిం దేశ సిద్ధాంతానికి విలువుండదని భావించి, ద్వేషంతో పేర్లన్నీ మార్చేశారు. ఆ గడ్డపై ఒకప్పుడు హిందువులు, సిక్కులు ఉండేవారనే నిజం భవిష్యత్తు తరాలకు తెలియకుండా చేయడం కోసం పాఠ్యపుస్తకాలతో పాటు వీధుల పేర్లను కూడా మార్చి చరిత్రను వక్రీకరించారు.
కానీ ఇప్పుడు లాహోర్ నగరంలో రాత్రికి రాత్రే సైన్‌బోర్డులు మారుతున్నాయి. నిన్నటి దాకా 'ఇస్లాంపురా' అని ఉన్న బోర్డును తీసి 'కృష్ణానగర్' అని తగిలించారు. 'రెహమాన్ గల్లీ' ని కాస్తా 'రామ్ గల్లీ' చేశారు. 'బాబ్రీ మసీద్ చౌక్' కాస్తా 'జైన్ మందిర్ చౌక్' గా మారిపోయింది. ఒకప్పుడు హిందూ, సిక్కు సంస్కృతులను తుడిచేయాలని ఏ వీధుల పేర్లయితే మార్చారో, ఈరోజు అదే పేర్లను వెతుక్కుంటూ వచ్చి మరీ పెడుతున్నారు.
ఇక ఇదంతా మన భారతీయ సంస్కృతిపై గౌరవంతోనా అని అనుకునేరు అస్సలు కాదు! అంతర్జాతీయంగా తాము "మతసహనం ఉన్న దేశం" అని కలరింగ్ ఇచ్చి ఐఎంఎఫ్ నుంచి లోన్లు, విదేశీ పర్యాటకుల నుంచి డాలర్లు గుంజడానికే ఈ వేషాలు.
ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా విరాసిల్లిన తక్షశిల భారతదేశ సంస్కృతికి, జ్ఞానానికి తలమానికం. శతాబ్దాల క్రితం విదేశీ దండయాత్రల వల్ల, ఆ తర్వాత వచ్చిన మతాంధత వల్ల ఆ చారిత్రక వారసత్వం ధ్వంసమైంది. అలాంటి పవిత్రమైన జ్ఞానక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేసిన అదే గడ్డ, ఇప్పుడు ఆర్థికంగా దివాళా తీసేసరికి... దానిని 'తక్సిల్' అని పిలుస్తూ పర్యాటక కేంద్రంగా మార్చి డాలర్లు సంపాదించాలని చూస్తోంది. ఇక వ్యాకరణ కర్త 'పాణిని' మావాడే అని డబ్బా కొట్టుకుంటోంది.
ఒకవైపు వీధులకు హిందూ పేర్లు పెడుతూ లౌకికవాద ముసుగు వేసుకుంటున్న పాకిస్తాన్, మరోవైపు తన దేశంలోని మైనారిటీలైన అహ్మదీలు మరియు బోహ్రా ముస్లింలను కుక్కలను చంపినట్లు చంపుతోంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం అహ్మదీలు ముస్లింలు కారు. వారు ప్రార్థనలు చేసుకుంటుంటే 'తెహ్రీక్-ఎ-లబ్బైక్' లాంటి తీవ్రవాద మూకలు మసీదులపై పడి మినార్లను కూల్చేస్తున్నారు.
నిన్నగాక మొన్న కరాచీ, సియాల్‌కోట్ వీధుల్లో అహ్మదీలను వీధిలోకి లాగి, ఇటుకలతో, రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన వారిని సమాధి చేస్తే, ఆ సమాధులను కూడా తవ్వి పారేసేంత రాక్షసత్వం అక్కడ రాజ్యమేలుతోంది. వ్యాపారాలు చేసుకునే ప్రశాంత జీవులైన బోహ్రా కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ బాంబు దాడులు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. వీరికి రక్షణ కల్పించాల్సిన పాకిస్తాన్ పోలీసులు, సైన్యం... హంతకులకు సెల్యూట్ చేస్తూ వేడుక చూస్తుంటారు. బయటి ప్రపంచానికి తాము రామనామం జపిస్తున్నట్లు నటిస్తూ, లోపల మాత్రం తోటి మనుషులను మతం పేరుతో నరకయాతన పెడుతున్న పాకిస్తాన్ పాలకుల జిత్తులమారీ బుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
పాకిస్తాన్‌లో 'గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్' ప్రకారం లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ బానిసలుగా బతుకుతున్నారు. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలోని ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలలో పేద హిందువులు, క్రైస్తవులు, వెనుకబడిన ముస్లింలను తాతల నాటి అప్పుల పేరుతో బానిసలుగా మగ్గించేస్తున్నారు. అక్కడ ఐదేళ్ల చిన్నారి నుంచి ఎనభై ఏళ్ల ముసలివాడి దాకా... కాళ్లకు బేడీలు లేవు కానీ, జీవితాంతం ఆ యజమానుల దగ్గర బానిసలుగా పనిచేయాల్సిందే. ఆడపిల్లలను ఇళ్లల్లో బానిసలుగా ఉంచుకుని అత్యాచారాలు చేయడం, బలవంతంగా నిఖా చేసుకోవడం అక్కడ నిత్యకృత్యం. చట్టాలు ఉన్నా అవి కేవలం కాగితాలకే పరిమితం. ఎందుకంటే ఆ బానిస యజమానులే అక్కడి రాజకీయ నాయకులు, ఎంపీలు!
రోగాన్ని దాచిపెట్టి, ముఖానికి పౌడర్ రాసుకుంటే ఆరోగ్యం కుదుటపడదు. పాకిస్తాన్ చేస్తున్న పని కూడా ఇదే. వీధుల పేర్లు మారిస్తే బోర్డులు మారుతాయేమో కానీ, మీ దేశంలో ఉన్న కుళ్ళు మారదు. డాలర్ల కోసం హిందూ పేర్లను వాడుకుంటూ, లోపల మాత్రం అహ్మదీలను, బోహ్రాలను నరికి చంపే మీ ద్విముఖ నీతిని ప్రపంచం గమనిస్తూనే ఉంది. బానిసల రక్తంతో, మైనారిటీల కన్నీటితో తడిసిన ఆ గడ్డపై... కేవలం వీధుల బోర్డులు మార్చి పవిత్రతను నటిస్తే ఏ దేవుడూ క్షమించడు. పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా ఈ జిత్తులమారీ వేషాలు పక్కనబెట్టి, సొంత ప్రజలను మనుషులుగా చూడటం నేర్చుకోకపోతే... ఆ దేశం త్వరలోనే చరిత్ర పుటల్లో ఒక విఫల దేశంగా మిగిలిపోవడం ఖాయం!