జాతీయతను, బాధ్యతను, సామూహికతను పెంచే సంఘ్ ‘‘పదజాలం’’

VSK Telangana    04-May-2026
Total Views |
 
RSS
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ఆజ్ఞలు వుంటాయి. అలాగే దానికంటూ ఓ ప్రత్యేకమైన పరిభాష వుంటుంది. దాని ఆధారంగానే స్వయంసేవకులు ఆజ్ఞలను పాటిస్తూ వుంటారు. ఈ భాష సాంస్కృతికంగా కూడా ప్రత్యేకమైనదే. అంతేకాకుండా మార్గదర్శకం కూడా. అయితే.. ఈ పదాల వినియోగం ఆధిపత్యం చూపడానికో, అధికారం చెలాయించడానికో, కాదు. పూర్తి వినయం, సేవ, ఐక్యత ఇందులో ఇమిడి వుంటాయి.
 
అయితే భాష అనేది కేవలం భాషా ప్రసార సాధనం మాత్రమే కాదు, విలువలు, భావోద్వేగాలకు కూడా సంబంధించింది. ఏదైనా సామాజిక, సాంస్కృతిక ఉద్యమ పరివర్తనను ప్రేరేపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది రూపొందించేది మొదట పదజాలమే. ఇదే ప్రధాన సాధనం. 1925 లో సంఘ్ ప్రారంభమైంది. అయితే.. క్రమశిక్షణకు, సమాజ సేవకు అంకితమైన సంస్థగానే కాకుండా, భాషా వినియోగంలో కూడా ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. నూతన ఆవిష్కర్తగా కూడా ప్రత్యేకతను చాటుకుంది.
 
అయితే ఆరెస్సెస్ ఓ విశిష్టమైన పదజాలాన్ని రూపొందించింది. దానిలోని ప్రతి కీలక పదం కూడా సాంస్కృతికంగా, జాతీయ స్ఫూర్తితో నిండే వుంటుంది. ఆరెస్సెస్ పదజాలం కేవలం సంస్థాగతమైన భాష మాత్రమే కాదు, అది పదాలలో నిక్షిప్తమైన సజీవ తత్వం కూడా.స్వయంసేవక్ నుంచి మొదలు పెడితే, బాధ్యత వరకూ ప్రతి పదం సమ్మిళితత్వాన్ని, సామూహికతను, వినయాన్ని, జాతీయతా భావాన్ని ప్రతిబింబిస్తుంది.
 
ఇతర సంస్థల పద జాలాలు అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చు కానీ,ఆరెస్సెస్ మాత్రం సేవా, ఐక్యతా భావానికి సంబంధించిన పదజాలంపై ఆధారపడుతుంది. ‘‘దాయిత్వ’’ (బాధ్యత) వంటి పదాలు నిజమైన బాధ్యతను గుర్తు చేస్తాయి కానీ, ఆధిపత్యాన్ని మాత్రం కాదు. 'శాఖ', 'పరివార్', 'సంఘ్' వంటి పదాలు ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే భారత మాత, రాష్ట్రం అనే పదాలు తరతరాల నాగరికతకు గుర్తింపుగా వుంటాయి. ఈ భాషా సంస్కృతే ఆరెస్సెస్ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. దాని భాషా పదజాలం చైతన్యాన్ని నింపుతుంది. జాతీయత అనేది రాజకీయాలకు అతీతంగా, పవిత్రమైన స్థాయికి చేరుకునేలా చేస్తుంది.
 
సంఘ్ పదజాల స్వభావంపై సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. ‘‘ఆరెస్సెస్ అధికారాన్ని సూచించే భాషను వాడదు. ఎప్పుడూ అనుబంధాన్ని సూచించే భాషనే వాడుతుంది. సేవ, పరివార్, దాయిత్వ వంటి మా పదాలు అరువు తెచ్చుకున్నవి కావు. అవి మా సంస్కృతి నుండే ఉద్భవించాయి, మమ్మల్ని ఒకే కుటుంబంగా ఏకం చేస్తాయి. సంఘంలో పదాలు కేవలం నామమాత్రపు లేబుళ్లు కావు, అవి సజీవ ఆచరణలు.” అని వివరించారు.
 
1. స్వయంసేవక్ : స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, నిస్వార్థంగా సేవ చేసేవారు. అలాగే ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవకు తనను తాను అంకితం చేసుకునేవాడు.అయితే ఇందులో వినయం ఇమిడి వుంది.సమాజానికి చేసే సేవ ద్వారానే అతను గుర్తింపును పొందుతాడు. ఎవరైనా స్వయంసేవకులు కావొచ్చు. కులం, మతం, ధనంతో సంబంధమే లేదు. ఇది సామూహికత్వాన్ని ప్రతిబింబిస్తుంది. స్వయంసేవకుడు తనను తాను ఓ బృహత్తర లక్ష్యంలో భాగంగా భావించుకుంటాడు.
 
2. ప్రచారక్ :భారత దేశపు మహోన్నత సాంస్కృతికతను పూర్తి స్థాయిలో వ్యాప్తి చేయడానికి అవివాహితునిగా వుండాలని నిర్ణయించుకున్న వారు. దేశ సేవకే పూర్తి సమయాన్ని వెచ్చించేవారు. ప్రచారక్ అంటే పదవి కాదు, అదో మానసిక స్థితి. కేవలం ‘‘ప్రచారకుడి’’ లాగానే కాకుండా క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, అంకిత భావంతో జీవితాన్ని గడుపుతూ భారతీయ సాంస్కృతిక, జాతీయ వైభవాన్ని చాటిచెప్పడానికి దేశమంతా పర్యటిస్తుంటారు. సంఘ్ ఎక్కడికి పంపిస్తే, అక్కడికి వెళ్లి, సంఘ కార్యాన్ని విస్తరిస్తారు. వినయానికి నిలువెత్తు నిదర్శనం ప్రచారక్. ఎందుకంటే సామాజిక సేవ కోసం వ్యక్తిగత సుఖాలను కూడా త్యజిస్తాడు. అయితే ప్రచారక్ అనే పదం ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి సన్యాసులు, గురువుల ప్రాచీన భారతీయ సంప్రదాయాలతో ముడిపడి వుంది.
 
3. సర్ సంఘచాలక్ : ఆరెస్సెస్ లో ఇది అత్యున్నతమైన బాధ్యత. ఓ రకంగా అధిపతి అన్న పదాన్ని సూచిస్తుంది. అధ్యక్షుడు లేదా నాయకుడు. సంఘ్ అంటే సమూహం, చాలక్ అంటే నడిపించేవారు. అయితే.. ఈ పదం డాబు, దర్పం, అధికారంతో వుండదు. సర్ సంఘచాలక్ పాలకుడు కాదు. కానీ.. సామూహిక సంకల్పాన్ని నిర్దేశించే ఓ మార్గదర్శి. నడిపించేవారు. ఈ పదం పూర్తి వినయాన్ని ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే అతను కూడా స్వయంసేవకులలో ఒకడు, కేవలం అతనికి ఎక్కువ బాధ్యత అప్పగించబడింది.
 
4. శాఖ : స్వయంసేవకులు ప్రతిరోజూ నిర్ణీత స్థలంలో, నిర్ణీత సమయంలో అందరూ కలుసుకోవడం. శాఖ అంటే యూనిట్, కణం కాదు. ఇదో కొమ్మ. ఇది పెరుగుదల, పాతుకుపోవడం అన్నదానికి ప్రతీక. ఒకే కాండానికి అనుసంధానించబడిన కొమ్మల వలె, శాఖ అనేది స్వయంసేవకులు సమావేశమై, శిక్షణ పొంది, బంధాలను ఏర్పరచుకునే ప్రదేశం. ఇది సమగ్రతను తెలియజేస్తుంది, ఎందుకంటే ప్రతి కొమ్మ మొత్తం చెట్టు యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది.
 
5. గురు దక్షిణ : అంటే గురువుకు పూర్తి కృతజ్ఞతతో తన, మన, ధన పూర్వకంగా గురువుకు సమర్పించే ఓ సంప్రదాయం. ఇది రుసుము గానీ, పన్ను గానీ కాదు. ఇదో సంప్రదాయం. మన శాశ్వత గురువు అయిన రాష్ట్రం పట్ల, దాని సంస్కృతి పట్ల కృతజ్ఞతను, వినయాన్ని ప్రదర్శించేది. సంస్కృతి పట్ల స్మరణను సూచిస్తుంది.గురుదక్షిణను సమర్పించడం ద్వారా, స్వయంసేవకులు తమ సాంస్కృతిక మూలాలతో తమకున్న అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటారు.
 
6. రాష్ట్ర : యూరో పరిభాషలో రాష్ట్ర అనేపదం జాతిని సూచిస్తుంది. జాతి-రాజ్యం"కు భిన్నంగా, రాష్ట్ర అనేది ఉమ్మడి సంస్కృతి, చరిత్ర మరియు సామూహిక స్మృతిని తనలో ఇముడ్చుకుంటుంది. జాతీయత అనేది అధికారికమైనది కాదని, అది ఒక ఆధ్యాత్మిక వారసత్వమని మరియు బాధ్యత అని ఈ పదం స్వయంసేవకులకు గుర్తు చేస్తుంది.
 
7. సంఘటన్ : ఐక్యతగా కలిసికట్టుగా వుండటం. దీని నుంచి ఉద్భవించిందే సంఘటన్. (సంస్థ). వ్యక్తికి కాకుండా సమూహానికే ప్రాధాన్యతనిస్తుంది. అంటే సంస్థకే ప్రాధాన్యం. ఆరెస్సెస్ పరిభాషలో సంఘటన్ అంటే సంకుచిత విభజనలకు అతీతంగా సమాజాన్ని సామరస్యపూర్వకంగా, సంపూర్ణంగా ఏకం చేయడం.
 
8. బలిదాన్ : బలిదానం అని అర్థం. బలవంతమైంది గానీ, విషాదకరమైంది గానీ కాదు. ధర్మ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను అర్ించిన భారత వీరుల స్ఫూర్తితో వుండే మహోన్నత త్యాగం. త్యాగమే అత్యున్నతమైన సేవా రూపమని ఇది స్వయంసేవకులకు బోధిస్తుంది.
 
9. పరివార్ : సంఘ్ తరుచుగా తనను తాను ఓ కుటుంబంగా అభివర్ణించుకుంటుంది. ఇది లాంఛనాలను తగ్గించి, ఆత్మీయతను, భావోద్వేగ అనుబంధాన్ని నెలకొల్పుతుంది. ఇది అందరినీ కలుపుకోయే తత్వాన్ని చూపిస్తుంది.ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరూ వెనుకబడి ఉండరు. అంతేకాకుండా, సంఘ్‌లోని ప్రతి స్వయంసేవక్‌కు, ఒక కుటుంబ సభ్యుడిలాగే, నిర్దేశించిన పరిమితులలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుంది.
 
10.దాయిత్వ : దాయిత్వ అంటే బాధ్యత. ఆర్‌ఎస్‌ఎస్ పదజాలంలో ఈ పదానికి ఉన్న విశిష్టమైన అర్థం, స్థానం కారణంగా ఇది ప్రత్యేక శ్రద్ధకు అర్హమైనది. దీని అర్థం బాధ్యత, కర్తవ్యం లేదా అప్పగించబడిన పాత్ర. పాశ్చాత్య భావనలైన “శక్తి” లేదా “అధికారం”లా కాకుండా, దాయిత్వ అంటే ఆజ్ఞాపించడం కాదు. అది వినయంతో, సున్నితత్వంతో నిర్వర్తించాల్సిన ఒక పాత్రను అప్పగించడం. సంఘ్‌లో ఒకరు అధికారాన్ని కలిగి ఉండరు; బాధ్యతను మోస్తారు. ఓ కార్యకర్తకు ఓ పనికోసం ఈ బాధ్యతను ఇస్తారు. ఇదేమీ అహంకారం ప్రదర్శించడానికి కాదు. వినయంతో బాధ్యతను నెరవేరుస్తారు. తనకు అప్పగించిన పనికి తాను యజమానిని కాదని, కేవలం సంరక్షకుడిని మాత్రమేనని అది ఆ కార్యకర్తకు గుర్తు చేస్తుంది.