భాగ్యనగరంలో "ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ 2026" అవార్డుల ప్రదానం

VSK Telangana    01-Jun-2026
Total Views |

ayush

ఏ దేశమైనా ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే ప్రజల మధ్య ఐక్యత, శాంతి అత్యంత అవసరమని నమ్మిన మహనీయుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కొనియాడారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే పటేల్ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ఏకతాటిపైకి తెస్తూ ముందుకు నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

భారత్ భారతి సంస్థ ఆధ్వర్యంలో 'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్' అనే నినాదంతో, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం రాత్రి (31 మే 2026)న ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ మాట్లాడుతూ.. నాడు భాగ్యనగరం భారతదేశంలో విలీనం కావడం వల్లే, నేడు హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, విద్యా రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదగగలిగిందని గుర్తుచేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు మాట్లాడుతూ.. నేడు తెలంగాణ ప్రజలు తాము గర్వించదగ్గ భారతీయులమని చెప్పుకుంటున్నారంటే, దానికి నాడు సర్దార్ పటేల్ సాహసోపేతంగా చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’నే కారణమని స్పష్టం చేశారు.. అంతకుముందు, సర్దార్ పటేల్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నేతలు తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో దేశానికి విశేష సేవలు అందించిన 10 మంది ప్రముఖులకు "ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ 2026" అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల వివరాలు:

  1. డాక్టర్ బి. ఎస్. మూర్తి - డైరెక్టర్ (ఐఐటీ హైదరాబాద్), ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ (ఐఐటీ మద్రాస్) మరియు ప్రముఖ మెటీరియల్ సైంటిస్ట్.

  2. కన్నత్ సురేంద్రన్ - ప్రముఖ వ్యాపారవేత్త మరియు బిజినెస్ లీడర్.

  3. ఆయుష్ నడింపల్లి - సీఈఓ (ఆడ్రాయిటెక్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్), జనరల్ సెక్రటరీ (సంవిత్ కేంద్ర), డైరెక్టర్ (భారత్ ప్రకాశన్) - సాంకేతిక వ్యవస్థాపకత, ప్రజా భాగస్వామ్యం మరియు ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణంలో నాయకత్వం వహించినందుకు.

  4. జయా ప్రదా దేవి - సామాజిక కార్యకర్త, సేవా భారతి 'కిషోరి వికాస్ ప్రాజెక్ట్' లీడర్, మహిళా సాధికారత ప్రతిపాదకురాలు, ఫ్యామిలీ అండ్ చైల్డ్ కౌన్సిలర్.

  5. శ్రీనివాస అల్లూరి - వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు (మానవతా ఫౌండేషన్), వ్యవస్థాపకుడు (సన్‌దాత టెక్నాలజీస్).

  6. డాక్టర్ అనితా జగోతా - సీనియర్ ప్రొఫెసర్ (హైదరాబాద్ విశ్వవిద్యాలయం), న్యూరో బయాలజీ పరిశోధకురాలు, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరోసైన్సెస్ ఫెలో.

  7. డాక్టర్ జగన్నాథ్ నాయక్ - విశిష్ట శాస్త్రవేత్త & డైరెక్టర్ (CHESS) – DRDO, డిస్టింగిష్డ్ ఫెలో (ASI, INAE & IETE).

  8. మధురం రెడ్డి - పారిశ్రామికవేత్త, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడర్, స్థిరమైన వ్యవసాయ ప్రతిపాదకుడు (Sustainable Farming Advocate) మరియు అగ్రి-ఇన్నోవేటర్.

  9. జస్మత్ పటేల్ - గోసేవ (ఆవుల సంరక్షణ) నిర్వాహకులు, పరోపకారి, సామాజిక నాయకుడు మరియు మానవతావాది.

  10. డాక్టర్ బి. వి. రామ్‌కుమార్ - NIEPED, దివ్యాంగుల హక్కుల ప్రతిపాదకుడు, ఇన్‌స్టిట్యూషన్ బిల్డర్ మరియు పబ్లిక్ పాలసీ లీడర్.

 ఈ మహాసభలో రాజస్థాన్‌కు చెందిన మేవాడ్ మఠం పీఠాధిపతి రోహిత్ గోపాల్ శ్రుతిజీ మహారాజ్, బీజేపీ నాయకులు డాక్టర్ ఎన్.గౌతంరావు, వేముల అశోక్, అలాగే సంస్థ ప్రతినిధులు కపిల గోపాల సరస్వతి, నారాయణరెడ్డి, వినయ్ పత్రాలే, ఆలె భాస్కర్, జస్మంత్ పటేల్, సంజయ్ ఘనాతే తదితరులు పాల్గొన్నారు.