హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణ విద్యార్థులపై సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం SFI దాడికి దిగింది. భారతీయ సంస్కృతిని, గోమాతను అవమానించేలా SFI ఓ నాటక ప్రదర్శనను నిర్వహించింది. దీంతో కొంత మంది విద్యార్థులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, శాంతియుతంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే SFI నేతలు విద్యార్థులపై దాడికి దిగారు. ఈ దాడిలో వారికి చాలా దెబ్బలు తాకాయి. వారు శాంతియుతంగా నిరసనకు దిగిన సమయంలో, చర్చలు చేయకుండా, ఏకంగా తమ సహజ లక్షణమైన ధోరణిలో దాడికి దిగారు. శారీరిక దాడులకు దిగడమే కాకుండా, బెదిరింపులకు కూడా దిగినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు.
మరో వైపు విద్యార్థులపై జరిగిన దాడిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడే అని అభివర్ణించింది. దాడి చేసిన వారిపై అడ్మినిస్ట్రేషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బాధిత విద్యార్థులకు ఏబీవీపీ పూర్తిగా అండగా వుంటుందని భరోసానిచ్చింది.
వారు ప్రదర్శించిన నాటకం హిందూ సమాజాన్ని అవమానించేలా వుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం తప్పు అని తెలిసినా.. కొందరు అధ్యాపకుల మద్దతుతో ఎస్ఎఫ్ఐ నాటకాన్ని కొనసాగించిందని ఏబీవీపీ మండిపడింది.తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సమాజంలో విభజన భావాలను వ్యాప్తి చేసేందుకు నాటక బృందం మరోసారి దీనిని ప్రదర్శించిందని పేర్కొంది.
నాటకంలో అవమానకరమైన భాషను వాడారని, హిందూ సంస్కృతిని, నాగరికతను అవమానించారని ఏబీవీపీ పేర్కొంది. నాటకంలోని అంశాలను వ్యతిరేకిస్తూ, ABVP కార్యకర్తలు శాంతియుతంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశమయ్యారు. ఈ శాంతియుత నిరసన సమయంలో, SFI మరియు ఇతర వామపక్ష సంఘాలకు చెందిన సభ్యులు ABVP కార్యకర్తలపై దాడి చేసి, వారిని గాయపరిచారని పేర్కొన్నారు.
ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు ఆయూష్ సింగ్ స్పందిస్తూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఏబీవీపీ గట్టిగా విశ్వసిస్తుందని, అయితే అటువంటి వ్యక్తీకరణ ఏ సమాజ మనోభావాలను దెబ్బతీయకూడదని లేదా సాంస్కృతిక విలువలను అగౌరవపరచకూడదని అన్నారు. ఇక్కడ విద్యార్థి సమాజం మనోవేదనకు గురైందని, దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు.
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలు, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, క్యాంపస్‌లో శాంతియుత సహజీవనంపై నేరుగా దాడి చేసినట్టే. హెచ్‌సీయూ వంటి విద్యాసంస్థలు విభిన్న అభిప్రాయాలను గౌరవిస్తూ చర్చలకు వేదిక కావాలి గానీ, అసమ్మతి వ్యక్తం చేసిన వారిపై హింసకు కాదు. ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి, క్యాంపస్ భద్రతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి.
మరికొన్ని ఉదాహరణలు
అయితే జాతీయవాదులపై, దేశభక్తులపై ఎస్ఎఫ్ఐ గూండాలు దాడికి దిగడం ఇదేమీ కొత్తకాదు. గతంలోనూ చాలానే జరిగాయి. గత యేడాది అక్టోబర్ లో కేరళలోని పతనం తిట్ట జిల్లాలోని పందళంలోని NSS కాలేజీలో జరిగింది.ఏబీవీపీ వారిని టార్గెట్ చేస్తూ... దూషిస్తూ దుర్భాషలాడారు. అలాగే ఏబీవీపీ నాయకులపై భౌతిక దాడులకు దిగారు.దీంతో ఏబీవీపీ పందళం పోలీస్ స్టేషన్ లో ఎస్ఎఫ్ఐ పై ఫిర్యాదు చేసింది.
అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ పై కూడా ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. ఓ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుంటూ పక్షపాత ధోరణితో వుంటున్నారని, కమ్యూనిస్టు విద్యార్థి విద్యార్థం ఎస్ఎఫ్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఏబీవీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.ఎస్ఎఫ్ఐకి భజన చేయడం, వారి పంచన చేరడం ప్రిన్సిపాల్ మానుకోవాలని ఏబీవీపీ హితవు పలికింది.
2. అలాగే ఆంధ్రా యూనివర్సిటీలో ఆరెస్సెస్ శాఖపై SFI, AISF గూండాలు దాడికి దిగారు. ఇది ఈ యేడాది ఫిబ్రవరి మాసంలో జరిగింది.సుమారు 8 గంటల సమయంలోనే 30 మంది వామపక్ష విద్యార్థి సంఘాల గూండాలు దాడికి దిగారు. అలాగే స్వయంసేవకులను పిడిగిద్దులు కూడా గుద్దారు. ఈ సమయంలోనే కొంత మంది పోలీసులు ఘటనా స్థలికి రావడంతో వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు పారిపోయారు.
ఫిబ్రవరి 1,2024 లోనూ హైదరాబాద్ లోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ సంఘటన జరిగింది. విద్యార్థి ఎన్నికల సమయంలో ఏబీవీపీకి మద్దతు పలికిన వారిపై SFI దాడికి దిగింది. కనీసం దివ్యాంగులన్న సానుభూతిని కూడా చూపకుండా ఎస్ఎఫ్ఐ నేతలు రాక్షసంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
క్యాంపస్ ఎన్నికలపై చర్చించేందుకు సర్వసభ్య సమావేశం జరిగింది. విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే.. వామపక్ష విద్యార్థులపై యాజమాన్యం వివక్ష చూపుతోందని వామపక్ష సంఘాల నేతలు, అలాగే ఎన్నికల కమిటీ విషయంలో పారదర్శకత లోపించిందని అటు ఏబీవీపీ నిరసనకు దిగింది.విద్యార్థి అవసరాలు, ప్రయోజనాలు, సంక్షేమం ప్రతిబింబించేలా ఎన్నికలు వుండాలని ఏబీవీపీ కోరింది.
దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మరుసటి రోజే వామపక్ష భావజాలం వున్న విద్యార్థి నేతలు కొందర్ని గదిలో బంధించి, బెదిరింపులకు దిగారు. దీంతో ఏబీవీపీ దీనిని నిరసిస్తూ, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత ఎన్నికల ప్రక్రియలో ఏబీవీపీ జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ, ఎస్ఎఫ్ఐ నిరసనకు దిగింది. ఇదే సమయంలో ఏబీవీపీ మద్దతుదారులపై ఎస్ఎఫ్ఐ దాడికి దిగింది.
3. జూన్ 22, 2025 లోనూ కేరళలో ఎస్ఎఫ్ఐ గూండాలు ఏబీవీపీ నేతలపై దాడులకు దిగారు. కేరళలో పీఎం శ్రీ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఏబీవీపీ విద్యా మంత్రి శివన్ కుట్టిని కలిసింది. అయితే.. సీపీఎం ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత నిరసనలకు దిగింది. అలాగే సచివాలయ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అలాగే జూన్ 20 నుండి, తిరువనంతపురం, కోజికోడ్ వంటి నగరాల్లో విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నల్లజెండా నిరసనలను ప్రారంభించారు.
ఏబీవీపీ ఇంత శాంతియుత, ప్రజాస్వామ్య నిరసనకు దిగినా.. విజయన్ ప్రభుత్వానికి రుచించలేదు. దీంతో తమ అనుబంధ విద్యార్థి సంఘం,నేర చరిత్ర వున్న ఎస్ఎఫ్ఐని రంగంలోకి దింపింది. ఏబీవీపీపై ప్రతీకార చర్యకు దిగింది.జూన్ 21 న రాత్రి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ రాత్రి భోజనానికి వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ గూండాలు దారుణంగా దాడి చేశారు ఆయన్ను చుట్టుముట్టి దారుణంగా కొట్టారు.
ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలే బయటకు వస్తాయి. ఎస్ఎఫ్ఐ చరిత్రే అంత. వామపక్ష నేతలు నిత్యం ప్రజాస్వామ్యాన్ని వల్లెవేస్తుంటారు కానీ, దానిని ఆచరణలో పెట్టరు. జాతీయవాదులన్నా, ఈ దేశమన్నా వారికి గిట్టదు. అలాగే ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు చేపట్టినా, వారికి రుచించదు. కనీసం మాట వినేందుకు కూడా సిద్ధంగా వుండరు. కేవలం దాడులకే దిగుతారు. హింసాత్మక చర్యలు వారి డీఎన్ఏలోనే వున్నాయి.